Warangal: ప్రతి నీటి ప్రాజెక్టులో వేల కోట్ల స్కామ్, మొత్తం దోచుకున్న కేసీఆర్ - మంత్రులు సీతక్క, ఉత్తమ్
Minister Seethakka: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న దేవాదుల ప్రాజెక్టును మంత్రులు పరిశీలించారు. మార్చి 2026 నాటికి దేవాదుల ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం చేస్తామని హామీ ఇచ్చారు.
Uttam Kumar Reddy: దేవాదుల ప్రాజెక్టును మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క పరిశీలించారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం గంగారం దేవాదుల ఇంటెక్ పంప్ హౌస్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సమక్క సాగర్ ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిపై ఇంజనీర్లతో రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
అనంతరం మీడియాతో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మార్చి 2026 నాటికి దేవాదుల ప్రాజెక్టును సోనియా గాంధీ చేతులమీదుగా ప్రారంభోత్సవం చేస్తామని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఇరిగేషన్ శాఖను అడ్డుపెట్టుకొని కేసీఆర్ దోపిడీకి పాల్పడ్డారని విమర్శించారు. ప్రతీ ప్రాజెక్టులో వేల కోట్ల స్కాం జరిగిందన్నారు. ప్రాజెక్టుల పేరుతో 1 కోటి 81 లక్షల నిధులు కేసీఆర్ హాయంలో ఖర్చు పెట్టారన్నారు. రూ.14 వేల కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉంచారని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. కమీషన్ల కోసం కకృత్తి కోసం ప్రాజెక్టులు కట్టారన్నారు. కాళేశ్వరం, పాలమూరు, దేవాదుల, సీతారామ ప్రాజెక్టులలో అందినకాడికి దోచుకున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.
తెలంగాణ గ్రామీణ ముఖ చిత్రం మార్చడం మా లక్ష్యం అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రతీ ఎకరాకు నీళ్ళు అందిస్తామన్నారు. నిర్దేశిత గడువులోపు దేవాదుల పూర్తి చేసి, 5 లక్షల 57 వేల ఎకరాలకు నీళ్ళు అందిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సమ్మక్క బ్యారేజ్ కట్టడం వల్ల దేవాదుల ద్వారా 300 రోజులు, 60 టిఎంసిల నీళ్ళు లిఫ్ట్ చేస్తామన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై కేసీఆర్ కు అవగాహన లేకుండా తీరని అన్యాయం చేశారని, వాటిని మేము సరిచేస్తూ వస్తున్నామని అన్నారు. సీతారామ ప్రాజెక్టుకు 67 టీఎంసీలు కేటాయించేలా CWC తో చర్చలు జరుపుతున్నామని ఆయన చెప్పారు. సమ్మక్క సారక్క బ్యారేజ్ ఎన్వోసీ కోసం ఛత్తీస్గఢ్ ను ఒప్పిస్తామన్నారు. కేసీఆర్ లాగా ఫార్మ్ హౌజ్ లో కూర్చొని నిర్ణయాలు తీసుకోబోమన్నారు.
దేవాదుల ప్రాజెక్టు పెండింగ్ బిల్లులు త్వరలో చెల్లిస్తామని, ధరలు పెరగడంతో భూసేకరణ ఇబ్బందిగా మారిందని ఉత్తమ్ చెప్పారు. ఇరిగేషన్ శాఖ బలోపేతం కోసం 7 వందల మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లను నియమించామన్నారు. ఆపరేషన్ మెయింటేనెన్స్ కోసం రూ.1100 కోట్లు కేటాయిస్తామని ఉత్తమ్ చెప్పారు. అన్ని ప్రాజెక్టులకు అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి డిసిల్టింగ్ చేయబోతున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.