Warangal News : మహబూబాబాద్ మల్లయ్య మహా మాస్ - మండల పరిషత్ మొత్తాన్ని రోడ్డున పడేశారు ! ఏం జరిగిందంటే ?
మహబూబాబాద్‌లో అద్దె చెల్లించలేదని మండల పరిషత్ ఆఫీసుకు తాళం వేశారు యజమాని. దీంతో పరిషత్ సమావేశం వాయిదా పడింది.
Warangal News : ప్రభుత్వం అంటే ఓ భరోసా. ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా.. కాంట్రాక్ట్ లభించినా.. చివరికి ప్రభుత్వానికి ఏదైనా భవనం అద్దెకిచ్చినా నెలవారీగా ఖచ్చితంగా ఆదాయం వస్తుందనే ఓ నమ్మకం ఉంటుంది. అందుకే ప్రభుత్వం నుంచి ఆఫర్ వస్తే వదులుకోరు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లికి చెందిన మల్లయ్య కూడా ఇలాగే అనుకున్నాడు. తన ఇంటిని ఎంపీడీవో ఆఫీసుగా మార్చుకుని వాడుకోవడానికి అద్దెకిచ్చాడు. ఇంకేముంది నెలా నెలా అద్దెలు జీతంలా వచ్చేస్తాయని అనుకున్నాడు. అనుకున్నాడు కానీ.. పైసా రాలేదు. అడిగి.. అడిగి వేసారి పోయి .. చివరికి ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. దాంతో అందరూ అవాక్కయ్యారు.
కొత్త మండలం ఏర్పాటు చేసినప్పుడు మల్లయ్య భవనం లీజు !
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలో మల్లయ్య అనే వ్యక్తికి చెందిన ఇంట్లో ఎంపీడీవో ఆఫీసు పెట్టారు. గతంలో దంతాల పల్లి గ్రామం మాత్రమే. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు కొన్ని మండలాలు ఏర్పాటు చేశారు. ఆ మండలాల్లో దంతాలపల్లి కూడా ఉంది. మండలం ఏర్పాటు చేశారు కాబట్టి ఎంపీడీవో ఆఫీసు కూడా పెట్టారు. కొత్త మమండలం కాబట్టి ప్రభుత్వ భవనం లేదు .. అందుకే మల్లయ్య భవనం తీసుకున్నారు. కానీ అద్దె చెల్లించడం మానేశారు. ఇప్పటికి ముఫ్పై నెలలు అయింది. ఒక నెల.. రెండు నెలలు.. ఆరు నెలలు.. లేకపోతే ఏడాది ఆగుతాను కానీ 30 నెలలు అద్దె ఇవ్వకపోవడం ఏమిటని ఆయన ఫీలయ్యారు.
అద్దె చెల్లంచకపోవడంతో తాళం వేసుకున్న మల్లయ్య
సరైన సమయం చూసి అధికారులకు షాక్ ఇవ్వాలనుకున్నారు. ఉదయం 11 గంటలకు మండల సర్వసభ్య సమావేశం పెట్టుకున్నారు. ఇంత కంటే మంచి సమయం ఉండదనుకున్న మల్లయ్య తన ప్లాన్ అమలు చేశాడు. సమావేశంలో ధర్నా చేయడం లాంటి పాత పద్దతులు పట్టించుకోలేదు.. తన ఇల్లు కాబట్టి.. ఓ తాళం తెచ్చుకుని భవనానికి తాళం వేసేశాడు. దీంతో కార్యాలయ సిబ్బంది ఆరు బయట నిల్చోవల్సిన పరిస్థితి ఏర్పడింది.. ఎంపీపీ సమావేశం జరుగునుండగా యజమాని నల్లకుంట్ల మల్లయ్య ఇంటికి తాళం వేయడంతో ఇప్పుడు ఆ విషయం చర్చనీయ అంశంగా మారింది .
అద్దె చెల్లిస్తేనే తాళం తీస్తానన్న మల్లయ్య
మంచిగా అడిగితే అద్దె ఇవ్వడం లేదని భావించిన యజమాని అధికారుల పని పట్టాల్సిందేనని నిర్ణయించుకుని ఇలా పరువు తీశారు. అద్దె చెల్లించే వరకు తాళం తీయనని తెగేసి చెప్పగా ఇప్పటి వరకు సుమారు 1.80 వేల రూపాయల అద్దె బకాయి ఉన్నట్లు నల్లకుంట్ల మల్లయ్య చెబుతున్నారు.. కార్యాలయానికి తాళం వేయడంతో సిబ్బంది బయటే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.. ఉన్నతాధికారులతో మాట్లాడి అద్దె ఇప్పస్తామని అధికారులు చెప్పిన పూర్తి అద్దె ఇచ్చే వరకు తాళం తీసేది లేదని తెగేసి చెప్పాడు మల్లయ్య. దీంతో అధికారులకు ఏం చేయాలో పాలు పోలేదు. భవనం ఆయనది కాబట్టి.. విధి నిర్వహణకు అడ్డం తగిలారని కేసు పెట్టడానికి కూడా లేకుండా పోయింది.