(Source: ECI/ABP News/ABP Majha)
Republic Day Celebrations Tragedy: గణతంత్ర వేడుకల్లో విషాదం - విద్యుత్ షాక్ తో ఇద్దరు యువకులు మృతి
Mulugu News: గణతంత్ర దినోత్సవ వేడుకల వేళ ములుగు జిల్లాలో విషాదం జరిగింది. జాతీయ జెండా ఆవిష్కరణకు ఏర్పాట్లు చేస్తుండగా విద్యుత్ షాక్ తో ఇద్దరు యువకులు మృతి చెందారు.
Two Youngmen Died Due to Electric Shock: రిపబ్లిక్ డే వేడుకల వేళ ములుగు (Mulugu) జిల్లా కేంద్రంలో శుక్రవారం విషాదం జరిగింది. స్థానిక ఎస్సీ కాలనీలో జాతీయ జెండా ఆవిష్కరణకు ఏర్పాట్లు చేస్తుండగా.. ముగ్గురు యువకులు విద్యుదాఘాతానికి గురయ్యారు. గద్దెపై ఐరన్ పోల్ పెడుతుండగా.. అది కాస్త పైనున్న విద్యుత్ వైర్లను తాకింది. దీంతో ల్యాడ విజయ్, అంజిత్, చక్రిలు కరెంట్ షాక్ తో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వీరిని గమనించిన స్థానికులు వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ విజయ్, అంజిత్ లు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరికీ సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. మరో యువకుడు చక్రి.. స్వల్ప గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం అలుముకుంది. ఆస్పత్రి వద్ద మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. విషయం తెలుసుకున్న మంత్రి సీతక్క (Minister Seethakka) ఆస్పత్రికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. తక్షణ సాయంగా ఇరు కుటుంబాలకు రూ.10 వేల ఆర్థిక సాయం ప్రకటించారు. విద్యుత్ శాఖ తరఫున బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా అందిస్తామని హామీ ఇచ్చారు. గాయపడి చికిత్స పొందుతున్న మరో యువకునికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. గ్రామాల్లో, పొలాల్లో ఎక్కడైనా ప్రమాదకరంగా విద్యుత్ వైర్లు వేలాడుతుంటే విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. గణతంత్ర వేడుకల వేళ ఇలా జరగడం బాధాకరమని, బాధిత కుటుంబాలకు పరిహారం అందిస్తామని అన్నారు.
Also Read: Mahmood Ali: గణతంత్ర వేడుకల్లో స్పృహ కోల్పోయిన మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