Occult Worship: ఓ చోట చెట్టుకు చీర కట్టి క్షుద్రపూజలు - మరో చోట సామూహికంగా మేక బలులు, ఎక్కడంటే?
Telangana News: ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని గ్రామంలో చెట్టుకు చీర కట్టి పూజలు చేయడం భయాందోళన కలిగించింది. అటు, మంచిర్యాల జిల్లా కన్నెపల్లి గ్రామస్థులు అమ్మవారికి సామూహికంగా మేకలను బలిచ్చారు.
Occult Worship In Mulugu District: తెలంగాణలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. ఓ చోట చెట్టుకు చీర కట్టి.. రోడ్డుపై ముగ్గేసి.. చుట్టూ రక్తం చల్లినట్లు ఆనవాళ్లు కనిపించగా.. మరో చోట ఊరిలో చీడ గాలి పోవాలని సామూహికంగా మేకలను బలిచ్చారు. దీంతో ఆ ఊరంతా ఎటు చేసిన రక్తపాతమే కనిపిస్తోంది. స్థానికులు తెలిపిన పూర్తి వివరాల ప్రకారం.. ములుగు జిల్లా (Mulugu District) వెంకటాపురం మండలంలోని బెస్తగూడెం గ్రామ సమీపంలో అర్ధరాత్రి క్షుద్రపూజలు భయాందోళన కలిగించాయి. గ్రామంలోకి వెళ్లే దారిలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మూల మలుపు వద్ద ఉన్న ఓ చెట్టుకి చీర కట్టి, ఎదురుగా ముగ్గు వేసి.. దాని చుట్టూ రక్తపు మరకలను వేశారు. ఘటనా స్థలంలోనే కుంకుమ, పసుపు, నిమ్మకాయలను పేర్చి కోడిని కోసి వదిలిపెట్టిన ఆనవాళ్లను స్థానికులు గుర్తించారు. గ్రామంలోకి రావాలన్నా అదే దారిలో రావాలని.. చిన్నారులు కూడా అలానే వస్తారని.. వారికి ఏదైనా జరిగితే ఏంటి పరిస్థితి అంటూ ఆందోళన చెందుతున్నారు. క్షుద్రపూజలు చేసినట్లు స్పష్టంగా కనిపిస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరచూ ఇదే ప్రదేశంలో ఇలాంటి పూజలు చేస్తున్నారని.. వీటిపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఆ ఊరంతా రక్తపాతమే
అటు, మంచిర్యాల జిల్లా (Mancherial District) దండేపల్లి మండలం కన్నెపల్లి గ్రామంలో మరో ఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని ప్రతీ ఇంట్లో ఒకరు చొప్పున మంచం పట్టడంతో ఊరికి ఏదో అరిష్టం పట్టిందని గ్రామస్థులు భావించారు. ఊరికి ఏదో గాలి సోకిందని.. గ్రామం బాగుండాలంటే పోచమ్మ శాంతి పూజలు చేయాలని గ్రామపెద్దలు నిర్ణయించారు. ఊరిలోని ప్రజలంతా విష జ్వరాల బారిన పడి మంచం పట్టడంతో పీడ పట్టుకుందని.. అది పోవాలంటే గ్రామ దేవతకు శాంతి పూజలు చేయాలని తలచారు. అనుకున్నదే తడవుగా ఊరు ఊరంతా ఏకమై ఒకేసారి గ్రామంలో మేకలను బలులు ఇచ్చారు. దీంతో గ్రామమంతా రక్తమయమైంది.
వర్షాకాలం ప్రారంభంలో వాడ పోచమ్మకు ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీగా వస్తున్నా.. ఊరంతా కలిసి ఒకేసారి బలి పూజలు చేయడం ఇదే తొలిసారని గ్రామపెద్దలు తెలిపారు. పండుగ వాతావరణంలో ఇలా మొక్కులు చెల్లించుకుంటే గ్రామానికి పట్టిన చీడ తొలగిపోతుందని.. అంతా ఆయురారోగ్యాలతో ఉంటారని గ్రామస్థులు తెలిపారు.
Also Read: Durgam Cheruvu : సీఎం రేవంత్ సోదరుడి ఇల్లు ఇప్పటికైతే సేఫ్ - కూల్చివేతలపై స్టే ఇచ్చిన హైకోర్టు