VijayaShanti : కామారెడ్డిపై కేసీఆర్‌పై పోటీకి విజయశాంతి - ఇందులో నిజం ఎంత ఉందంటే ?
కామారెడ్డిపై కేసీఆర్ పై బీజేపీ అభ్యర్థిగా విజయశాంతిని ప్రకటిస్తారన్న ప్రచారం జరుగుతోంది. పార్టీ నిర్ణయం ఏదైనా పాటిస్తామని విజయశాంతి చెప్పుకొచ్చారు.
VijayaShanti : భారత రాష్ట్ర సమితి చీఫ్, తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ సారి కామారెడ్డి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా అభ్యర్థుల జాబితాలో తన పేరును కూడా ప్రకటించారు. ఆయన కామారెడ్డి నుంచి ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారన్న విషయంపై అనేక రకాల విశ్లేషణలు జరుగుతున్నాయి. అయితే కేసీఆర్ ను రెండు చోట్ల ఓడించాలనుకుంటున్న బీజేపీ .. బలమైన అభ్యర్థిని రంగంలోకి దించాలని అనుకుంటోంది. ఈ క్రమంలో విజయశాంతి పేరు పరిశీలిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. విజయశాంతి అయితే కేసీఆర్ కు గట్టి పోటీ ఇస్తారని భావిస్తున్నారు.
బీజేపీలో, సోషల్ మీడియాలో ఈ అంశంపై విస్తృత చర్చ జరగుతూండటంతో.. విజయశాంతి కూడా స్పందించారు. కామారెడ్డి అసెంబ్లీ పై నా పోటీ విషయం మా పార్టీ నిర్ణయిస్తుందన్నారు. బీజేపీ కార్యకర్తలం ఎవరైనా పార్టీ ఆదేశాలను పాటించడం మాత్రమే మా విధానమని సోషల్ మీడియాలో తెలిపారు. ఏది ఏమైనా కామారెడ్డి, గజ్వేల్ రెండు నియోజకవర్గాలలో బీజేపీ గెలుపు, తెలంగాణ భవిష్యత్తుకు తప్పనిసరి అవసరం అన్నారు.
కామారెడ్డి అసెంబ్లీ పై నా పోటీ విషయం మా పార్టీ నిర్ణయిస్తది.
— VIJAYASHANTHI (@vijayashanthi_m) August 23, 2023
రెండు రోజులుగా పాత్రికేయ మిత్రులు, మీడియాలో వస్తున్న వార్తల ప్రసారాలపై అడుగుతున్న ప్రశ్నలకు నా సమాధానం ఇంతే..
బీజేపీ కార్యకర్తలం ఎవరైనా పార్టీ ఆదేశాలను పాటించడం మాత్రమే మా విధానం...
ఏది ఏమైనా కామారెడ్డి, గజ్వేల్… pic.twitter.com/2TplIvgykR
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ పదోసారి గజ్వేల్ నియోజకవర్గంతో పాటు కామారెడ్డి నియోజకవర్గంలోనూ పోటీచేయనున్నారు. 1983లో మొదటిసారిగా సిద్దిపేట నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. 1985లో సిద్దిపేట నియోజకవర్గం నుంచే పోటీచేసి గెలిపొందగా అప్పటినుంచి కేసీఆర్ ఓటమినే ఎరగలేదు. వరుసగా సిద్దిపేట నియోజకవర్గం నుంచే 1989,1995,1999 ఎన్నికల్లో గెలుపొందారు. 2001లో టీఆర్‌ఎస్ పార్టీని స్థాపించిన తర్వాత రాజీనామా చేసిన ఉప ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచే గెలుపొందారు. 2004 ఎన్నికల్లోను సిద్దిపేట నుంచే గెలుపొందారు. 2006లో కరీంనగర్ ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. 2008లోనూ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో మహబూబ్‌నగర్ ఎంపీగా గెలుపొందారు. 2014లోను గజ్వేల్ నుంచి పోటీ చేసి సీఎం అయ్యారు. 2018లోను అక్కడి నుంచే పోటీ చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నియోజకవర్గంలోను కేసీఆర్ పోటిచేయనున్నారు.
కామారెడ్డిలో బీఆర్ఎస్ తపున గంప గోవర్దన్ వరుసగా విజయం సాధిస్తున్నారు. ఆ పార్టీకి కంచుకోటగా ఉంది. ఈ సారి కేసీఆర్ పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో.. ఆయనపై బలమైన అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకోవాలని బీజేపీ పట్టుదలగా ఉంది. విజయశాంతి .. మొదట బీజేపీలో చేరిన విజయశాంతి ఆ తర్తవాత ల్లి తెలంగాణ పార్టీ పెట్టి ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడారు. తర్వాత తన పార్టీని బీఆర్ఎస్‌లో విలీనం చేశారు. మెదక్ నుంచి ఎంపీగా గెలిచారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి.. మెదక్ అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత బీజేపీలో చేరారు. ఇప్పుడు బీజేపీ తరపున పోటీ చేయాలనుకుంటున్నారు.