Legal Advice for Rs 1: ఒక్క రూపాయికే న్యాయ సలహా పొందడం ఎలాగో మీకు తెలుసా, పూర్తి వివరాలివే
Centralised Legal Network Solutions | నిరుపేదలు కోర్టు కేసులంటే భయపడతారు. అయితే కేవలం ఒక్క రూపాయికే న్యాయ సలహా పొంది సమస్యలను పరిష్కారం చూపిస్తున్నారు యువ లా గ్రాడ్యుయేట్స్.

Legal Advice For one Rupee | జనగామ: ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది. అందుకే ఐడియాలు వస్తే సరిపోదు. వాటిని ఆచరించే ప్రయత్నం చేసినప్పుడే ప్రయోజనం ఉంటుందని పెద్దలు చెబుతుంటారు. విద్య, వైద్యంతో పాటు కోర్టు కేసులకు సంబంధించి న్యాయ పరిష్కారాలకు ఎంత ఖర్చు చేయాల్సి వస్తుందో కచ్చితంగా చెప్పలేం. అయితే మీరు కేవలం ఒక్క రూపాయి చెల్లించి న్యాయ సలహా పొందవచ్చు అని మీకు తెలుసా. మీరు విన్నది నిజమే. ఆ వివరాలిలా ఉన్నాయి.
లా స్టూడెంట్ ఆలోచన
జనగామ జిల్లా పాలకుర్తి మండలం చెన్నూరుకు చెందిన ఆదర్శ్ కండిక అనే లా స్టూడెంట్ చేసిన వినూత్న ప్రయత్నం ఎందరికో పరిష్కారం చూపుతోంది. పేదలకు ఉచిత న్యాయ సహాయం అందించడం అంత ఈజీ కాదు. అయితే నిరుపేదలకు కేవలం రూ.1కే న్యాయ సలహా అందించాలని ఆదర్శ్ భావించాడు. అతడి ఆలోచనతో ఏకీభవించిన 9 మంది స్నేహితులు ఇందుకు ఓకే చెప్పారు. వీరంతా కలిసి సీఎల్‌ఎన్‌ఎస్.ఇన్ (CLNS.IN) అనే వెబ్‌సైట్‌ను రూపొందించారు. ఆదర్శ్ ఫౌండర్, సీఈవోగా వ్యవహరిస్తుండగా, ప్రణయ్ పిడుగు కో ఫౌండర్, టెక్ హెడ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
సీఎల్‌ఎన్ఎస్ వెబ్‌సైట్, యాప్
మంచి రెస్పాన్స్ రావడంతో ఈ టీమ్ తమ లా కోర్సు పూర్తికాగానే 2025 మే నెలలో సీఎల్‌ఎన్‌ఎస్ (Centralised Legal Network Solutions) యాప్, వెబ్‌సైట్ (clns.in), స్టార్టప్ సంస్థను ప్రారంభించారు. కేవలం రూపాయి చెల్లిస్తే చాలు న్యాయ సమస్యలకు సలహా అందిస్తున్నారు. నిరుపేదలకు ఉచిత న్యాయ సేవ చేయాలనుకుంటున్న దేశవ్యాప్తంగా మరికొందరు లాయర్లు, న్యాయ నిపుణులు వీరితో భాగస్వామిగా ఉన్నారు. టీహబ్ నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఆదర్శ్ అండ్ టీమ్ ఇప్పటివరకు కొన్ని వేల మందికిపైగా సాయం అందించినట్లు తెలుస్తోంది. వీరు అందిస్తున్న సేవలపై విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
ఫైండ్ ఎ లాయర్ (Find A Lawyer), అధికారులతో మాట్లాడండి (Talk To official), అవర్ సర్వీసెస్ ఆప్షన్లు ఎంచుకోవడం ద్వారా న్యాయవాదులు, అధికారులను, ప్రజలను ఒకే వేదికపైకి తీసుకొచ్చేలా వెబ్ సైట్ రూపొందించి సేవలు అందిస్తున్నారు. సీఎల్‌ఎన్‌ఎస్ యాప్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. తరువాత తమ సమస్యను పోర్టల్ లో నమోదు చేస్తే న్యాయ సలహా ఇస్తారు. అత్యాధునిక టెక్నాలజీ ద్వారా సాధ్యమైనంత త్వరగా అవసరమైన వారికి న్యాయసలహా సమాచారం అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదేమైనా ఇలాంటి మంచి ప్రయత్నం చేస్తున్న వారిని కచ్చితంగా అభినందించాల్సిందే.






















