(Source: ECI/ABP News/ABP Majha)
UNESCO : వరంగల్ కు మరో కళావైభవం, గ్లోబల్ మెట్ వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్ లో స్థానం
UNESCO : చారిత్రక నగరం వరంగల్‌కు అరుదైన గుర్తింపు లభించింది. యునెస్కో గుర్తించిన అభ్యాసన నగరాల ప్రపంచ నెట్ వర్క్ జాబితాలోకి వరంగల్ చేరింది.
UNESCO: వరంగల్ నగరం మరో ఘనత సాధించింది. ఐక్య రాజ్య సమితి విద్య, శాస్త్ర, సాంస్కృతిక సంస్థ గుర్తించిన అభ్యాసన నగరాల ప్రపంచ నెట్ వర్క్ లో వరంగల్ నగరానికి చోటు దక్కింది. ఇప్పటికే వరంగల్ లోని ప్రఖ్యాత రామప్ప ఆలాయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తించిన విషయం తెలిసిందే. తాజాగా 44 దేశాల నుంచి 77 నగరాలకు ఈ గుర్తింపును ఇవ్వగా ఇందులో మన దేశం నుంచి 3 మాత్రమే ఉన్నాయి. అందులో వరంగల్ నగరంతో పాటు కేరళలోని త్రిశూర్, నీలాంబుర్ నగరాలు ఈ ఘనత సాధించాయి. యునెస్కో అనుబంధ సంస్థల్లో ఇన్ స్టిట్యూట్ ఫర్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఒకటి. ఈ సంస్థ ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 294 నగరాలను జీఎన్ఎల్సీలో గుర్తించి అక్కడ విద్యాభివృద్ధికి చేయూతనిస్తోంది.
గొప్ప సందర్శనీయ స్థలాల్లో ఒకటిగా..
యునెస్కో గ్లోబర్ నెట్ వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్ లో గుర్తింపు వచ్చిన నగరాల్లో ఆన్ లైన్ శిక్షణ, కార్యశాలలు, వయోజన విద్యాకార్యక్రమాలు, వెబినార్లను నిర్వహిస్తోంది. అక్షరాస్యత, విద్య నిరంతర అధ్యయనానికి కృషి చేస్తోంది. యునెస్కో జీఎన్ఎల్సీకి 2021 ఆగస్టులో దరఖాస్తులను ఆహ్వానించగా వరంగల్ మహా నగరపాలక సంస్థ ఈ పోటీలో నిలిచింది. ఈ మేరకు దరఖాస్తును తెలంగాణ ప్రభుత్వం సిఫార్సు చేయగా.. కేంద్రం యునెస్కో పోటీకి పంపింది. జీఎన్ఎల్సీకి ఎంపిక కావడానికి అనేక అంశాలను పరిశీలిస్తారు. వారసత్వ నగరమైన వరంగల్ కు ఏటా 30 లక్షల మంది వరకు పర్యాటకులు వస్తున్నారు. దేశంలోనే గొప్ప సందర్శనీయ స్థలాల్లో ఒకటిగా నిలుస్తోంది.
ట్రాన్స్ జెండర్లకూ స్వయం సహాయక సంఘాల ఏర్పాటు..
పచ్చని వాతావరణం, ఆరోగ్యకరమైన జీవనాన్ని గడిపేందుకు ఓపెన్ జిమ్ ల వంటివి ఏర్పాటు చేయడంతో పాటు అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. మహా నగర పాలక సంస్థ పిల్లలు, మహిళల సంక్షేమానికి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ట్రాన్స్ జెండర్లకూ స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసి వారు గౌరవ ప్రదంగా జీవనం సాగించేందుకు సౌకర్యాలను కల్పిస్తోంది. ఆకర్షణీయ నగరం పథకంలో భాగంగా అద్భుతమైన గ్రాంథాలయాలు నిర్మించి ఇక్కడి విద్యార్థఉలకు మంచి వాతావరణం కల్పించారు. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటూ వరంగల్ నగరాన్ని జీఎన్ఎల్సీకీ ఎంపిక చేశారు.
కృతజ్ఞతలు చెప్పిన మంత్రులు..
ఈ క్రమంలోనే వరంగల్ ను అభినందిస్తూ.. కేంద్ర సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి కూడా శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ యునెస్కో గ్లోబల్ నెట్ వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్ లో చేరింది. ఈ మహత్తర సందర్భంలో వరంగల్, తెలంగాణకు అభినందనలు.. వరంగల్ లోని గ్రేట్ రామప్ప ఆలయానికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ల్యాగ్ ఇచ్చిన తర్వాత వరంగల్ రెండో గుర్తింపును పొందింది అని ఆయన ట్వీట్ చేశారు. రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా వరంగల్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకోసం కృషి చేసిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు, ఉమ్మడి ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.