Weather Updates: నేడు ఈ జిల్లాల్లో వర్షం, ఎల్లో అలర్ట్ జారీ! ఏపీలో నేడు 2-4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు
నేడు ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో మరో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.
Weather Latest News: నైరుతి రుతుపవనాలు గత ఏడాదితో పోల్చితే వారం నుంచి పది రోజుల ముందే ఏపీ, తెలంగాణలోకి ప్రవేశిస్తున్నాయి. దక్షిణ కర్ణాటక, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం రాయలసీమ దాని పరిసర సముద్ర మట్టానికి ఉపరితలంపై విస్తరించి ఉంది. నైరుతి రుతుపవనాల ఉత్తర పరిమితి 5 డిగ్రీల ఉత్తర అక్షాంశం / 67 డిగ్రీల తూర్పు రేఖాంశం, 6 డిగ్రీల ఉత్తర అక్షాంశం లేదా 72 డిగ్రీల తూర్పు రేఖాంశం, 18 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 94.5 డిగ్రీల తూర్పు రేఖాంశం గుండా కొనసాగుతోంది. వీటి ఫలితంగా ఏపీ, యానాం, తెలంగాణలో పలుచోట్ల నేడు సైతం మోస్తరు వర్షాలు కురయనున్నాయని వెల్లడించారు.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో..
నేడు ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో మరో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. దక్షిణ కోస్తాలో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. అయితే, ఈ ప్రాంతాల్లో నేడు వేడి గాలులకు సంబంధించి ఎలాంటి హెచ్చరిక లేదు. నేడు కూడా ఉష్ణోగ్రతలు సగటు ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ అధికంగా నమోదయ్యే అవకాశం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఏపీలోని కొన్ని జిల్లాల్లో అర్ధరాత్రి వేళ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. ఉమ్మడి విశాఖ, ఎన్టీఆర్ జిల్లా మైలవరం, రెడ్డిగూడెం, జి.కొండూరు మండల్లాలో భారీ వర్షం పడింది. అనకాపల్లి, చోడవరం, వడ్డాది, మాడుగుల, చీడికాడ, విశాఖపట్నంలోని పెందుర్తి ప్రాంతంలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. వర్షం వల్ల కొన్ని చోట్ల కరెంటు సరఫరా ఆగిపోయింది. పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో ఉదయం భానుడి భగభగలతో జనం అల్లాడిపోగా, రాత్రి వాన పడింది.
తెలంగాణలో పొడి వాతావరణం..
తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ విభాగం వెల్లడించింది. వచ్చే 4 రోజులు ఇలాంటి పరిస్థితే ఉంటుందని వాతావరణ అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు పసుపు రంగు అలర్ట్ జారీ చేశారు.
ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జగిత్యాల, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొమురం భీం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్ మల్కాజ్ గిరి, ములుగు, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, యాదాద్రి భువనగిరి తదితర జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, ఖమ్మం, మహబూబాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి వంటి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇక వేడి గాలులకు సంబంధించి ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు.