Sajjanar Encounter Enquiry : సజ్జనార్ బదిలీకి.. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణకు సంబంధం ఉందా..!?
దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు నియమించిన కమిటీ విచారణకు రావడం.. సజ్జనార్‌ను బదిలీ చేయడం ఒకే సారి జరిగాయి. రెండింటికి సంబంధం ఉందన్న అభిప్రాయం అధికారవర్గాల్లో, రాజకీయవర్గాల్లో ఏర్పడుతోంది.
సైబరాబాద్ పోలీస్ కమిషన్ వీసీ సజ్జనార్‌ను హుటాహుటిన ఎందుకు బదిలీ చేశారు..? ఉదయం ఉత్తర్వులిచ్చి మధ్యాహ్నం కల్లా ఎందుకు రిలీవ్ చేశారు..? అంత హడావుడిగా ఎందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది..?. ఈ అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. ఏదో బలమైన కారణం ఉండి ఉంటుందని లేకపోతే ఉరుము లేని పిడుగులా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఇప్పుడిప్పుడే ఈ అంశానికి సంబంధించి కొంత సమాచారం వెలుగులోకి వస్తోంది. ఏ ఘటన అయితే సజ్జనార్‌కు ప్రశంసలు తెచ్చి పెట్టిందో అదే ఘటన ఆయన బదిలీకి కారణం అన్న ప్రచారం జరుగుతోంది. అదే దిశ నిందితుల ఎన్ కౌంటర్.
"దిశ" అనే యువతిని అత్యాచారం చేసి హత్య చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు చటాన్ పల్లి వద్ద ఎన్‌కౌంటర్ అయ్యారు. ఈ ఘటనపై అప్పట్లో మీడియాలో జరిగిన ప్రచారం మేరకు పోలీసులకు ప్రశంసలు లభించాయి. సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్‌కు అందరూ శల్యూట్ చేశారు. కానీ ఉద్దేశపూర్వక ఎన్‌కౌంటర్ నేరం. అయితే పోలీసులు నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేశారని అందుకే ఎన్‌కౌంటర్ చేశామని ప్రకటించారు. ఇందులోని నిజానిజాలను తేల్చాలని సుప్రీంకోర్టు .. మాజీ న్యాయమూర్తి జస్టిస్ సిర్పూర్కర్ నేతృత్వంలో త్రిసభ్య కమిషన్‌ను నియమించింది. కరోనా కారణంగా సిర్పూర్కర్ కమిషన్ విచారణ ఆలస్యమయింది. ఆ కమిషన్ ఇప్పుడు హైదరాబాద్‌లో విచారణ చేపడుతోంది.
మూడు రోజులుగా హైదరాబాద్‌లోనే ఉండి ఎన్‌కౌంటర్‌కు సంబంధం ఉన్న వారిని ప్రశ్నిస్తోంది. ముందుగా దిశ కేసును కేసును దర్యాప్తు చేసిన సిట్ ఇన్‌ఛార్జి సురేందర్‌రెడ్డిని వివిధ అంశాలపై ప్రశ్నించింది. ఎన్‌కౌంటర్ జరిగిన తీరు? ఎంత మంది పోలీసులు పాల్గొన్నారు? ఎదురుకాల్పులకు ముందు హెచ్చరికలు జారీ చేశారా? మొత్తం ఎన్ని రౌండ్లు కాల్పులు జరిపారు? తదితర విషయాలు ఆరా తీశారు. అయితే కొన్ని సమాధానాలకు కమిషన్ సభ్యులు సంతృప్తి చెందలేదన్న ప్రచారం జరుగుతోంది. కమిషన్ హోంశాఖ కార్యదర్శి నుంచి కూడా నివేదికను తీసుకుంది. క్రాస్ ఎగ్జామిన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన సాక్ష్యధారాలతో పాటు అందుకు దారితీసిన కారణాలను వెల్లడించాల్సిందిగా కమిషన్ హోంశాఖ కార్యదర్శిని గట్టిగా ప్రశ్నించినట్లుగా అధికారవర్గాల్లో ప్రచార ంజరుగుతోంది. పోలీసు కస్టడీలో ఉన్న యువకులు ఎన్‌కౌంటర్‌లో ఎలా చనిపోతారన్న అంశంపై హోంశాఖ కార్యదర్శి స్పష్టమైన సమాచారం చెప్పలేకపోయారని చెబుతున్నారు.
మరోవైపు ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన నలుగురు యువకుల కుటుంబ సభ్యులు, వారికి చదువు చెప్పిన టీచర్లు.. ఇతరుల నుంచి వివరాలను సేకరించనుంది. శుక్రవారం నుంచి వారితో కమిషన్ మాట్లాడుతుంది. దిశపై జరిగిన అత్యాచారం, హత్య సంఘటనల్లో వారే నిందితులనడానికి అవసరమైన సాక్ష్యాలను కూడా కమిషన్ పరిశీలించనుంది. ఈ పరిస్థితుల్లో సజ్జనార్‌ను ఆర్టీసీ ఎండీగా బదిలీ చేశారు. అందుకే దిశ ఎన్ కౌంటర్ ఘటన విచరాణకు... సజ్జనార్ బదిలీకి సంబంధం ఉందన్న అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది.