Telangana Power : తెలంగాణలో కరెంట్ కోతలు తప్పవా ? ప్రభుత్వం ఏం చేయబోతోంది ?
కేంద్రం తీసుకొచ్చిన కొత్త నిబంధనతో తెలంగాణలో కరెంట్ కోతలు విధించే అవకాశం కనిపిస్తోంది. సీఎం కేసీఆర్ ఈ అంశంపై సమీక్ష నిర్వహించారు.
Telangana Power : "తెలంగాణలో కరెంట్ పోదు..బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కరెంట్ రాదు" అని కేసీఆర్ తరచూ విమర్శలు చేస్తూంటారు. ఈ విమర్శలకు కౌంటరో లేకపోతే నిజంగానే విధానపరమైన నిర్ణయం తీసుకున్నారో కానీ తెలంగాణ ప్రభుత్వం కరెంట్ ఎక్సేంజీల నుంచి కరెంట్ కొనకుండా నిషేధం విధించింది. దేశ వ్యాప్తంగా విద్యుత్ క్రయ, విక్రయాలు జరిగే ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజీ (IEX) నుంచి లావాదేవీలు జరుపకుండా రాష్ట్రాలపై కేంద్రం నిషేధం విధించింది. తెలంగాణ, ఏపీలతో పాటు 13 రాష్ట్రాలకు చెందిన 29 విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు ఈ నిషేధం వర్తిస్తుందని ప్రకటించింది. ఇప్పటి వరకూ కొన్న వాటికి చెల్లింపులు చేయాల్సి ఉండటంతో అవన్నీ కట్టిన తర్వాతే కరెంట్ కొనాలని తేల్చి చెప్పింది. దీంతో తెలంగాణ సర్కార్‌లో ఒక్క సారిగా అలర్ట్ అయింది. విద్యుత్ ఎక్సేంజీల్లో కరెంట్ కొనకపోతే ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో అంచనాలు ప్రారంభించింది.
విద్యుత్ రంగంపై సీఎం కేసీఆర్ సమీక్ష !
నోటీస్ ఇవ్వకుండా పవర్ పర్చేస్ జరపకుండా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం కరెక్టు కాదని.. బకాయిలు చెల్లింపు చేసినప్పటికీ ఇలా చేయడం దారుణమని తెలంగాణ ప్రభుత్వం అంటోంది. రూ. 1, 360 కోట్లు కట్టేశామని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నోటీస్ తో 20 మిలియన్ యూనిట్స్ ఇవాళ డ్రా చేయలేకుండా పోయామని అధికారులు సమీక్షలో సీఎంకు తెలిపారు. ప్రజలకు, వినియోగదారులకు సాధ్యమైనంత వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఎక్కడైనా విద్యుత్ సరఫరాలో అంతరాయం వస్తే తమకు సహకరించాలని రైతులు, ప్రజలకు విద్యుత్ సంస్థల సీఎండీ ప్రభాకర్ రావు విజ్ఞప్తి చేశారు.
పూర్తి స్థాయిలో జల విద్యుత్ ఉత్పత్తి !
రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో వర్షాలు బాగా పడడంతో జల విద్యుత్ ను పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేస్తున్నట్లు, థర్మల్, హైడల్, సోలార్ పవర్ ఉత్పత్తి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఇవాళ 12214 మెగా వాట్ల విద్యుత్ డిమాండ్ వచ్చినా ఎక్కడ కూడా సరఫరాకు అంతరాయం రాకుండా చేస్తున్నామన్నారు. ఉదయం, సాయంత్రం ఎక్కువగా రైతులు పంపు సెట్లు ఆన్ చేస్తారని.. ఆ సమయంలో కొంత ఎక్కువ డిమాండ్ వస్తుందని .. ఆ సమయంలో కరెంట్ అందుబాటులో ఉండేలా చూస్తున్నామన్నారు. త్వరలోనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని.. . అప్పటి వరకు రైతన్నలు సహకరించాలని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది.
అత్యవసరంగా న్యాయపోరాటం !
కేంద్రం ఆదేశాలపై తెలంగాణ సర్కార్ న్యాయపోరాటం చేయాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే ఈ అంశంపై స్టే ఉందని తెలంగాణ చెబుతోంది. విద్యుత్ డిమాండ్ పెరిగినప్పుడల్లా తెలంగాణ సర్కార్ ఎక్కువ కరెంట్ ఎక్సేంజీల నుంచి కొనుగోలు చేసి సర్దుబాటు చేస్తోంది. ఇప్పుడు కొనుగోలు చేసే అవకాశం లేకపోవడం కొరత ఏర్పడటం ఖాయంగా కనిపిస్తోంది.