TS Congress : సీనియర్లు తెలంగాణ కాంగ్రెస్‌ను సేవ్ చేద్దామనుకుంటున్నారా? అసలుకే ముంచేద్దామనుకుంటున్నారా ?
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రతీ విషయంలో రేవంత్‌నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ? ఇక సహకరించకూడదని నిర్ణయించుకోవడం వల్ల ఎవరికి నష్టం ?
TS Congress : తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీద నేరుగా తిరుగుబాటు చేశారు. ఆయన నాయకత్వంలో పని చేసేది లేదని అంతర్గతంగా తీర్మానించుకున్నారని చెబుతున్నారు. ఇక నుంచి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చే కార్యక్రమాల్లో పాలు పంచుకోకూడదని దాదాపుగా పది మంది సీనియర్లు డిసైడయ్యారు. వీరు సొంత కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. అంటే తమలో తామే సొంత వర్గంగా ప్రకటించుకుని ప్రత్యేక పీసీసీగా అనధికారికంగా నడపబోతున్నారన్నమాట. దీనికి వీరు సేవ్ కాంగ్రెస్ అనే నినాదం పెట్టుకున్నారు. అయితే వీరు ఇలా చేయడం కాంగ్రెస్ పార్టీని సేవ్ చేయడం అవుతుందా ? ఇబ్బందుల్లో ఉన్న పార్టీని మరింతగా తొక్కేయడం అవుతుందా ? ఓ వైపు బీజేపీ అన్ని పార్టీల నేతలను కలుపుకుని బలపడుతూంటే.. వలస నేతల పేరుతో కాంగ్రెస్ పార్టీని తెలంగాణ నేతలే బలహీనపర్చుకుంటున్నారా ?
ఇక సీనియర్ల ప్రైవేటు పీసీసీ !
తెలంగాణ కాంగ్రెస్ చీఫ్‌గా రేవంత్ రెడ్డిని నియమించినప్పటి నుండి సీనియర్లు అసంతృప్తితో ఉన్నారు. అయితే బహిరంగంగా బయటపడింది మాత్రం అతి కొద్ది మందే. వారిలో కొందరు పార్టీ వీడిపోయారు. కొంత మంది పార్టీలో ఉన్నా లేనట్లే ఉన్నారు. అయితే పీసీసీ కమిటీలు ప్రకటింటిన తర్వాత అసంతృప్తి వాదులంతా ఒక్క సారిగా బయటకు వచ్చారు. మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి, దామోదర రాజనర్సింహ , మహేశ్వర్ రెడ్డి , కోదండరెడ్డి ఇలాంటి సీనియర్లంతా బయటకు వచ్చారు. తాము ఎప్పట్నుంచో కాంగ్రెస్‌లో ఉన్నామని తమపై కోవర్టుల ముద్ర వేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఇక రేవంత్ పిలుపునిచ్చే కార్యక్రమాలకు వెళ్లకూడదని డిసైడ్ చేసుకున్నారు. బహుశా వారు సొంత కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. అంటే సీనియర్లంతా ఓ పీసీసీగా వ్యవహిరంచే అవకాశం ఉందనుకోవచ్చు.
వలస నేతల పేరుతో పార్టీలోకి వచ్చిన వారిని కించపర్చడమెందుకు ?
భారతీయ జనతా పార్టీ నేతలు అన్ని పార్టీల్లో ఉండే కీలక నేతల్ని చేర్చుకుని వారికి ముఖ్య మంత్రి పదవులు కూడా ఇస్తున్నారు. ఇంకా ఎవరెవరు వస్తారా అని ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరేవారే లేరు. చేరిన వారు కూడా రోజుల్లోనే వెనక్కి వెళ్లిపోతున్నారు. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిపై తామే సీనియర్లం అని వారికి ప్రాధాన్యం లభిస్తే వారికి వలస నేతలనే ముద్ర వేస్తున్నారు. కాంగ్రెస్ కమిటీల్లో సగం మంది టీడీపీ వాళ్లే ఉన్నారని పీసీసీ చీఫ్‌గా పని చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డే చెప్పడం కాంగ్రెస్ నేతల్ని ఆశ్చర్య పరుస్తోంది. టీడీపీలో కీలక నేతగా ఉన్న రేవంత్ రెడ్డిని ఢిల్లీ తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేర్పించిది ఉత్తమ్ కుమార్ రెడ్డినే. అనేక ఓటముల తర్వాతే పీసీసీ చీఫ్ పదవి నుంచి ఆయన వైదొలిగితేనే హైకమాండ్ రేవంత్ కు పదవి ఇచ్చింది. అయితే సోషల్ మీడియాలో తమపై కోవర్టులని పోస్టులు పెడుతున్నారని..దానికి రేవంతే కారణమని ఆరోపిస్తూ.. ఈ నేతలు వలస నేతలంటూ సొంత నేతల్నే కించ పరుస్తూండటం ఆ పార్టీలో దుస్థితికి అర్థం పడుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత అందరూ కాంగ్రెస్ నేతలే అవుతారని గుర్తు చేస్తున్నారు. అలా అనుకుంటే టీఆర్ఎస్‌లో ఇంకా ఎక్కువ మంది టీడీపీ నేతలుంటారని కొంత మంది కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు.
