Warangal News: మెడికో విద్యార్థి ప్రీతి పరిస్థితి విషమం - సాయంత్రం మరోసారి హెల్త్ బులిటెన్ విడుదల
Warangal News: కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ అనస్తీషియా చదువుతూ ఆత్మహత్యకు పాల్పడ్డ డాక్టర్ ప్రీతి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.
Warangal News: సీనియర్ విద్యార్థి వేధింపులలు తాళలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ వరంగల్ మెడికో విద్యార్థిని పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో విద్యార్థిని చికిత్స పొందుతోంది. ప్రీతికి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు నిమ్స్ వైద్యులు వివరించారు. ప్రీతికి మళ్లీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ జరిగిందని, చికిత్సకు ఆమె శరీరం ఏమాత్రం సహకరించడం లేదని చెబుతున్నారు. బీపీ, పల్స్ రేటు నమోదు కాని పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రీతికి డాక్టర్ పద్మజ ఆధ్వర్యంలోని ఐదుగురు వైద్యుల బృందం చికిత్స అందిస్తోంది. బుధవారం రాత్రి ప్రీతి టెస్ట్ రిపోర్టర్లను డాక్టర్ పద్మజ పరిశీలించారు. వరంగల్ నుంచి ప్రీతిని నిమ్స్ కు తీసుకువచ్చే సమయంలోనే రెండుసార్లు గుండె ఆగిపోయింది. వెంటనే వైద్యులు సీపీఆర్ చేసి గుండె కొట్టుకునేలా చేశారు. అనస్తీషియా, కార్డియాలజీ, న్యూరాలజీ, జనరల్ ఫిజీషియన్, ఇతర వైద్యులు ప్రీతికి వైద్య చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై ఇప్పడే ఏం చెప్పలేమని.. వైద్యులు చెబుతున్నారు. ఈరోజు సాయంత్రం ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై మరోసారి హెల్త్ బులిటెన్ విడుదల చేసే అవకాశం ఉందని అన్నారు.
ఇక సీనియర్ విద్యార్థి సైఫ్ వేదింపుల వల్ల తన బిడ్డ ఆత్మహత్యాయనికి పాల్పడిందని ప్రీతి తండ్రి, బాబాయ్ చెబుతున్నారు. అతనిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సైఫ్‌పై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. జరిగిన ఘటన పై ఆరా తీశారు. డాక్టర్లతో మాట్లాడి, చికిత్స పొందుతున్న ప్రీతి కి మంచి వైద్యం అందించాలని చెప్పారు. ఆత్మహత్యకు కారణమైన దోషులను కఠినంగా శిక్షించాలని సీపీ రంగనాథ్ తో ఫోన్ లో మాట్లాడి ఆదేశించారు.
అసలేం జరిగిందంటే..?
హైదరాబాద్‌లో ఏఎస్ఐగా పని చేస్తున్న నరేందర్ కూతురు ప్రీతి కాకతీయ మెడికల్ కళాశాలలో పీజీ మొదటి సంవత్సరం చదువుతూ ఉంది. విధుల్లో ఉన్నపుడే హానికరమైన ఇంజక్షన్ ను ఆమె ఎక్కించుకున్నారు. తోటి వైద్యులు ఈ విషయం గమనించి ఆమెకు చికిత్స అందిస్తున్నారు. డాక్టర్ ప్రీతి ఆత్మహత్యాయత్నం విషయాన్ని కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ దాస్ ధ్రువీకరించారు. విధి నిర్వహణలో సీనియర్ వైద్య విద్యార్థి ఇబ్బందులకు గురిచేస్తున్నాడని కేఎంసీ ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కొంత మంది విద్యార్థులు చెబుతున్నారు. ఫిర్యాదు చేసినప్పుడు వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటే ఇలాంటి సంఘటనకు దారితీసేది కాదని కుటుంబ సభ్యులు అంటున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైద్య విద్యార్థిని తల్లిదండ్రులు ఆవేదనతో కోరుతున్నారు.
రెండ్రోజుల క్రితమే ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు
రెండు రోజుల క్రితం డాక్టర్ ప్రీతిని ఓ సీనియర్ డాక్టర్ వేధించినట్లు సమాచారం. ఈ ఘటనపై డాక్టర్ ప్రీతి ఫిర్యాదు మేరకు సదరు సీనియర్ డాక్టర్ ను మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ మోహన్ దాస్ మందలించినట్లు తెలిసింది. అయినప్పటికీ బుధవారం డాక్టర్ ప్రీతి ఆత్మహత్యకు ప్రయత్నించారు. అయితే, సీనియర్ పీజీ వైద్య విద్యార్థి వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇప్పటికే వేధింపులకు గురిచేసిన వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఆసుపత్రిలోకి మీడియా ప్రతినిధులను అనుమతించడం లేదు.