CM Revanth Reddy: మంత్రులను బద్నాం చేయొద్దు, నాతో వివరణ తీసుకుని రాయండి: మీడియాకు రేవంత్ రెడ్డి సూచన
Telangana News Today | సింగరేణి టెండర్లలో అవకతవకలు జరుగుతున్నాయని, బొగ్గు గనులు మాయమవుతున్నాయంటూ కథనాలు, మంత్రులపై రాసిన వార్తలపై సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా పర్యటనలో ఘాటుగా స్పందించారు.

Singareni Tenders Issue | ఖమ్మం: ఖమ్మం జిల్లా నుండే తన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. రాష్ట్ర మంత్రులపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, వారిపై కథనాలు రాసే ముందు తనతో వివరణ తీసుకోవాలని సూచించారు. ఆదివారం ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి సుమారు రూ. 362 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. జిల్లాలోని ఏదులాపురంలో జేఎన్‌టీయూ కాలేజీతో పాటు లపు అభివృద్ధి పనులు, 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన రూ. 2 కిలో బియ్యం పథకాన్ని గుర్తుచేసుకున్నారు. ఇది మంచి పథకం కనుక ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలో పేదలకు ఉచితంగా 'సన్నబియ్యం' పంపిణీ చేస్తోందని, ఇది ఎన్టీఆర్‌కు ఇచ్చే అసలైన నివాళి అన్నారు.
మంత్రులపై వార్తలు రాస్తే నాతో వివరణ తీసుకోండి.. సీఎం రేవంత్ రెడ్డి
సింగరేణి టెండర్ల చుట్టూ జరుగుతున్న ప్రచారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. సింగరేణి బొగ్గు మాయమైందని లేక కుంభకోణం జరిగిందని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. టెండర్లను కేవలం అనుభవం ఉన్న సంస్థలకే కేటాయిస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మీడియా సంస్థల మధ్య అంతర్గత గొడవలు ఉంటే అవి తమ మధ్యే వాటిని తేల్చుకోవాలని, కానీ రాష్ట్ర మంత్రులపై అసత్య ప్రచారాలు చేసి ప్రభుత్వ గౌరవానికి భంగం కలిగించవద్దని హెచ్చరించారు. మంత్రులపై ఎలాంటి కథనాలు రాసినా, ముందుగా ముఖ్యమంత్రిగా తన వివరణ తీసుకోవాలని సూచించారు. గత రెండేళ్లుగా తమ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తోందని, ఎక్కడా ఎలాంటి పొరపాట్లు జరగలేదన్నారు. రాబోయే పదేళ్లు అధికారంలో ఉండి తెలంగాణను దేశంలోనే మొదటి స్థానంలో నిలుపుతామని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తమకు కొన్ని మీడియా రాసే అసత్య కథనాలతో లాభం పొందాలని బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తుందన్నారు.
రేషన్ కార్డులు సహా సంక్షేమ పథకాలు చేస్తున్నాం..
సంక్షేమ పథకాల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. గత BRS ప్రభుత్వ హయాంలో కొత్త రేషన్ కార్డుల మంజూరు నిలిచిపోయిందని, కానీ తమ ప్రజాపాలనలో లక్షలాది మందికి కార్డులు అందజేశామన్నారు. దివంగత వైఎస్సార్ రైతులకు ఉచిత విద్యుత్ అందించిన స్ఫూర్తితో, ప్రస్తుతం తాము ప్రతి పేద కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని సీఎం రేవంత్ అన్నారు. గత ప్రభుత్వం ఇళ్లు ఇవ్వకుండా పేదలను మోసం చేసిందని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిందని తెలిపారు. భద్రాచలం అభివృద్ధి కోసం అప్పటి సీఎం కేసీఆర్ ఇచ్చిన రూ. 100 కోట్ల హామీ నెరవేరలేదని, ప్రస్తుతం తమ ప్రభుత్వం భూసేకరణ జరిపి అయోధ్య తరహాలో భద్రాద్రిని అద్భుతంగా తీర్చిదిద్దుతుందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
సన్నబియ్యం పథకం: తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు దొడ్డు బియ్యానికి బదులుగా నాణ్యమైన సన్నబియ్యాన్ని అందించడం ద్వారా పేద ప్రజల ఆహార భద్రతను మెరుగుపరుస్తోంది.
భద్రాచలం మాస్టర్ ప్లాన్: భద్రాద్రి రామాలయ పరిసరాలను అభివృద్ధి చేయడానికి, గోదావరి కరకట్టను పటిష్టం చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయించింది.
ఇందిరమ్మ ఇళ్లు: సొంత స్థలం ఉన్న పేదలకు ఇల్లు నిర్మించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.





















