Kishan Reddy on Modi Telangana Tour: ప్రధాని మోదీ తెలంగాణకు వస్తే కేసీఆర్ కు జ్వరం వస్తుంది - కిషన్రెడ్డి ఎద్దేవా
Kishan Reddy About PM Modi Telangana Tour: ప్రధాని మోదీ తెలంగాణకు వచ్చినప్పుడల్లా, మంత్రి కేసీఆర్కు జ్వరం వస్తుందని కిషన్రెడ్డి ఎద్దేవా చేశారు. దమ్ముంటే చర్చలకు రావాలని సవాల్ విసిరారు.
Kishan Reddy About PM Modi Telangana Tour:
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ దాదాపు 10 రోజుల నుంచి వైరల్ ఫీవర్ తో బాధ పడుతున్నారు. ఆయనకు జ్వరం తగ్గకపోవడంతో రాష్ట్ర కేబినెట్ భేటీ సైతం వాయిదా పడింది. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నాయి బీజేపీ శ్రేణులు. అయితే ప్రధాని మోదీ తెలంగాణకు వచ్చినప్పుడల్లా, మంత్రి కేసీఆర్కు జ్వరం వస్తుందని కిషన్రెడ్డి ఎద్దేవా చేశారు. కేంద్రం నుంచి బీజేపీ అగ్రనేతలు రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా వారిపై బురదజల్లే ప్రయత్నం తప్పా బీఆర్ఎస్ నేతలు చేసేది ఏమీ లేదన్నారు.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసింది, ఎన్ని నిధులు ఇచ్చింది? బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఏం చేసిందో చర్చకు సిద్ధమా అని సీఎం కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. వారి రాష్ట్రానికి ప్రధాని వస్తే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్వయంగా ఎయిర్ పోర్టుకు వెళ్లి స్వాగతం పలుకుతారని గుర్తుచేశారు. సీపీఎం సీఎం సైతం ప్రధాని మోదీకి స్వాగతం పలికారని, కేసీఆర్ మాత్రం అందుకు భిన్నంగా జ్వరం అని సాకులు చెబుతున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ కు దమ్ముంటే అమరవీరుల స్థూపం వద్ద రాష్ట్రానికి చేసిన ప్రయోజనంపై, కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. రాష్ట్రానికి సీఎంగా ఉండే అర్హత కేసీఆర్ కు లేదన్నారు. ఉద్దేశపూర్వకంగా బీజేపీని ఇరకాటంలో పెట్టాలని బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తన పనితీరుకు ప్రజలు సర్టిఫికెట్ ఇస్తారని, కేటీఆర్ సర్టిఫికెట్ ఎవరికి అక్కరలేదన్నారు.
అక్టోబర్ 1, 3 తేదీల్లో ప్రధాని మోదీ రాబోతున్నారని కిషన్రెడ్డి తెలిపారు. రెండ్రోజుల తెలంగాణ పర్యటలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ అక్టోబర్ 1న జరిగే మహబూబ్‌నగర్ పర్యటనలో భాగంగా రూ.13,500 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఇప్పటికే పూర్తయిన ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. 3న నిజామాబాద్ లో జరగనున్న మీటింగ్ కు హాజరుకానున్నారు.
మునీరాబాద్- మహబూబ్ నగర్ ప్రాజెక్టులో భాగంగా జక్లేర్ నుండి కృష్ణా వరకు కొత్తగా నిర్మించిన రూ.505 కోట్ల విలువైన రైల్వే లైనును ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. దీంతో హైదరాబాద్ - గోవాల మధ్య దూరం 102 కిలోమీటర్ల వరకు తగ్గుతుందని తెలిపారు. కాచిగూడ- రాయచూరు మధ్య డెము సర్వీసును కూడా మోదీ ప్రారంభిస్తారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రతిసారి ప్రధాని మోదీ జాతీయ రహదారుల నిర్మాణాలు ప్రారంభిస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. హీరా అనే విధానంతో రాష్ట్రంలో రూ.1.2 లక్షల కోట్లతో జాతీయ రహదారుల నిర్మాణం జరిగిందన్నారు. యుద్ధప్రాతిపదికన జాతీయ రహదారులను అనుసంధానం చేయాలని కేంద్రం భావిస్తోంది.
పాలమూరు కేంద్రంగా రూ.13,545 కోట్ల అభివృద్ధి పనులను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. ఇందులో భాగంగా రూ.6,404 కోట్లతో చేపట్టే కొత్త జాతీయ రహదారుల ప్రాజెక్టులు ఉన్నాయి. మహబూబ్‌నగర్‌లో హెచ్‌పీసీఎల్ గ్యాస్ పైపులైన్‌ను సైతం మోదీ జాతికి అంకితం చేయనున్నారు. హసన్- చర్లపల్లి మధ్య రూ.2661 కోట్ల వ్యయంతో హెచ్‌పీసీఎల్ గ్యాస్ పైపులైన్ నిర్మాణం చేయనున్నారు.