Mulugu News: వాటర్ ఫాల్స్ చూసేందుకు వెళ్లి, వాగులో చిక్కుకున్న 84 మంది పర్యాటకులు
Muthyam Dhara Waterfalls In Mulugu District: కొందరు వర్షాలు పడుతుండగా ముత్యాలధార జలపాతాల అందాలను వీక్షించేందుకు వెళ్లి వాగు పొంగడంతో మధ్యలోనే చిక్కుకుపోయారు.
Muthyam Dhara Waterfalls In Mulugu District: అసలే తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా విద్యా సంస్థలకు సైతం సెలవులు ప్రకటించారు. అత్యవసరమైతే తప్పా ప్రజలు బయటకు టూర్లకు, సందర్శనకు వెళ్లకూడదని అధికారులు, పోలీసులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు వర్షాలు పడుతుండగా జలపాతాల అందాలను వీక్షించేందుకు వెళ్లి వాగు పొంగడంతో మధ్యలోనే చిక్కుకుపోయారు.
ములుగు జిల్లా ముత్యాల ధార వాటర్ ఫాల్స్ సందర్శనార్థం వెళ్లిన కొందరు మధ్యలోనే చిక్కుకుపోయారు. భారీ వర్షాలు, వరద నీటి ప్రవాహం కారణంగా ముత్యాల ధార వాటర్ ఫాల్స్ కు వెళ్లిన 84 మంది సందర్శకులు తిరుగు ప్రయాణమయ్యారు. కానీ అడవిలో చిక్కుకున్నారు. దాంతో సహాయం కోరుతూ పోలీసులకు, హెల్ప్ లైన్ నెంబర్లకు కాల్ చేశారని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం తెలిపారు. జిల్లా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, NDRF బృందాలతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపారు. సాధ్యమైనంత త్వరగా వారిని రక్షించి సురక్షితంగా తీసుకోస్తామన్నారు. అడవిలో చిక్కుకున్న పర్యాటకులు వీరభద్రపురంలో కార్లు, ద్విచక్ర వాహనాలు పార్కు చేసి ఉంచినట్లు తెలుస్తోంది.
ముత్యందార జలపాతం సందర్శనకు వెళ్లి అడవిలో చిక్కుకున్న పర్యాటకుల పరిస్థితిపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ తో ఫోన్ లో మాట్లాడి వివరాలు ఆరా తీశారు. తక్షణ సహాయచర్యలు చేపట్టి, పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని మంత్రి ఎర్రబెల్లి ఆదేశించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ తదితర అధికారులను తక్షణ సహాయచర్యలు చేపట్టి, పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పర్యాటకులంతా క్షేమంగానే ఉన్నారని బాధిత కుటుంబసభ్యులు దైర్యంగా ఉండాలన్నారు.
కుండపోత వర్షానికి వాగు అవతల కారడవిలో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రానికి 9కి.మీ దూరంలో ముత్యంధార జలపాతం ఉంది. అయితే సెలవు దినం కావడంతో జలపాతాన్ని చూడడానికి వెళ్లిన సందర్శకులు తిరిగి వస్తున్న క్రమంలో వాగు పొంగిపొర్లడంతో పర్యాటకులు అడవిలో చిక్కుకుపోయారని తెలుస్తోంది.
భద్రాచలం వద్ద పెరిగిన గోదావరి నీటిమట్టం,రెండో ప్రమాద హెచ్చరిక జారీ
తెలంగాణతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రంలోని వాగులు, వంకలు, జలపాతాలన్నీ పొంగి పొర్లుతున్నాయి. ముఖ్యంగా గోదావరి నది అయితే ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతూ వస్తోంది. నిన్న 39 అడుగుల వద్ద ప్రవహించిన గోదావరి నది ఈరోజు ఉదయానికి 42 అడుగులకు చేరుకుంది. మధ్యాహ్నం 3 గంటలకు 44.4 అడుగులకు చేరుకోగా.. అప్రమత్తమైన అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. భద్రాచలం ఎగువన ఉన్న తాలిపేరు ప్రాజెక్టు నుంచి 23 గేట్లు ఎత్తి లక్షా 80 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. నీటిమట్టం మరింత పెరిగితే ఈరోజు రాత్రి వరకు రెండో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేసే అవకాశం ఉందని అధికారులు వివరిస్తున్నారు. నీటిమట్టం 43 అడుగలకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక, 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. రాత్రి 48 అడుగులకు పైగా నీటిమట్టం చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial