TSRTC Special Offer: టీఎస్ఆర్టీసీ ఫెస్టివల్ ఆఫర్లు - సంక్రాంతి ఇంటికి వెళ్లే వారికి 10 శాతం రాయితీ
TSRTC Special Offer: సంక్రాంతి పండుగకు ఇళ్లకు వెళ్లే వారి కోసం టీఎస్ఆర్టీసీ స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. ఒకేసారి టికెట్లు బుకింగ్ చేసుకుంటే, తిరుగు ప్రయాణంపై 10% రాయితీని కల్పించింది.
TSRTC Special Offer: సంక్రాంతికి సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది. రానుపోనూ ఒకేసారి టికెట్లు బుక్ చేస్కుంటే తిరుగు ప్రయాణంపై 10 శాతం రాయితీ కల్పిస్తున్న తెలిపింది. డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ ప్లస్ బస్సుల్లో అడ్వాన్స్ రిజర్వేషన్ బుకింగ్ కి ఈ రాయితీ వర్తిస్తుందని... వచ్చే జనవరి 31 వరకు ఈ రాయితీ అమల్లో ఉంటుందని వెల్లడించింది. సంక్రాంతి సందర్భంగా ప్రయాణికులపై ఆర్థిక భారం తగ్గించేందుకు 10 శాతం రాయితీని ప్రకటించాలని నిర్ణయించినట్లు టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, సంస్థ ఎండీ సజ్జనాల్ తెలిపారు. ముందస్తు రిజర్వేషన్ కోసం WWW.TSRTCONLINE.IN అధికారిక వెబ్ సైట్ ను సందర్శించవచ్చని స్పష్టం చేశారు.
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు శుభవార్త. రానుపోనూ ఒకేసారి టికెట్లు బుకింగ్ చేసుకుంటే, తిరుగు ప్రయాణంపై 10% రాయితీని టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. జనవరి 31,2023 వరకు ఈ రాయితీ అమల్లో ఉంటుంది. ముందస్తు రిజర్వేషన్ కోసం https://t.co/F0naRXIa8A ని సంప్రదించండి.
— Managing Director - TSRTC (@tsrtcmdoffice) December 26, 2022
సంక్రాంతి పర్వదినం సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రజల కోసం టీఎస్ఆర్టీసీ (TSRTC) ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు 4,233 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది జనవరి 7 నుంచి 15వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులను తెలంగాణ ఆర్టీసీ నడపనుంది. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ (TSRTC) ట్వీట్ చేసింది. మొత్తం 4,233 స్పెషల్ బస్సు సర్వీసుల్లో 585 బస్సులకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని నిర్ణయించినట్లుగా ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. తెలంగాణలోని వివిధ పట్టణాలకే కాకుండా ఏపీలో డిమాండ్ ఉన్న ప్రాంతాలకు కూడా ఈ బస్సులు నడుస్తాయని చెప్పారు. హైదరాబాద్ బస్ భవన్ నుంచి శుక్రవారం (డిసెంబర్ 9) ఆయన తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ గతేడాది సంక్రాంతికి 3,736 ప్రత్యేక బస్సులు నడిపామని అన్నారు. ఈసారి వాటికి అదనంగా పది శాతం బస్సులను పెంచామని చెప్పారు.
‘‘జనవరి 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురానికి 125, కాకినాడకు 117, కందుకూరు 83, విశాఖపట్నం 65, పోలవరం 51, రాజమండ్రికి 40 చొప్పున స్పెషల్ బస్సులు నడుపుతాం. వీటితోపాటు తెలంగాణలోని అన్ని ప్రధాన నగరాలు, పట్టణాలకు కూడా ఈ స్పెషల్ బస్సులు తిరగనున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం 60 రోజుల ముందుగానే టికెట్ రిజర్వేషన్ సదుపాయం కల్పించారు. గతంలో 30 రోజుల ముందు వరకూ మాత్రమే ఈ సౌకర్యం ఉండేది. వచ్చే ఏడాది జూన్ నెలాఖరు వరకు ఈ రిజర్వేషన్ సదుపాయం అందుబాటులో ఉంటుందని వీసీ సజ్జనార్ చెప్పారు.