KTR : మాటలతో రైతుల ఆదాయం రెట్టింపు కాదు - ఫ్యాక్టరీ ప్రారంభంలో మోదీని టార్గెట్ చేసిన కేటీఆర్ !
విజయా డెయిరీ మెగా యూనిట్ ను కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు.
KTR : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని రావిర్యాల వద్ద దేశంలోనే అత్యాధునిక, ఆటోమేషన్ ప్రాసెసింగ్ టెక్నాలజీతో నిర్మించిన విజయ మెగా డెయిరీని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ మెగా డెయిరీని 40 ఎకరాల విస్తీర్ణంలో రూ. 250 కోట్లతో నిర్మించారు. రోజుకు లక్ష లీటర్ల టెట్రా బిక్ పాల ఉత్పత్తి చేసేలా మిషనరీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో పాడి రైతులను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. ప్రసంగంలో ప్రధాని మోదీని ఎక్కువగా టార్గెట్ చేసుకున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ 2014లో రైతుల ఆదాయం డబుల్ చేస్తామన్నారని.. ఇప్పటికి పేదేళ్లు అవుతున్నా రైతుల ఆదాయం డబుల్ కాలేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తప్ప ఇతర రాష్ట్రాల్లో రైతుల కష్టాలు డబుల్ అయ్యాయి. ఇతర రాష్ట్రాల్లో రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరెంట్ ఇవ్వలేని దుస్థితి నెలకొని ఉందని కేటీఆర్ తెలిపారు. మోదీ చెప్పినట్టు రైతుల ఆదాయం డబుల్ అయినా, కాకపోయినా.. తెలంగాణలో మాత్రం కేసీఆర్ నాయకత్వంలో పాడి రైతులకు గానీ, ఇతర రైతులందరికీ న్యాయం జరుగుతుందన్నారు.
తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ తప్పకుండా పరిపుష్టం అవుతోంది. తప్పకుండా గ్రామాల్లో సంపద పెరుగుతుంది. ఆ పెరిగిన సంపదతో తెలంగాణ సస్యశ్యామలంగా ఉంటుందని కేటీఆర్ తెలిపారు. రైతుకు ధీమా ఇచ్చి సరైన ఆలోచన, విధానాలు అమలు చేసినప్పుడే రైతు ఆదాయం డబుల్ అవుతుంది. అందుకే సీఎం కేసీఆర్ పాడిని ప్రోత్సహిస్తున్నారు. పంటను ప్రోత్సహిస్తున్నారు. మినీ డెయిరీలను పెద్ద ఎత్తున ఎంకరేజ్ చేస్తున్నాం అని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో ఐదు విప్లవాలు మీ కళ్ల ముందే ఆవిష్కృతమవుతున్నాయని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
లక్షన్నర లీటర్ల పాలు తీసుకునే విజయ డెయిరీ.. ఇప్పుడు 4 లక్షల లీటర్లకు చేరింది. ఇది 10 లక్షల లీటర్లకు కూడా చేరుకోవచ్చు. మీరు ఆదరిస్తే క్షీర విప్లవం వచ్చే అవకాశం ఉందన్నారు కేటీఆర్. గొర్రెల పంపిణీ కూడా చేపట్టాం. రూ. 11 వేల కోట్లతో యాదవ, కురుమ సోదరులకు గొర్రెలను అందిస్తున్నాం. తద్వారా మాంస ఉత్పత్తి అవుతోంది. అంటే గులాబీ విప్లవం వస్తుంది. దీంతో యాదవ, కురుమ సోదరులకు అదనపు ఆదాయం వచ్చేలా కృషి చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు. ఇచ చివరిది.. ఎల్లో విప్లవం. అదే ఆయిల్ పామ్ రెవల్యూషన్.. 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ పంటను ప్రోత్సహిస్తున్నాం. రైతు ఆదాయం డబుల్ కావాలంటే ఈ ఐదు విప్లవాలు కలిసికట్టుగా నడిస్తే గ్రామీణ ప్రాంతాల్లో రైతు ఆదాయం రెట్టింపు అవుతుందన్నారు.