Telangana BJP : కేసీఆర్‌పై పోటీ చేసేది ఎవరు ? - విజయశాంతి డిమాండ్ లాంటి విజ్ఞప్తులు
కేసీఆర్‌పై తనకు, బండి సంజయ్‌కు పోటీ చేసే చాన్స్ ఇవ్వాలని విజయశాంతి కోరుతున్నారు. ఈటల తాను పోటీకి రెడీ అంటున్న సమయంలో విజయశాంతి చేసిన వ్యాఖ్యలు హైలెట్ అవుతున్నాయి.
Telangana BJP : తెలంగాణ బిజేపీ తొలి జాబితా విడుదల కావడానికి రంగం సిద్ధమైన సమయంలో విజయశాంతి కొత్త ప్రతి పాదనలను తెర ముందుకు తీసుకు వచ్చారు. విజయశాంతి పేరు పెద్ద ప్రచారంలోకి రావడం లేదు. ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తారన్న దానిపై స్పష్టత లేదు. అయితే కేసీఆర్ పై పోటీకి తన పేరు పరిశీలించాలని ఆమె సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు. అసలు ట్విస్ట్ ఏమిటంటే తనతో పాటు బండి సంజయ్ టిక్కెట్ అంశాన్ని కూడా ప్రస్తావించారు. కేసీఆర్ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారని గజ్వేల్ లో బండి సంజయ్ కు... కామారెడ్డిలో తనకు టిక్కెట్ ఇవ్వాలని ఆమె విజ్ఞాపన. అయితే ఇది తన మాటగా కాకుండా. కార్యకర్తలు అలా కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ తన ఉద్దేశం కాదని.. కానీ వ్యూహాత్మక నిర్ణయాలు పార్టీ తీసుకోవచ్చని ఆమె చెబుతున్నారు.
గజ్వేల్ నుంచి పోటీ చేస్తానంటున్న ఈటల
విజయశాంతి ట్విట్ బీజేపీ వర్గాల్లో కలకలం రేపింది. ఎందుకంటే బండి సంజయ్.. కేసీఆర్ పై పోటీ చేస్తారన్న ప్రచారం ఇంత వరకూ బయటకు రాలేదు. పైగా గజ్వేల్ నుంచి తాను పోటీ చేస్తున్నానని మరో సీనియర్ నేత ఈటల రాజేందర్ పదే పదే ప్రకటిస్తున్నారు. తాను రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నానని హుజూరాబాద్ తో పాటు కేసీఆర్ పైనా గజ్వేల్ లో పోటీ చేస్తానని అంటున్నారు. తననకు చాలా మంది సహకరిస్తున్నారని వారందర్నీ హరీష్ రావు బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈటల రాజేందర్ గజ్వేల్ లో పోటీ చేస్తానని కొంత కాలంగా చెబుతున్నారు. కేసీఆర్ ను ఓడించడమే లక్ష్యమంటున్నారు. అయితే ఇదేమీ పట్టించుకోకుండా బండి సంజయ్ కు గజ్వేల్ టిక్కెట్ కేటాయించాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం ఆసక్తికరంగా మారింది.
పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనని విజయశాంతి
కామారెడ్డిలో కేసీఆర్ పై ఎవర్ని నిలబెట్టాలన్నదానిపైనా బీజేపీ హైకమాండ్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్ర స్థాయి నేతను నిలబెట్టాలనే ాలోచన చేస్తున్నారు. ఈ క్రమంలో విజయశాంతి తన పేరును పరిశీలించాలని చెప్పడం .. బీజేపీ నేతల్ని కూడా ఆశ్చర్య పరుస్తోంది. కేంద్ర పార్టీ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్న విజయశాంతి.. ఇటీవలి కాలంలో పార్టీ తీరుపై అంత సంతృప్తిగా లేరు. పార్టీ కార్యక్రమాల్లోనూ చురుకుగా లేరు.. ఆందోళనల కమిటీ చైర్మన్ గా పదవి ప్రకటించినా పెద్దగా కార్యాచరణ ప్రారంభించలేదు.
విజయశాంతి డిమాండ్ ను హైకమాండ్ పరిశీలిస్తుందా ?
తెలంగాణ బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ప్రస్తుతం విజయశాంతి దూరంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. తనకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదని ఆమె చెప్పుకుంటున్నారు. ఒక వేళ వ్యూహాత్మకంగా హైకమాండ్ టిక్కెట్ కేటాయిస్తే మాత్రం తాను రెడీ అంటున్నారు. ఆమె వరకూ విజ్ఞప్తులు ఓకే కానీ.. బండి సంజయ్ గురించి తాను ట్వీట్ చేయడం ఏమిటన్నది మాత్రం బీజేపీలో కొంత మంది నేతలకు అంతు చిక్కడం లేదు. అదీ కూడా ఈటల రాజేందర్ .. తాను పోటీ చేస్తానన్న నియోజకవర్గం గురించి కావడం మరింత చర్చనీయాంశమవుతోంది.