TSRTC: ఈ ఊరికి 26 ఏళ్ల తర్వాత బస్సొచ్చింది..! ఎంత పెద్ద పండగ చేశారో.. జిల్లా ఎస్పీ కూడా..
దాదాపు 26 సంవత్సరాల నుండి బస్సు సౌకర్యం కోసం ఎదురుచూస్తున్న ఆసిఫాబాద్ జిల్లా మంగి గ్రామ ప్రజల కల నేటితో తీరినట్లయింది. తమ ఊరికి వచ్చిన బస్సుకు పూల దండలు వేసి, పూజ చేసి గ్రామస్థులు పండగ చేసుకున్నారు.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఓ ఊరికి 26 ఏళ్ల తర్వాత ఆర్టీసీ బస్సు వచ్చింది. దీంతో గ్రామస్థుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తమ ఊరికి వచ్చిన బస్సుకు పూల దండలు వేసి, పూజ చేసి గ్రామస్థులు పండగ చేసుకున్నారు. దాదాపు 26 సంవత్సరాల నుండి బస్సు సౌకర్యం కోసం ఎదురుచూస్తున్న ఆసిఫాబాద్ జిల్లా మంగి గ్రామ ప్రజల కల నేటితో తీరినట్లయింది. ఆసిఫాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో దాదాపు నాలుగు వందల ట్రాక్టర్ ట్రిప్‌ల మొరంతో పాత రోడ్డుకు మరమ్మతులు చేశారు. తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సహకారంతో బస్సు సర్వీసును ప్రారంభించి మంగి ప్రజల కలను సాకారం చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు.
ఆసిఫాబాద్ జిల్లా మంగి గ్రామం దాదాపుగా 30 ఆదివాసి గూడేలకు సమీప గ్రామం. నిత్యం చదువు, వైద్యం, పౌర సరఫరాలు, వ్యాపారాలు, ప్రభుత్వ ఉద్యోగుల రాకపోకలు, ఎమర్జెన్సీ సర్వీసుల కోసం అత్యంత క్లిష్ట రోడ్లపై దాదాపు 80 కిలో మీటర్ల దూరంలో ఉన్న జిల్లా కేంద్రానికి ఈ గ్రామస్థులు చేరుకునేవారు. ఇది గతంలో తీవ్రమైన మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కాగా.. నేడు తెలంగాణ ఆర్టీసీ, పోలీసుల చొరవతో ఈ బస్సు సౌకర్యం కలగడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: అక్కాచెల్లెళ్లపై ఐదేళ్లుగా అత్యాచారం.. మాస్టర్ ప్లాన్ వేసిన భూత వైద్యుడు, అతని కొడుకుతో కూడా..
ముఖ్య అతిథిగా ఎస్పీ
ఈ ఆర్టీసీ బస్సు ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొమురం భీం జిల్లా ఎస్పీ అడ్మిన్ వై.వి.ఎస్ సుధీంద్ర పాల్గొని కొమురం భీం విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం జెండా ఊపి మంగి గ్రామంలో బస్సు సర్వీస్ ప్రారంభించారు. తర్వాత ప్రయాణికులతో పాటుగా ప్రయాణించారు. ఈ కార్యక్రమానికి తమ వంతు తోడ్పాటు అందించిన తిర్యాణి ట్రాక్టర్ సంఘం సభ్యులను సన్మానించారు. ఇలాంటి సేవా కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు కృషి చేసిన తిర్యాణి ఎస్సై రామారావును అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని సురక్షితంగా గమ్యం చేరుకోవాలని, ప్రైవేటు వాహనాలలో పరిమితికి మించి ప్రయాణించ వద్దని, తక్కువ చార్జీలకే సురక్షితమైన ప్రయాణం చేయాలని కోరారు. చేతబడి, మూఢ నమ్మకాలు, సంఘ విద్రోహ శక్తులకు తావు ఇవ్వకూడదఅని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటుగా డీఎస్పీ ఆర్.శ్రీనివాస్, సీఐ రెబ్బెన సతీష్ కుమార్, తిర్యాణి ఎస్సై రామారావు, ఆసిఫాబాద్ జిల్లా డిపో మేనేజర్, గ్రామ పటేల్ గుణవంత రావు, స్థానిక మంగి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Also Read: TSRTC: కిన్నెర మొగులయ్యకు ఎండీ సజ్జనార్ బంపర్ ఆఫర్.. ఎందుకంటే..
Also Read: Tomato Farmers : ఆ రైతు పంట పండించిన టమాటా .. ఒక్క సీజన్‌లో రూ. 80 లక్షలు !