అసలు పదవుల విషయంలో వలస నేతలపై అబద్దం చెబుతున్నారనే విమర్శలు !
వలస నేతలకు కాంగ్రెస్ పదవులు ఇవ్వలేదని.. కాంగ్రెస్ సానుభూతి పరులు ఓ జాబితాను సోషల్ మీడియాలో పెట్టి మరీ చెబుతున్నారు. ఆ జాబితాను చూస్తే.. ఉత్తమ్ కుమార్ రెడ్డి అబద్దం చెప్పారని తేలుతుంది.
Today some senior leaders said that new @INCTelangana committee got more then 50% from other parties, its 12 ppl out of 196 whom I marked came from other parties having active role in last 2 years.
— Kiran Kumar Chamala (@kiran_chamala) December 17, 2022
The released list SC,ST,BCand minority are 68% and OC 32% with Social justice. pic.twitter.com/j9qdduLxw4
సేవ్ కాంగ్రెస్ అని సొంత పార్టీపై ఉద్యమిస్తే ఎవరికి నష్టం ?
తాము ఢిల్లీ వెళ్లి సేవ్ కాంగ్రెస్ అని హైకమాండ్‌ను కలుస్తామని ప్రకటించారు. పీసీసీ కమిటీలను పునర్ వ్యవస్థీకరించాల్సిందేనని.. పార్టీని నమ్ముకున్న వారికి పదవులు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నిజానికి ఇప్పుడు నియమించిన కమిటీనే జంబో కమిటీ. అయినప్పటికీ సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సేవ్ కాంగ్రెస్ పేరుతో ఉద్యమిస్తే.. అది కాంగ్రెస్ ను సేవ్ చేయదు కదా.. మరింతగా ఆగాధంలోకి నెడుతుంది. రాజకీయాల్లో పండిపోయిన నేతలకు తెలియనిదేం కాదు. అయినావారు సొంత పార్టీపై పోరాటానికే సిద్ధమవుతూండటం.. ఇతర ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీలకు ఊరటనిచ్చేదే. ఎందుకంటే కాంగ్రెస్ తమలో తాము యుద్ధం చేసుకుంటే ఆ రెండు పార్టీలు ముఖాముఖి పోరాడటం చేసుకుంటాయి.
ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా కాంగ్రెస్ నేతలు మారరా ?
తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉన్నా..రెండు ఎన్నికల్లో కనీస మాత్రం సీట్లు తెచ్చుకోలేకపోయారు. తెచ్చుకున్న కొన్ని నిలుపుకోలేకపోయారు. వరుస ఓటములతో ఉన్న పార్టీలో పీసీసీ చీఫ్ గా రేవంత్ ను నియమించాక కాస్త ఊపు వచ్చింది. అయితే సీనియర్ నేతలంతా కలిసి దాన్ని మళ్లీ సాధారణ స్థితికి తెచ్చేశారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రణాళికలను కూడా నిలిపివేశారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రేవంత్ రెడ్డి గెలిచినట్లని ఈ నేతలంతా భావిస్తున్నారు. అందుకే రేవంత్ పీసీసీ చీఫ్ గా ఉండగా కాంగ్రెస్ గెలవకపోయినా పర్వాలేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారని..ఇది పార్టీ ద్రోహమేనని రేవంత్ వర్గీయులు విమర్శిస్తున్నారు. మొత్తానికి కాంగ్రెస్ రాజకీయం మాత్రం.. తన నెత్తి మీద తాను చెయ్యి పెట్టుకున్నట్లుగా ఉందనేది బహిరంగ రహస్యం.