Warangal Politics : ఓరుగల్లు పొలిటికల్ సర్కిల్ లో మావో అజెండా, సానుభూతి వ్యాఖ్యలతో ఓట్లు పడతాయా?
Warangal Politics : వరంగల్ లో రాజకీయాల్లో మావో సానుభూతి పార్టీలకు కలిసి వచ్చే అంశంగా మారింది. గతంలో వైఎస్ఆర్, కేసీఆర్ మావో సానుభూతి వ్యాఖ్యలు ఆయా పార్టీలకు కలిసివచ్చాయంటున్నారు విశ్లేషకులు.
Warangal Politics : రాజకీయ పార్టీలు మావోయిస్టులను ఎందుకు ఎంచుకుంటున్నాయి. ప్రజల్లో సానుభూతి పెంచుకొని ఓట్ల రూపంలో అధికారంలోకి రావడానికా అంటే అవుననే సమాధానం వస్తుంది. ప్రజలను మెప్పించడానికి రాజకీయ నాయకుల నోట మావోయిస్టులపై సానుభూతి మాటలు వినిపిస్తున్నాయి. నాయకులకు ఈ మాటలు కొత్తేమికాదు. గతంలో, ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు మావోలపై వ్యాఖ్యలు చేసి అధికారంలోకి వచ్చినవే. ఇప్పుడు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మావోలపై సానుభూతి మాటలు మాట్లాడారు.
సానుభూతితో అధికారం
రాజకీయ నాయకులకు మావోలపై సానుభూతి చూపెట్టనిదే అధికారంలోకి రామనే విషయం తెలిసిందా? అంటే అవుననే అంటున్నారు స్థానిక నేతలు. పార్టీలు అధికారానికి దూరమైన సందర్భాల్లో మావోలు గుర్తుకు వస్తారు. ఉత్తర తెలంగాణతో పాటు దక్షణ తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మావోలపై సానుభూతి ఎక్కువగా ఉంటుంది. ప్రజల్లో ఉన్న సానుభూతిని మావోయిస్టుల కంటే రాజకీయ నాయకులే ఎక్కువగా వాడుకుంటారు. ప్రజల్లో మావోలపై ఉన్న సానుభూతి ఓట్ల రూపంలో రాబట్టుకోవడానికి నాయకులు అధికారం కోల్పోయిన ప్రతిసారి మావోలపై ప్రేమను చూపెడతారు. గతంలో అధికారంలో ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు సైతం మావోయిస్టులను ఓట్ల కోసం వాడుకున్నవారే. తాజాగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ యాత్రలో ఉద్యమాల గడ్డ వరంగల్ లో మావోయిస్టులపై సానుభూతి మాటలు మాట్లాడి జనాలతో చప్పట్లు కొట్టించుకున్నారు.
అజెండా పాలకులు అమలు చేసేనా!
అయితే రాజకీయ నాయకులకు మావోయిస్టులపై ప్రేమ చూపెట్టడం కొత్తేమికాదు. తొమ్మిది సంవత్సరాలు అధికారంలో ఉన్న టీడీపీని గద్దె దించడంకోసం వైఎస్ఆర్ అధికారంలోకి వస్తే మావోయిస్టులతో చర్చలు జరిపి వారి సూచన మేరకు పరిపాలనను కొనసాగిస్తామని చెప్పారు. దీంతో ప్రజల నుంచి ఓట్లు పడడానికి, కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి దోహదపడింది. అయితే మావోలతో జరిపిన చర్చలు సఫలం కాలేదు. కాంగ్రెస్ పార్టీ రెండు పర్యాయాలు అధికారంలో ఉంది. ఉద్యమ పార్టీగా కొనసాగిన ఇప్పటి బీఆర్ ఎస్ సైతం తెలంగాణ ఏర్పడిన తరువాత మావోయిస్టు పార్టీ అజెండానే టీఆర్ఎస్ అజెండా అని కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. రెండు పర్యాయాలుగా అధికారంలో కొనసాగుతున్న మావో అజెండాను కొనసాగించలేదు.
కాంగ్రెస్ అధికారానికి దూరంగా 10 సంవత్సరాలు
కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమై పది సంవత్సరాలు కావస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ పార్టీ పాదయాత్రలు మొదలుపెట్టింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా వేదికగా హాత్ సే హాత్ జూడో యాత్రను చేపట్టాడు. అది కూడా గిరిజన పోరాట వీరవనితలు సమ్మక్క సారాలమ్మ కొలువైన మేడారం నుంచి యాత్ర మొదలుపెట్టారు. ములుగు కేంద్రంలో మావోయిస్టులకు సానుభూతిగా మాట్లాడారు రేవంత్. అయితే వైఎస్ఆర్, కేసీఆర్ స్టైల్లో కాకుండా ప్రజలు, మావోయిస్టులు తేల్చుకోవాలనే విధంగా మాట్లాడారు. రాష్ట్రంలో గడీల పాలన సాగుతుంది. గడీలను కూల్చిన చరిత్ర మావోలకు ఉంది. కేసీఆర్ గడీ అయిన ప్రగతి భవన్ ను మావోయిస్టులు బాంబులతో కూల్చాలని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గడీలు ప్రజలకు అవసరం లేదని మాట్లాడారు.
రేవంత్ రెడ్డి మాటలపై అధికార పార్టీ నేతల ఫైర్
అయితే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు మాటల దాడికి దిగడంతో పాటు చట్ట వ్యతిరేకంగా మాట్లాడిన రేవంత్ పై పోలీస్ లకు ఫిర్యాదు చేశారు. అయితే రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. మావోలతో చర్చలు జరుతామని వైయస్ఆర్, మావో అజెండాను అమలు చేస్తానన్న కేసీఆర్ మాటలకు ప్రజలు నమ్మిఓట్లు వేసారో తెలియదు కానీ. ఇద్దరు నేతలు రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చారు. మరి రేవంత్ రెడ్డి మావోల సానుభూతి మాటలతో ఓట్లు రాలుతాయో... అధికారంలోకి వస్తారో వేచిచూడాలి.