YS Sharmila: వైఎస్ షర్మిలకు అస్వస్థత, కేసీఆర్‌ను విమర్శిస్తూనే సొమ్మసిల్లి పడిపోయిన వైఎస్ఆర్టీపీ అధినేత
రైతులతో మాట్లాడాక మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ పై విమర్శలు చేస్తూనే షర్మిల కింద కూర్చుండిపోయారు.
వైఎస్ఆర్ టీపీ వ్యవస్థాపకురాలు వైఎస్ షర్మిల అస్వస్థతకు గురయ్యారు. ఆమె సొమ్మసిల్లి పడిపోయినట్లుగా పార్టీ శ్రేణులు తెలిపారు. తీవ్రమైన ఎండలో ఆమె మొక్కజొన్న రైతులతో మాట్లాడుతుండగా ఈ ఘటన జరిగింది. రైతులతో మాట్లాడాక మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ పై విమర్శలు చేస్తూనే షర్మిల కింద కూర్చుండిపోయారు. షర్మిలకు వడదెబ్బ తగిలిందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. కింద కూర్చుండిపోయిన ఆమెకు చుట్టుపక్కల ఉన్నవారు, భద్రతా సిబ్బంది గాలి విసిరారు. నేలపై కూర్చోబెట్టి నీళ్లు తాగించారు. కాసేపు విశ్రాంతి తీసుకునేలా చేయడంతో తిరిగి షర్మిల కోలుకున్నారు. కొంత సేపటి తర్వాత తేరుకొని మళ్లీ షర్మిల మీడియాతో మాట్లాడారు.
‘‘వైరా నియోజకవర్గంలో పంట నష్టపోయిన రైతన్నల సమస్యలు తెలుసుకున్న వైయస్ షర్మిల గారు మీడియాతో మాట్లాడుతున్న సమయంలో అస్వస్థతకు గురై పొలంలోనే కింద పడిపోయారు’’ అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఓ ట్వీట్ చేసింది.
వైరా నియోజకవర్గంలో పంట నష్టపోయిన రైతన్నల సమస్యలు తెలుసుకున్న వైయస్ షర్మిల గారు మీడియాతో మాట్లాడుతున్న సమయంలో అస్వస్థతకు గురై పొలంలోనే కింద పడిపోయారు. pic.twitter.com/vTijpClql4
— YSR Telangana Party (@YSRTelangana) April 30, 2023
ఖమ్మం జిల్లా పాలేరు నియోజక వర్గం నేలకొండపల్లి మండలం ముటాపురం వీరన్న స్వామి ఉత్సవాల్లో వైయస్ షర్మిల పాల్గొన్నారు. వీరన్న స్వామి వారిని దర్శించుకున్నారు. వీరన్న స్వామి ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానని షర్మిల అన్నారు. వైరా నియోజకవర్గంలో అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులను కలిసి మాట్లాడారు. కొణిజర్ల మండలంలోని తనికెళ్ళ గ్రామం, బోనకల్ మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో పంటనష్టాన్ని తెలుసుకున్నారు. సాయంత్రం ఇల్లెందు నియోజకవర్గం సాతానిగూడెంలో డబుల్ బెడ్ రూం ఇండ్లను పరిశీలించాల్సి ఉంది. ఈ రోజు పర్యటన ముగిసిన అనంతరం రాత్రి ఈర్లపూడిలో షర్మిల బస చేయనున్నట్లు వైఎస్సార్‌టీపీ వర్గాలు తెలిపాయి.
నిన్న వరంగల్ జిల్లాలో పర్యటన
నిన్న (ఏప్రిల్ 30) వైఎస్ షర్మిల వరంగల్ జిల్లాలో పర్యటించారు. అకాల వర్షానికి నష్టపోయిన పంటలకు ఎకరాకు 30 వేల నష్ట పరిహారం ఇవ్వాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఎకరాకు 10 వేల రూపాయలు ఇస్తే ఏ మూలకు సరిపోవని, రైతులు ప్రతి ఎకరాకు రూ. 30 వేల చొప్పున ఖర్చు పెట్టారని షర్మిల తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అకాల వర్షానికి దెబ్బతిన్న పంటను షర్మిల పరిశీలించారు. జనగాం జిల్లా బచ్చన్నపేట మండలం ఆలింపూర్ గ్రామంలో పంట నష్టాన్ని పరిశీలించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట పూర్తిగా దెబ్బతిన్నదని రైతులు షర్మిలకు తెలిపారు. చేతికొచ్చిన వరి పంట పూర్తి నేల పాలయ్యిందని షర్మిలతో చెప్పుకుంటూ ఆవేదన చెందారు.
జనగాం జిల్లా వ్యాప్తంగా 50 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని షర్మిల అన్నారు. చేతికొచ్చిన పంట మొత్తం నేల పాలయ్యిందని పేర్కొన్నారు. రైతులు సర్వస్వం కోల్పోయి దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని అన్నారు. ఒక్క బచ్చన్న పేట మండలంలోనే 10 వేల ఎకరాలకు పైగా నష్టం జరిగినట్లు తెలుస్తున్నట్లు పేర్కొన్నారు. అకాల వర్షాలతో ఇంత పంట నష్టపోతున్నా కేసీఆర్ ఒక్క ఎకరాకు కూడా పరిహారం ఇవ్వడం లేదని విమర్శించారు. గత నెల 23వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ హెలికాప్టర్ లో వచ్చారని, ఎకరాకు 10 వేల రూపాయల సహాయం చేస్తామని హామీ ఇచ్చారని షర్మిల గుర్తు చేశారు. 10 వేలు ఇస్తామని చెప్పి నెల రోజులు గడుస్తున్నా ఒక్క రూపాయి కూడా అందలేదని షర్మిల విమర్శలు గుప్పించారు.