Rythu Runa Mafi: రైతు రుణమాఫీ ఇంకా పెండింగ్ కు కారణం చెప్పిన మంత్రి ఉత్తమ్, త్వరలో వారికి సైతం
Telangana Crop Loan Waiver | తెలంగాణలో సాంకేతిక కారణాలతో కొందరు రైతులకు రుణమాఫీ కాలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆధార్ కార్డు నెంబర్ 11 అంకెలు, కొందరు 13 అంకెలు నమోదు చేశారు.
Crop Loan Waiver In Telangana| హైదరాబాద్: తెలంగాణలో వివాదాస్పదంగా మారిన అంశం రైతుల రుణమాఫీ. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తాము రైతులందరికీ రుణమాఫీ చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. అయితే దాదాపు సగం మంది రైతులకు రుణమాఫీ జరగలేదని, అన్నదాతల కోసం ప్రశ్నిస్తే తమపై కేసులు నమోదు చేస్తారా అని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. మొత్తం మూడు విడతల్లో తెలంగాణలో రైతులకు రూ.2 లక్షల వరకు ప్రభుత్వం రుణమాఫీ చేసింది. అయితే కొందరు రైతులకు రుణమాఫీ జరగకపోవడానికి కారణాలు ఏంటని, కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనమే కారణమని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు.
ఆధార్ కార్డులో నెంబర్లు తప్పుగా నమోదు చేశారు
లక్షలాది రైతులకు రుణమాఫీ జరగకపోవడానికి గల కారణాలపై ఇదివరకే పలువురు మంత్రులు మాట్లాడారు. తాజాగా మంత్రి ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ.. సాంకేతిక కారణాల వల్ల కొందరు రైతులకు రుణమాఫీ జరగలేదని చెప్పారు. లక్షా 20 వేల రైతుల ఖాతాల్లో ఆధార్ నంబర్ 12 అంకెలు ఉండాలి, కానీ కొందరికి 11 మరికొందరికి 13 నెంబర్లు ఉన్నట్లు మెన్షన్ చేశారు. దానివల్ల అర్హులైనప్పటికీ రైతులందరికీ పూర్తిగా రుణమాఫీ చేయలేకపోయాం అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కొన్ని ఆధార్ కార్డ్ నెంబర్ నమోదులో తప్పులు దొర్లాయని, మరికొందరు రైతులకు బ్యాంకు ఖాతాలు ఆధార్ కార్డులను లింక్ చేయకపోవడం ఓ కారణం. ఆ వివరాలను సవరించి అర్హులైన అన్నదాతలకు రుణమాఫీ చేస్తామన్నారు. అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల వరకు ఉన్న రుణాలను తమ ప్రభుత్వం మాఫీ చేసి తీరుతుందని స్పష్టం చేశారు.
ఆధార్ నంబర్ 12 ఉండాలి.. కానీ కొందరికి 11 మరికొందరికి 13 నంబర్లు ఉన్నాయి అందుకే పూర్తిగా రుణమాఫీ చేయలేకపోయాము - మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి https://t.co/bFPXu0O6fB pic.twitter.com/Qm1QhUoZ6B
— Telugu Scribe (@TeluguScribe) August 19, 2024
రుణమాఫీ మొత్తం చేయలేకపోయం అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. మిగిలిన రైతుల ఖాతాల్లోనూ రూ. 12 వేల కోట్ల రూపాయలు త్వరలోనే జమ చేస్తామని తెలిపారు.
వివరాలు సరిగ్గా ఉన్న రైతులకు రుణమాఫీ పూర్తి చేశాం
తెలంగాణలో అర్హులైన రైతులకు రూ.2 లక్షల లోపు పంట రుణాలన్నీ మాఫీ చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా 22,37,848 (22 లక్షల 37 వేల 8 వందల 48) రైతులకు రూ.17 వేల 9 వందల 33 కోట్ల నిధులు విడుదల చేసినట్లు వెల్లడించారు. మొత్తం మూడు విడతల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసిందని, వివరాలు సరిగ్గా లేని రైతులకు రుణమాఫీ జరగలేదని క్లారిటీ ఇచ్చారు. దేశంలో ఇంత పెద్ద మొత్తంలో రైతులకు రుణమాఫీ జరిగిన రాష్ట్రం తెలంగాణ అన్నారు. రుణమాఫీ కాని రైతులు ఆందోళన చెందవద్దని, ఆ రైతుల వివరాలు బ్యాంకు ఖాతా, ఇతర వివరాలు, పోర్టల్ లో అప్ లోడ్ చేయాలని వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు.