ABP Desam Impact : ఏబీపీ దేశం కథనానికి స్పందన, ప్రయాణికుడిని కాలితో తన్నిన కండెక్టర్ సస్పెండ్!
ABP Desam Impact : ఆర్టీసీ బస్సులో మతిస్థిమితం లేని యువకుడిని కాలితో తన్నిన కండెక్టర్ పై చర్యలు తీసుకుంటామని వరంగల్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ శ్రీదేవి తెలిపారు.
ABP Desam Impact : మానవత్వం మరిచి ప్రయాణికుడిని కాలుతో తన్నిన కండక్టర్ అనే ABP దేశం కథనానికి వరంగల్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ శ్రీదేవి స్పందించారు. వరంగల్ జిల్లా సంగెం పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఏబీపీ దేశం కథనాన్ని ప్రచురించింది. ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించిన కండక్టర్ పై చర్యలు తీసుకుంటామని రీజినల్ మేనేజర్ శ్రీదేవి తెలిపారు. కండెక్టర్ ను సస్పెండ్ చేస్తామన్నారు. ప్రయాణికులే దేవుళ్లు అని ఆర్టీసీ ఎండీ సజ్జనర్ చెపుతుంటే.. ఒక కండెక్టర్ మాత్రం అందుకు భిన్నంగా ఓ మతిస్థిమితం లేని యువకుడిని కాలుతో తన్నారు. ఈ ఘటనపై తోటి ప్రయాణికులు అభ్యంతం తెలిపారు.
అసలేం జరిగిందంటే
ఎల్గుర్ రంగంపేటకు చెందిన దేవదాసు అనే ప్రయాణికుడు వరంగల్ నుండి చండ్రుగొండకు వెళ్లే ఆర్టీసీ బస్సు ఎక్కాడు. వరంగల్ నుంచి తన స్వగ్రామానికి వెళ్తున్నాడు అతడు. అందరు ప్రయాణికుల్లాగా దేవదాసు కండక్టర్ కు టికెట్ కోసం డబ్బులు ఇచ్చాడు. ముందుగా టికెట్ డబ్బులు ఇచ్చినా, తనకు టికెట్ ఇవ్వకపోవడంతో కండక్టర్ ను టికెట్ ఇవ్వాలని ప్రయాణికుడు అడిగాడు. దాంతో ఆవేశానికి లోనైన కండక్టర్ ఆ ప్రయాణికుడిని కాలితో తన్నాడు. మతిస్థిమితంలేని యువకుడిని కండక్టర్ కాలుతో తన్నిన ఘటన వరంగల్ ఆర్టీసీలో కలకలం రేపుతోంది. వరంగల్ జిల్లా సంగెం మండలంలో ఈ ఘటన జరిగింది. టికెట్ ఇవ్వమని అడిగితే దౌర్జన్యం చేయడం ఏంటని తోటి ప్రయాణికులు కండక్టర్ ను నిలదీశారు. ప్రయాణికులపై ఇలా దాడులు చేయడం, కాలితో తన్నుతూ వారిని అవమానిస్తున్న కండక్టర్ పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని టీఎస్ ఆర్టీసీ ఎండీని, ఆర్టీసీ అధికారులను కోరారు.