Warangal News: వరంగల్ విమానాశ్రయం ఏర్పాటులో ముందడుగు - సర్వేకు ఏఏఐ కసరత్తు!
Telangana News: వరంగల్ ప్రాంతీయ విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించి ఎట్టకేలకు ముందడుగు పడింది. ఏఏఐ కసరత్తు ప్రారంభించింది.
AAI Exercise Survey For Warangal Airport: వరంగల్ ప్రాంతీయ విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించి ఎట్టకేలకు ముందడుగు పడింది. ప్రాథమిక భూ సర్వే కోసం ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) కసరత్తు ప్రారంభించింది. కొన్నాళ్లుగా విమానాశ్రయ ఏర్పాటుపై కదలిక లేకపోవడంతో.. నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో ఏఏఐ కసరత్తు ప్రారంభిస్తుండడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. గతేడాది రాష్ట్ర ప్రభుత్వం అదనపు భూమి కేటాయించడంతో ఇటీవల క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు సంబంధించిన హెలికాఫ్టర్లు కూడా క్షేత్రస్థాయిలోని పరిస్థితులను పరిశీలించాయి.
ఆరు చోట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు
రాష్ట్రంలో ఆరు చోట్ల ప్రాంతీయ విమానాశ్రయాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. ఈ మేరకు కేంద్రాన్ని కూడా కోరింది. మామునూరు(వరంగల్), ఆదిలాబాద్, బసంత్ నగర్(పెద్దపల్లి), జక్రాన్‌పల్లి(నిజామాబాద్), కొత్తగూడెం, గుడిబండ(మహబూబ్‌నగర్) లను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు 2019లో ఏఏఐ ప్రాథమిక అధ్యయనం నిర్వహించి 6 చోట్ల నిర్మాణాలకు సుముఖత వ్యక్తం చేసింది. అనంతరం ఇది కాగితాలకే పరిమితమైంది. వరంగల్ విమానాశ్రయాన్ని తొలుత చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి.. ఈ మేరకు కేంద్రానికి తెలియజేసింది.
ఎయిర్ స్ట్రిప్ పరిధిలో 706 ఎకరాలు
ప్రస్తుతం వరంగల్ ఎయిర్ స్ట్రిప్ పరిధిలో 706 ఎకరాలు ఉన్నాయి. ప్రాంతీయ విమానాశ్రయంగా తొలిదశ అభివృద్ధికి కనీసం 400 ఎకరాలు కావాలని ఏఏఐ పేర్కొంది. అందులో భాగంగానే 253 ఎకరాలు కేటాయిస్తూ గతేడాది ఆగస్టు 10న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌లోని జీఎంఆర్ విమానాశ్రయంతో పాటు రక్షణ శాఖ నుంచి కూడా అనుమతి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. దశాబ్ధాల కిందటే వరంగల్‌లో ఎయిర్ ఫీల్డ్ ను నిర్మించారు. అత్యవసర పరిస్థితుల్లో, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అథారిటీ పైలెట్ల శిక్షణకు దీన్ని వినియోగిస్తున్నారు. తాజాగా ప్రధాని పర్యటన సందర్భంగా ఆ ఎయిర్ ఫీల్డునే అధికారులు ఉపయోగించారు. దీన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తే మరింత ఉపయక్తంగా ఉంటుదని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు చర్యలు చేపడుతోంది. ఇది శంషాబాద్‌లోని జీఎంఆర్ విమానాశ్రయానికి 145 కిలో మీటర్లు దూరంలో ఉంది. విజయవాడ సమీపంలోని గన్నవరానికి 200, నాగ్‌పూర్‌కు 357, విశాఖపట్నానికి 385 కిలో మీటర్లు దూరంలో ఉంది. జీఎంఆర్ ఎయిర్‌పోర్టు నిర్మాణం సందర్భంగా 150 కిలో మీటర్లు పరిధిలో మరో విమానాశ్రయం అభివృద్ధి చేయకూడదన్న నిబంధన ఉంది. దీంతో వరంగల్ విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించి జీఎంఆర్ అనుమతి తప్పనిసరి అయింది.
సర్వత్రా ఆసక్తి
వరంగల్‌లో విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించిన నిర్ణయం కేసీఆర్ సర్కార్‌ది. దీనిపై రేవంత్ సర్కారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. భూ కేటాయింపునకు సంబంధించిన ఉత్తర్వులు నేపథ్యంలో ఏఏఐ ఇటీవల క్షేత్రస్థాయిలో పరిశీలన కూడా చేపట్టింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తు సమాచారం కూడా లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దీనిపై ఎలా వ్యవహరిస్తుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. విమానాశ్రయం అభివృద్ధి చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం కనీసం రూ.750 కోట్ల వరకు చెల్లించాల్సి ఉన్నట్టు చెబుతున్నారు. లోక్‌సభ ఎన్నికల తరువాత దీనిపై స్పష్టత వస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.