Indian Railways: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్, రూ.3,238 కోట్లతో రైల్వే పనులు
Indian Railways: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రైల్వే లైన్ల విస్తరణ పనులకు సంబంధించి కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది.
Indian Railways: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రైల్వే లైన్ల విస్తరణ పనులకు సంబంధించి కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సమావేశం వివరాలను మీడియాకు వివరించారు. తొమ్మిది రాష్ట్రాల్లో ఏడు మల్టీ-ట్రాకింగ్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది.
ఇందులో తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. గుంటూరు-బీబీనగర్ మార్గం డబ్లింగ్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది. దాదాపు రూ.3,238.38 కోట్ల అంచనా వ్యయంతో 272.69 కి.మీల మేర డబ్లింగ్ పనులు చేపట్టాలని నిర్ణయించింది. ఇది పూర్తయితే ఇక హైదరాబాద్ - చెన్నై మధ్య 76 కిలో మీటర్ల దూరం తగ్గనుంది. అలాగే, రూ.5,655.4 కోట్ల అంచనా వ్యయంతో మేడ్చల్-ముద్ఖేడ్, డోన్-మహబూబ్ నగర్ మధ్య డబ్లింగ్‌కు ఆమోదం లభించింది. డోన్-మహబూబ్ నగర్ మధ్య డబ్లింగ్ ద్వారా హైదరాబాద్ - బెంగళూరు మధ్య 50 కిలోమీటర్ల దూరం తగ్గనుంది.
రైళ్ల రద్దీ, ప్రయాణ సమయం తగ్గిస్తూ, బొగ్గు, సిమెంట్ రవాణా సామర్థ్యాన్ని పెంచేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. నెర్గుండి- బారాంగ్, కుర్దా రోడ్ - విజయనగరం మధ్య రూ.5,618.26 కోట్ల అంచనా వ్యయంతో మూడో లైన్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఇప్పటికే విశాఖపట్నం - చెన్నై మధ్య మూడో రైల్వే లైన్ డీపీఆర్ సిద్దం కాగా.. మూడు వేల కోట్ల ఖర్చుతో నిర్మాణ పనులు జరగనున్నాయి.
దేశంలో రైల్వే లైన్ల విస్తరణ, రైళ్ల రాకపోకలను క్రమబద్ధీకరించడం, రద్దీని తగ్గించడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నట్టు కేంద్రం తెలిపింది. ఇందుకోసం మొత్తం రూ.32,500 కోట్లు అంచనా వ్యయం వేశారు. ఉత్తరప్రదేశ్, బిహార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని 35 జిల్లాల పరిధిలో ప్రస్తుతమున్న రైల్వే నెట్‌వర్క్‌లను విస్తరించనున్నారు.
ఏడు మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులు
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కేబినెట్ వివరాలను వెల్లడిస్తూ... ఈ ప్రాజెక్టులు భారతీయ రైల్వే సమర్థత, సామర్థ్యాన్ని విస్తరిస్తాయన్నారు. భారతీయ రైల్వేల ఆధునీకరణకు ఈ ప్రాజెక్టులు దోహదం చేస్తాయన్నారు. ఈ ప్రాజెక్ట్‌ల మొత్తం పరిధి ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్ (EPC) మోడల్‌ను అనుసరిస్తుందన్నారు. ప్రస్తుతం ఉన్న రైలు నెట్‌వర్క్‌కు అదనంగా 2,339 కిలోమీటర్లను కొత్త ప్రాజెక్టులు జోడిస్తాయన్నారు. ఈ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టుల ద్వారా కనెక్టివిటీ, యాక్సెస్‌బిలిటీని గణనీయంగా పెరుగుతుందని రైల్వే మంత్రి తెలిపారు.
పీఎం ఈ-బస్ సేవా పథకానికి ఆమోదం
‘పీఎం ఈ - బస్ సేవ’ పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మొత్తం 169 నగరాల్లో కేంద్రం 10వేల ఈ - బస్‌లు ప్రవేశ పెట్టనుంది. అలాగే.. 181 నగరాల్లో గ్రీన్ ఈ-మొబిలిటి కోసం మౌలిక సదుపాయాలు పెంచాలని నిర్ణయించింది. చేతివృత్తుల వారికి రూ.13వేల కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా పీఎం విశ్వ కర్మ నూతన పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial