New secretariat: కొత్త సచివాలయానికి పునాదులు తవ్వే టైంలో ఏం జరిగింది?
ఇండో-పర్షియన్-అరేబియన్ నిర్మాణాల కలబోతగా నిర్మాణం పనులు ప్రారంభమైన నాటి నుంచి 26 నెలల్లోనే పూర్తి సచివాలయ భవనంలో మరో ప్రత్యేకత వాటర్ సప్లయ్
తెలంగాణ నూతన సచివాలయం నిర్మాణం వెనక ఎన్నో సవాళ్లు!. పాత భవనాలను కూల్చటం దగ్గర్నుంచి స్థలాన్ని ఒక రూపులోకి తెచ్చేందుకు అధికారులు పెద్ద కసరత్తే జరిగింది. కొన్ని ప్రాంతాల్లో వదులు నేలలు కలవరం పెట్టించాయి. మరికొన్ని చోట్ల బండరాళ్లు అడ్డంకిగా మారాయి. మరికొన్ని చోట్ల భూమి బొగ్గుడంపు మాదిరిగా కుంగిపోయింది. వాటన్నింటినీ పరిష్కరిస్తూ బలమైన పునాదులు వేశారు. ముఖ్యంగా పాత భవనాల కూల్చివేత అది పెద్ద సవాల్. ఆ సమయంలో అక్కడున్న భూగర్భ విద్యుత్తు లైన్ల తొలగింపు తలనొప్పిగా మారింది. ఎలాంటి ప్రమాదం జరగకుండా ఈ పనులను పూర్తిచేశారు. లైవ్ వైర్ డిటెక్షన్ విధానంలో కరెంటు తీగలను సురక్షితంగా తొలగించారు.
26 నెలల్లోనే పూర్తి చేయటం రికార్డు
ఇండో-పర్షియన్-అరేబియన్ నిర్మాణాల కలబోత- కొత్త సచివాలయం! ప్యాలెస్‌లు, ఆలయ గోపురాల తరహాలో ఉంటుంది. ఇలాంటి నిర్మాణాలు కొలిక్కి రావాలంటే కనీసం నాలుగేళ్లకు పైగా పడుతుందని నిపుణుల అంచనా. కానీ ఈ సచివాలయం పనులు ప్రారంభమైన నాటి నుంచి 26 నెలల్లోనే పూర్తి చేయటం రికార్డు! సచివాలయ ఆకృతుల రూపకల్పనలో సీఎం కేసీఆర్ అనేక గంటల సమయాన్ని కేటాయించారు. ఆర్కిటెక్టులు, ఇంజినీర్లతో అనేక దఫాలుగా చర్చించారు. అలా డిజైన్‌ని ఫైనలైజ్ చేశారు. నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతలను మంత్రి ప్రశాంత్‌రెడ్డి దగ్గరుండి చూసుకున్నారు. సీఎం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా రోజువారీ ప్రణాళికలు రచించుకుని.. అవి ఎప్పటికప్పుడు పూర్తయ్యేలా శ్రద్ధ వహించారు. ప్రతి అంతస్తులో జరిగే పనుల వివిధ రకాల బృందాలకు అప్పగించి పర్యవేక్షించారు. వివిధ శాఖల అధికారుల కోసం ఆ ప్రాంగణంలోనే ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. దాంతో వర్క్ ఈజీ అయింది.
సచివాలయానికి నీటి సరఫరా ఒక వండర్
సచివాలయ భవనంలో మరో ప్రత్యేకత వాటర్ సప్లయ్! భవనం సమీపంలో భారీ సంపును ఏర్పాటు చేశారు. వర్షం పడితే ఒక్క చుక్క కూడా వేస్ట్ కాదు. ప్రతీ డ్రాప్ సంపులోకే వెళుతుంది. భూగర్భ నీటి సంపు సామర్థ్యం 565 లీటర్లు. అక్కడి నుంచి నీరు అన్ని ఫ్లోర్లకు సరఫరా అవుతుంది. నీటి వినియోగం రోజుకు 125 కిలో లీటర్లని అంచనా వేశారు.. ఇటీవల వర్షాలు కురిసిన సమయంలో సుమారు అడుగున్నర ఎత్తున వర్షపు నీరు సంపులోకి చేరటాన్ని అధికారులు గుర్తించారు. ప్రాంగణానికి మరింత వన్నె తెచ్చేందుకు రెండు భారీ ఫౌంటెయిన్లను నిర్మించారు. పార్లమెంటులో ఉన్న మాదిరిగానే అదే ఎత్తు, అదే వైశాల్యంతో ఏర్పాటు చేశారు. పార్లమెంటులో ఉపయోగించిన రెడ్ శాండ్ స్టోన్‌తోనే నిర్మించటం విశేషం. ఒక్కో ఫౌంటెయిన్ ఎత్తు 28 అడుగులు. వైశాల్యం 58 అడుగులు.
ఎటు చూసినా పచ్చటి తివాచీ పరిచినట్టుగా..
సచివాలయంలో పచ్చదనానికి ఎనిమిది ఎకరాల వరకు కేటాయించారు. ఎక్కువ భాగం లాన్స్ రూపంలోనే కనిపిస్తుంది. ముందు భాగంమంతా ఆకుపచ్చ తివాచీ పరిచినట్టుగా ఉంటుంది. భవనం మధ్యలో కూడా పచ్చదనం పరుచుకుంటుంది. లాన్స్‌కు నలుదిక్కులా దేవదారు లాంటి వృక్షాలను పెంచుతున్నారు. సచివాలయం గ్రౌండ్ ఫ్లోర్లో గ్రంథాలయం ఉంది. తెలుగుతల్లి ఫ్లైఓవర్ వైపు 2,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో క్యాంటీన్ నిర్మించారు. దానికి ఆనుకుని ఓపెన్ కిచెన్ ఉంటుంది. అటు పక్కనే బ్యాంకు, ఏటీఎంలకు కొంత స్థలాన్ని కేటాయించారు.
ఆ ఒక్క గేటు ఎమర్జెన్సీ కోసమే
సచివాలయానికి తూర్పు వైపు నిర్మించిందే మెయిన్ ఎంట్రన్స్. సీఎం, మంత్రులు, ఉన్నతాధికారుల కోసం ఈ గేట్ తెరుచుకుంటుంది. ఈశాన్యంలో ఉన్న గేటు నుంచి కింది స్థాయి అధికారులు, సిబ్బంది వస్తారు. ఆగ్నేయం వైపు ఏర్పాటు చేసిన ద్వారం నుంచి సందర్శకులను అనుమతిస్తారు. వాయవ్యంలో నిర్మించిన వాకిలిని అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వాడుతారు. ప్రధాన భవనం ముందు శాశ్వత హెలిప్యాడ్ ఉంటుంది.
సచివాలయం ప్రాంగణంలో గంగా జెమునా తెహజీబ్
ఇకపోతే, సచివాలయంలో హిందూ, ముస్లిం, క్రైస్తవ ప్రార్థన మందిరాలను నిర్మించారు. పాత సచివాలయం కంటే విశాలంగా, సుందరంగా ఉంటాయవి. ఆయా మత పెద్దల ఆకాంక్షల మేరకు నిర్మాణాలు చేయించుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. దేవాలయం, మసీదు, చర్చి కోసం సుమారు 9వేల చదరపు అడుగులను కేటాయించారు.