Rains in AP Telangana: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీ, తెలంగాణలకు వర్ష సూచనతో IMD ఎల్లో అలర్ట్ జారీ
Rains in AP Telangana: ఉత్తర కర్ణాటక నుంచి కొమోరిస్ వరకు, దక్షిణ కర్ణాటక మరియు తమిళనాడు మీదుగా ఉన్న సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. ఆగస్టు 30 వరకు వర్షాలు కురుస్తాయి.
![Rains in AP Telangana: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీ, తెలంగాణలకు వర్ష సూచనతో IMD ఎల్లో అలర్ట్ జారీ Weather Updates for Hyderabad Andhra Pradesh Telangana on 27 August 2022 Rain News Rains in AP Telangana: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీ, తెలంగాణలకు వర్ష సూచనతో IMD ఎల్లో అలర్ట్ జారీ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/27/58d92e0cf0e08d3f817a580e6d4228ed1661561550453233_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Rains in Telangana AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. నైరుతి బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో అల్పపీడన ద్రోణి ఉందని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉత్తర కర్ణాటక నుంచి కొమోరిస్ ప్రాంతం వరకు, దక్షిణ కర్ణాటక మరియు తమిళనాడు మీదుగా ఉన్న సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, యానాంలో మరో మూడు రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. తెలంగాణలో ఆగస్టు 31 వరకు కొన్ని జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ కావడంతో ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
తెలంగాణలో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు
తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో కొన్ని జిల్లాల్లో శుక్రవారం భారీ వర్షాలు కురిశాయి. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. భారీ వర్ష సూచనతో ఈ జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆగస్టు 31 వరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్‌ను మేఘాలు కమ్మేశాయి. నగరంలో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. కనిష్ట ఉష్ణోగ్రత 24, గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీలు నమోదైంది. పశ్చిమ దివ నుంచి గాలులు గంటకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి.
— IMD_Metcentrehyd (@metcentrehyd) August 26, 2022
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఒకట్రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ వర్ష సూచనతో ఈ జిల్లాలకు వాతావరణ కేంద్రం ఆగస్టు 31 వరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. యానాంతో పాటు ఉమ్మడి విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. గంటలకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచనున్నాయి. రేపు శ్రీకాకుళం జిల్లాతో పాటు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు.
7 days mid day subdivision forecast for Andhra Pradesh in Telugu language Dated 26.08.2022. pic.twitter.com/aDVD6S9wko
— MC Amaravati (@AmaravatiMc) August 26, 2022
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
వాయుగుండంగా ప్రభావం ఏపీపై ఉంది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఒకట్రెండు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు. రేపు ప్రకాశం, గుంటూరు జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షం కురవనుంది. ఎల్లుండి తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వానలు పడతాయని ఇక్కడి ప్రజలను అధికారులు హెచ్చరించారు. అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు సంభవిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
హెచ్చరిక: భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. అరటితోటలకు నష్టం వాటిల్లుతుంది. కోతకు సిద్ధంగా ఉన్న పంటలకు నష్టం జరుగుతుందన్నారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)