Vikarabad: కలెక్టర్‌పై గ్రామస్థుల దాడి - రేపటి నుంచి ఉద్యోగుల పెన్ డౌన్
Telangana News: వికారాబాద్ కలెక్టర్‌పై దాడి ఘటనను జిల్లా అధికారులు తీవ్రంగా ఖండించారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రేపటి నుంచి పెన్ డౌన్ చేస్తున్నట్లు ప్రకటించారు.
Vikarabad Officials Protest Against Attack On Collector: వికారాబాద్ (Vikarabad) కలెక్టర్, అధికారులపై దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఏకంగా జిల్లా పాలనాధికారిపైనే దాడి చేయడాన్ని జిల్లా అధికారులు, ఉద్యోగులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం కలెక్టర్ ముందు నిరసన తెలిపారు. దాడికి పాల్పడ్డ వారిని వెంటనే అరెస్ట్ చేయాలని.. కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ ఈ ఘటనపై స్పందించాలని ఉద్యోగ సంఘం నాయకులు కోరారు. కలెక్టర్‌పైనే దాడి జరిగితే మా పరిస్థితి ఏంటనే ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనకు నిరసనగా మంగళవారం నుంచి పెన్ డౌన్ చేస్తున్నట్లు ప్రకటించారు. నిందితులను అరెస్టే చేసి శిక్షించే వరకూ నిరసన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
మరోవైపు, కలెక్టర్, అదనపు కలెక్టర్, ఇతర రెవెన్యూ అధికారులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ వి.లచ్చిరెడ్డి తెలిపారు. అధికారులపై దాడికి ఉసిగొల్పిన వారిని, దాడి చేసిన వారిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని డీజీపీ దృష్టికి తీసుకెళ్లి దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరతామన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా తగిన చర్యలు చేపట్టాలని కోరతామన్నారు. అధికారుల వాహనాలను సైతం ధ్వంసం చేశారని.. ఇది హేయమని మండిపడ్డారు. ఇలాంటి దాడులతో ఉద్యోగులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి దోషులను కఠినంగా శిక్షించాలన్నారు.
అసలేం జరిగిందంటే.?
ఫార్మా సంస్థ ఏర్పాటుకు సంబంధించి వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామానికి చెందిన రైతులతో భూ సేకరణ కోసం ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. అయితే, ఫార్మా కంపెనీ ఏర్పాటును అక్కడి రైతులు, గ్రామస్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే దుద్యాల శివారులో సోమవారం ప్రజాభిప్రాయ సేకరణకు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, కొడంగల్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (KUDA) ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, అదనపు కలెక్టర్ లింగానాయక్, సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ వచ్చారు. దుద్యాల శివారులో ప్రజాభిప్రాయ సేకరణకు ఏర్పాట్లు చేయగా.. గ్రామస్థులు, రైతులు మాత్రం అక్కడికి రాకుండా లగచర్లలోనే ఉండిపోయారు.
ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బాధిత రైతుల తరఫున ప్రజాభిప్రాయ సేకరణ వేదిక వద్దకు వెళ్లి కలెక్టర్‌తో మాట్లాడారు. రైతులంతా తమ ఊరిలోనే ఉన్నారని.. అక్కడే ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని కోరారు. దీంతో కలెక్టర్, అధికారులు అంగీకరించి అక్కడికి బయల్దేరి వెళ్లారు. అధికారులు గ్రామానికి చేరుకోగానే రైతులు ఒక్కసారిగా వారి వాహనాలపై రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. అధికారులు వారికి నచ్చచెప్పేందుకు యత్నించినా వారు వినలేదు. కలెక్టర్ డౌన్ డౌన్ నినాదాలతో గ్రామస్థులు మరింత రెచ్చిపోయారు. ఈ క్రమంలో ఓ మహిళా రైతు కలెక్టర్ ప్రతీక్‌జైన్‌పై చేయి చేసుకున్నట్లు తెలుస్తోంది. కడా ప్రత్యేకాధికారి వెంకట్ రెడ్డికి రాళ్లు తగలడంతో గాయాలయ్యాయి. దీంతో ఆయన పొలాల వెంబడి పరిగెత్తి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ క్రమంలో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. జిల్లా కలెక్టర్, అధికారులు లగచర్లకు వెళ్లే సమయంలో ముందు జాగ్రత్తగా బందోబస్తు ఏర్పాట్లు చేయకపోవడంతోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
పోలీస్ బందోబస్తు
ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పోలీసులు గ్రామంలో అదనపు బలగాలను మోహరించారు. కలెక్టర్, ఇతర అధికారులపై దాడి చేసిన గ్రామస్థులు, రైతులను గుర్తించే పనిలో పడ్డారు. పలువురు ఉన్నతాధికారులు గ్రామానికి చేరుకుని శాంతిభద్రతలను పర్యవేక్షించారు. మళ్లీ గొడవలు జరగకుండా అప్రమత్తమయ్యారు.