Who Is Telangana TDP Chief : తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎవరు ? చంద్రబాబు దృష్టిలో ఎవరున్నారు ?
Who Is Telangana TDP Chief : తెలంగాణ టీడీపీ చీఫ్‌గా ఎవర్ని నియమించబోతున్నారన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. చంద్రబాబు ఈ అంశంపై అంకా దృష్టి సారించలేదు.
Who Is Telangana TDP Chief : తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరిపోయారు. ఇప్పుడు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు లేరు. తదుపరి ఎవరికి చాన్సిస్తారన్నదానిపై టీడీపీలో చర్చలు జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నందున కొత్త అధ్యక్షుడి నియామకంపై చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదని చెబుతున్నారు. తెలంగాణ ఎన్నికలు పూర్తయిన తర్వాత రాజకీయాల్ని బట్టి తదుపరి కార్యాచరణ ఖరారు చేసుకునే అవకాశం ఉంది. అయితే పార్టీ అధ్యక్ష పదవి కోసం గట్టిగా ప్రయత్నిస్తున్న ఆశావహులు చాలా మంది ఉన్నారు .
తెలంగాణ టీడీపీ రథసారధిపై ఎన్నికల తర్వాత నిర్ణయం
తెలంగాణ టీడీపీ నుంచి చాలా మంది నేతలు వెళ్లిపోయారు. సీనియర్లు అందరూ ఎవరి దారి వారు చూసుకున్నారు. కానీ పార్టీని అంటి పెట్టుకుని ఇంకా చాలా మంది నేతలు ఉన్నాయి. వారిలో అరవింద్ కుమార్ గౌడ్ కీలకంగా ఉంటున్నారు. ఈ సారి ఆయన తనకు పార్టీ అధ్యక్ష పదవి ఇస్తారని ఆశిస్తున్నారు. గతంలో వివిధ సమీకరణాలతో అరవింద్ కుమార్ గౌడ్ కు అవకాశాలు లభించలేదు. టీడీపీ మాజీ నేత దేవేందర్ గౌడ్ కు దగ్గర బంధువు అయిన అరవింద్ కుమార్ గౌడ్.. పార్టీలో తనకు అవకాశాలు వచ్చినా రాకపోయినా పార్టీ కోసం కష్టపడుతున్నారు. అలాగే నన్నూరి నర్సిరెడ్డి, తిరునగరి జ్యోష్ణ్న లాంటి నేతుల కూడా కష్టపడుతున్నారు. ఇటీవల కాట్రగడ్డ ప్రసూన కూడా యాక్టివ్ గా మారారు. వీరందరితోపాటు మరికొంత మంది నేతల పేర్లను చంద్రబాబు పరిశీలించే అవకాశం ఉంది.
టీడీపీకి మంచి ఆదరణ ఉందని గట్టి నమ్మకం
తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. కానీ టీడీపీ మద్దతు కోసం అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ క్యాడర్ .. టీడీపీ సానుభూతి పరుల ఓట్లు తమకే దక్కుతాయని ఆ పార్టీ జెండాలను పట్టుకుని మరీ పలు చోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు టీడీపీ జెండాలతో ప్రచారం చేసుకుంటున్నారు. ఆ పార్టీ నేతలు తమ నియోజకవర్గాల్లో ఉంటే.. వారిని తమ ప్రచారంలో తిప్పుకుంటున్నారు. వీటన్నింటినీ చూస్తే తెలుగుదేశం పార్టీకి మంచి ఆదరణ ఉంటుందని ఆ పార్టీ నేతలు అంచనాకు వస్తున్నారు. చంద్రబాబు అరెస్టు తర్వాత ఆయనకు తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో వచ్చిన మద్దతు కూడా టీడీపీ బలానికి సూచికగా బావిస్తున్నారు.
ఈ సారి ఆత్మప్రబోధానుసారం టీడీపీ సానుభూతిపరుల ఓట్లు
ఈ ఎన్నికల్లో టీడీపీ సానుభూతిపరులు ఫలానా పార్టీకి లేదా కూటమికి మద్దతుగా ఓటు వేయాలని చంద్రబాబు పిలుపునిచ్చే అవకాశం లేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే వారు ఏ పార్టీకి అయినా ఓటు వేసుకోవచ్చని.. మద్దతు ఇవ్వవొచ్చన్న సంకేతాలు మాత్రం పంపారు. ఇతర పార్టీలు తమకు టీడీపీ మద్దతు ఉందని ప్రకటించుకుంటున్నా.. ఆయా పార్టీల ర్యాలీల్లో పాల్గొంటున్నా వద్దని చెప్పడం లేదు. దీంతో ఆత్మప్రబోధానుసారం ఓట్లు వేయవచ్చని చెప్పినట్లయిందని అంటున్నారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడి ఎంపిక తర్వాత .. తదుపరి అసలు రాజకీయాన్ని ప్రారంభించే అవకాశం ఉంది.