Heavy Rains: వర్ష బీభత్సం - మహబూబాబాద్ లో కొట్టుకుపోయిన యువతి మృతదేహం లభ్యం, పాలేరులో ముగ్గురు గల్లంతు
Mahabubabad : ఉమ్మడి వరంగల్ జిల్లాలో కుండపోత వర్షం కొనసాగుతోంది. వరద ఉధృతికి ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గంగారం తండాకు చెందిన తండ్రీకూతుళ్లు నునావత్ మోతీలాల్, అశ్విని కొట్టుకుపోయారు.
Heavy Rains : ఉమ్మడి వరంగల్ జిల్లాలో కుండపోత వర్షం కొనసాగుతోంది. శనివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ములుగు, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో వాగులు, వంకలు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. దీంతో వందలాది గ్రామాలకు రవాణా వ్యవస్థ దెబ్బతింది. మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం వంతెన వద్ద వరద ఉధృతికి ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గంగారం తండాకు చెందిన తండ్రీకూతుళ్లు నునావత్ మోతీలాల్, అశ్విని కొట్టుకుపోయారు. స్వగ్రామం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్తుండగా ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
కారుతో కొట్టుకుపోయిన తండ్రీకూతుళ్లు
తీవ్రగాలింపుల తర్వాత వరద ప్రవాహంలో కొట్టుకపోయిన కారులో కూతురు ఆచూకీ లభించింది. కారులో ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గేట్ కారేపల్లి గంగారం తండాకు చెందిన తండ్రి, కూతుర్లు హైదరాబాద్ బయల్దేరిన క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పురుషోత్తమాయగూడెం ఆకేరు వాగు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో అదుపుతప్పి కొట్టుకు పోయింది. కారులో నూనావత్ మోతిలాల్, నూనావత్ అశ్విని అన్నారు. అయితే ఆకేరు వాగు సమీపంలో ఉన్న పామాయిల్ తోటలో అశ్విని మృత దేహం లభ్యమైంది. కారు ఆనవాళ్లు ఏటి ప్రవాహంలో కనిపిస్తున్నాయి. తండ్రి మోతిలాల్ ఆచూకి మాత్రం ప్రస్తుతానికి లభ్యంకాలేదు. ఆమె మృతదేహం పామాయిల్ చెట్టుకు తట్టుకుంది. కారు ఆనవాళ్లు వాగు ప్రవాహంలో కనిపిస్తున్నట్లు సమాచారం. తండ్రి మోతిలాల్ ఆచూకీ మాత్రం ప్రస్తుతానికి లభ్యంకాలేదు. కారులో నే చిక్కుకున్నారా లేదా వాగు ప్రవాహంలో కొట్టుకు పోయారా అనేది తెలియాల్సి ఉంది.
తొర్రూరులో..
తొర్రూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన నరసయ్య చెరువులో శనివారం సాయంత్రం చేపల వేటకు వెళ్లి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. చర్యలు తీసుకుంటున్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇంటికన్నె వద్ద వరద ఉధృతికి రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. కేసముద్రం మండలంలో ఇళ్లు నీట మునిగాయి. వందలాది మంది వరద బాధితులు సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
పాలేరులో విషాదం
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్‌గూడెంలో భారీ వర్షం కురుస్తోంది. పాలేరు వాగులో చిక్కుకున్న కుటుంబంలో ఓ జంట గల్లంతైంది. ప్రవాహంలో కొట్టుకుపోతున్న మరో యువకుడిని స్థానికులు, పోలీసులు రక్షించారు. పాలేరు అలుగు సమీపంలోని సిమెంట్ ఇటుకల ఫ్యాక్టరీలో ఓ కుటుంబం నివసిస్తోంది. ఆదివారం తెల్లవారుజామున పాలేరు రిజర్వాయర్‌కు వరద నీరు రావడంతో షేక్ యాకూబ్, అతని భార్య సైదాబీ, కుమారుడు షరీఫ్‌లు వరదలో చిక్కుకున్నారు. వరద ఉధృతి పెరగడంతో వారు ప్రవాహంలో గల్లంతయ్యారు. నీట మునిగిన షరీఫ్‌ను స్థానికులు, పోలీసులు రక్షించారు. దంపతుల కోసం అన్వేషణ కొనసాగుతోంది.
మహబూబాబాద్ జిల్లాలో కుంభవృష్టి..!
మహబూబాబాద్ జిల్లాలో కుంభవృష్టి కొనసాగింది. జిల్లాలోని గంగారం మండలం మినహా అన్ని మండలాల్లో 150 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు అయింది. కొత్తగూడ 162.4, గంగారంలో 68.2, బయ్యారం 174.4, డోర్నకల్ 262.4, కురవి 354.2, మహబూబాబాద్ 374.8, గూడూరు 254.0, కేసముద్రం 377.2, నెల్లికుదురు 460.5 పేట, 56.66 .4, దివన్ పల్లి 354.2, తొర్రూరు 262.4, పెద్దవంగర 245.4మి.మీ.ల రికార్డు వర్షపాతం నమోదైంది. జిల్లాలో మొత్తం వర్షపాతం 4747.3 మి.మీ కాగా జిల్లా సగటు వర్షపాతం 296.7 మి.మీ.గా నమోదైంది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంతో పాటు గూడూరు, నెల్లికుదురు, కురవి, మరిపెడ మండల కేంద్రాలు నీట మునిగాయి. మహబూబాబాద్ జిల్లాలోని మున్నేరు, పాలేరు, ఆకేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.