Satayavathi Rathode: గంగిరెద్దుల వాళ్లు తిరిగినట్లు బీజేపీ నేతల పర్యటనలు... తెలంగాణ రైతు కడుపు మండితే శంషాబాద్ ఎయిర్ పోర్టు దాటరు... మంత్రి సత్యవతి రాథోడ్
సంక్రాంతి పండుగకు గంగిరెద్దుల వాళ్లు వచ్చినట్టు బీజేపీ నేతలు తెలంగాణలో తిరుగుతున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. బండి సంజయ్ ఇప్పటికైనా తెలంగాణ రైతులు నష్టపోకుండా వ్యవహరించాలన్నారు.
సంక్రాంతి పండుగకు గంగిరెద్దుల వాళ్లు వచ్చినట్లు బీజేపీ నేతలు రోజుకొకరు తెలంగాణలో తిరుగుతున్నారని గిరిజన, స్త్రీ-శిశుక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఎద్దేవా చేశారు. రైతు కడుపు మండితే దేశ ప్రధానినే రోడ్డు మీద నిలబెట్టారని, తెలంగాణ రైతు కడుపు మండితే హైదరాబాద్ కు వచ్చిన బీజేపీ నేతలు శంషాబాద్ ఎయిర్ పోర్టు దాటరని హెచ్చరించారు. మేడారం జాతర పనుల పర్యవేక్షణలో భాగంగా సోమవారం మేడారం పిల్ల జాతరలు జరిగే గుంజేడు, పునుగొండ్లను దర్శించి పనులను పర్యవేక్షించారు. గతంలో మేడారం జాతర వచ్చిందంటే ఆరోజు బ్లీచింగ్ పౌడర్ చల్లి, పారిశుద్ధ్యం నిర్వహిస్తే టీఆర్ఎస్ సర్కార్ వచ్చాక అంగరంగ వైభవంగా జాతర నిర్వహిస్తోందన్నారు. గత 70 ఏండ్లలో జాతరకు నాటి పాలకులు రూ.70 కోట్లు కూడా ఖర్చు చేయలేదని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఏడేండ్లలోనే రూ.350 కోట్లు ఖర్చు చేసిందన్నారు.
Also Read: దివ్యాంగ క్రీడాకారిణికి మంత్రి కేటీఆర్ ఆపన్నహస్తం... మల్లికా హందాకు రూ.15 లక్షల ఆర్థికసాయం
పోడు సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం
పోడు రైతులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని కొన్ని రాజకీయ పార్టీల నేతలు కుట్ర చేస్తున్నారని, పోడు సమస్య శాశ్వతంగా పరిష్కరించే బాధ్యత ప్రభుత్వానిదని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. పబ్బం గడుపుకునే రాజకీయ పార్టీల మాటలు నమ్మి మోసపోవద్దని కోరారు. పోడు చట్టం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుందన్నారు. 2005 కన్నా ముందు పోడు చేసుకునే వారికి ఇవ్వాలని చట్టం చెబుతుందని వెల్లడించారు. కానీ 2005లో చట్టం చేసినా.. సీఎం కేసీఆర్ పోడు చేసుకునే వారందరికీ న్యాయం చేసే విధంగా పనిచేస్తున్నారని, ఇందుకు విధివిధానాలు రూపొందిస్తున్నారన్నారు.
రైతులే బండి సంజయ్ కు బుద్ధి చెబుతారు
'రైతుబంధు పథకంతో రైతులకు రూ.50 వేల కోట్లు వారి ఖాతాల్లో వేసిన సందర్భంగా రైతు బంధు సంబరాలు చేయాలనుకున్నాం. కానీ కరోనా, ఒమిక్రాన్ విస్తరిస్తున్న నేపథ్యంలో కోవిడ్ ప్రమాదం దృష్టిలో పెట్టుకుని ఉత్సవాలను మానుకున్నాం. రైతు కోసం సీఎం కేసీఆర్ లక్ష కల్లాలు కట్టించారు. 6600 రైతు వేదికలు నిర్మించారు. లక్షల కోట్లతో సాగునీటి ప్రాజెక్టులు, ఉచిత కరెంట్, రైతుబీమా, రైతు రుణమాఫీ చేస్తున్నారు. కొత్తగూడ మండలానికి ప్రత్యేక డీపీఆర్ తయారు చేసి పాకాల నుంచి ఎత్తిపోతల పథకం తీసుకొచ్చి కొత్తగూడెం, గంగారం మండలాలకు రెండు పంటలకు నీరిచ్చే ప్రయత్నం సీఎం కేసిఆర్ నాయకత్వంలో చేస్తాం. బండి సంజయ్ తెలంగాణ బిడ్డగా ఇక్కడ నుంచి ఎంపీగా ఉంటే కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎందుకు ధాన్యం కొనరు అని చెప్పాల్సింది పోయి...మీరు వరి వేయండి మేం కేసీఆర్ మెడలు వంచుతామని తప్పుడు మాటలు మాట్లాడితే నష్టపోయేది తెలంగాణ రైతులు కాదా? బండి సంజయ్ ఇప్పటికైనా తెలంగాణ రైతులు నష్టపోకుండా ఉండేటట్లు వ్యవహరించాలి. లేకపోతే రైతులే సరైన బుద్ది చెబుతారు.' అని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
Also Read: ఫ్లవరిస్టులు తెలంగాణకు పొలిటికల్ టూరిస్టులు.. బీజేపీ నేతలపై మంత్రి ఎర్రబెల్లి సెటైర్లు