Ramappa: రామప్ప ఆలయంలో తమన్ స్పెషల్ షో, శివమణి డ్రమ్స్, 300 మంది నాట్య ప్రదర్శన కూడా
ఫుడ్ ఫెస్టివల్, ప్రముఖ సంగీత దర్శకులు తమన్, డ్రమ్స్ వాయిద్య కారుడు శివమణి సింగర్ కార్తీక్, నవీన్ లతో పాటు 300 మంది కళాకారులు కలిసి నాట్య ప్రదర్శన, వాయిలిన్ షోలను నిర్వహిస్తున్నామన్నారు
ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని (ఏప్రిల్ - 18) పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హెరిటేజ్ తెలంగాణ శాఖ, ములుగు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ‘శిల్పం, వర్ణం, కృష్ణం’ - ‘సెల్ బరేటింగ్ ది హెరిటేజ్ రామప్ప’ పేరుతో ‘వరల్డ్ హెరిటేజ్ డే’ మెగా వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు.
ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా రామప్ప దేవాలయం ప్రాంగణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు ఫుడ్ ఫెస్టివల్, ప్రముఖ సంగీత దర్శకులు SS తమన్, డ్రమ్స్ వాయిద్య కారుడు శివమణి సింగర్ కార్తీక్, నవీన్ లతో పాటు 300 మంది కళాకారులు కలిసి నాట్య ప్రదర్శన, వాయిలిన్ షో, లేజర్ షో లను నిర్వహిస్తున్నామన్నారు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్. ప్రపంచ వారసత్వ దినోత్సవం పురస్కరించుకొని రామప్ప దేవాలయం లో పెద్ద ఎత్తున పర్యాటకులను ఆకర్షించే విధంగా నిర్వహిస్తున్నామన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అద్భుతమైన పురావస్తు, చారిత్రక సంపద, ప్రకృతి జలపాతాలు, అందమైన ప్రదేశాలు, చారిత్రక కట్టడాలు, ప్రదేశాలను, తెలంగాణ హెరిటేజ్ శాఖ ఆధ్వర్యంలో పరిరక్షిస్తున్నామన్నారు మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి వల్ల రామప్ప దేవాలయం కు యునెస్కో గుర్తింపు లభించిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గుర్తింపు పొందే చారిత్రక వారసత్వ పురాతన కట్టడాలు ఎన్నో ఉన్నాయన్నారు. పురాతన కట్టడాలను చారిత్రక సంపద పరిరక్షణకు పెద్దపీట వేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన కళా సంపద, సంస్కృతి, సాంప్రదాయాలు, చారిత్రక , వారసత్వ సంపద ఎంతో ప్రత్యేకమైనదన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్న చారిత్రక వారసత్వ సంపదపై గత పాలకులు నిర్లక్ష్యం వహించారని మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రామప్ప దేవాలయం తో పాటు యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల గుర్తింపునకు అర్హత కలిగిన మరో 10, 15 చారిత్రక, వారసత్వ కట్టడాలు, ప్రదేశాలు ఉన్నాయన్నారు. వాటి పరిరక్షణకు, యునెస్కో గుర్తింపు కు కృషి చేస్తున్నమన్నారు. రామప్ప దేవాలయం కు యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో గుర్తింపు గతంలో వచ్చి ఉంటే తెలంగాణ చరిత్ర సాంస్కృతి, సాంప్రదాయాలు ప్రపంచ వ్యాప్తం అయ్యేవి అన్నారు. రాష్ట్రానికి విదేశీ పర్యాటకులు వచ్చే అవకాశం ఉండేదన్నారు.
రామప్ప దేవాలయం పరిసర ప్రాంతాల్లో ఉన్న దేవాలయాల పరిరక్షణకు తెలంగాణ పర్యాటక, హెరిటేజ్ శాఖల అధ్వర్యంలో 15 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టమన్నారు మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్. దేశ వ్యాప్తంగా యునెస్కో సంస్థ ఇప్పటివరకు 40 చారిత్రక, వారసత్వ కట్టడాలను, స్థలాలను ప్రపంచ వారసత్వ కట్టడాలుగా గుర్తించిందని అన్నారు. ఇందులో రామప్ప దేవాలయం 39వ కట్టడంగా యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించిందన్నారు.
ప్రపంచ వారసత్వ గుర్తింపు కోసం ఈ ప్రతిపాదనలు కూడా
ప్రపంచ వారసత్వ గుర్తింపు కోసం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కృష్ణా మండలం, ముడుమాల గ్రామంలోని 3 వేల సంవత్సరాల క్రితం ఆదిమానవుని ఆనవాళ్లు, నిలువు రాళ్ల సమాధులను, నల్గొండ జిల్లాలోని పానగల్లు గ్రామంలో ఉన్న శ్రీ ఛాయ సోమేశ్వర దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపు కోసం ప్రతిపాదనలను సమర్పించామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సాంస్కృతిక, వారసత్వ ప్రదేశాలు, చిహ్నాల ప్రాముఖ్యత గురించి, అవగాహన పెంచడం, వాటి పరిరక్షణ, రక్షణను కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం - పర్యాటకశాఖ, హెరిటేజ్ శాఖల ద్వారా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నమన్నారు రాష్ట్ర మంత్రి డాక్టర్ వి . శ్రీనివాస్ గౌడ్.