ఐదు లక్షలిస్తే డబుల్ బెడ్రూం ఇళ్ల పట్టా !
మహబూబ్ నగర్ లో ఐదు లక్షల రూపాయలిస్తే చాలు రెండు పడక గదుల ఇళ్లు సొంతమంటూ అందుకు అవసరమైన పట్టా అందిస్తామంటూ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
Double Bedroom Scheme: మహబూబ్ నగర్ లో రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపుల వ్యవహారంపై రోజుకో వివాదం తెరపైకి వస్తోంది. ఐదు లక్షల రూపాయలిస్తే చాలు రెండు పడక గదలు ఇళ్లు సొంతమని అందుకు అవసరమైన పట్టా అందిస్తామంటూ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. జిల్లాకు చెందిన ప్రముఖ ప్రజాప్రతినిధి వ్యక్తిగత కార్యదర్శి కుమారుడు మాట్లాడినట్లుగా చెబుతున్న ఆ సంభాషణలు మహబూబ్ నగర్ లో దుమారం సృష్టించాయి. అయితే అక్రమ బాగోతం వెనుక పెద్ద ముఠా ఉన్నట్లుగా ప్రచారం సాగడంతో.. విచారణ చేపట్టిన పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 13 లక్షల 60 వేలు, 40 నకిలీ పట్టాలు, ప్రింటర్లు స్వాధీనం చేసుకున్నారు.
నకిలీ పట్టాలతో లబ్ధి పొందినట్లు సమాచారం..
దివిటిపల్లి సమీపంలోని నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లలో పలువురు నకిలీ పట్టాలతో లబ్ధి పొందినట్లు సమాచారంతో రెవెన్యూ, పోలీసు యంత్రాంగం క్షేత్ర స్థాయిలో పరిశీలించింది. తహశీల్దార్ కార్యాలయం నుంచి జారీ చేసిన పట్టాలను అక్కడ ఇళ్లలో నివసిస్తున్న వారి పట్టాలను క్షుణ్ణంగా పరిశీలించగా... 36 పత్రాలు నకిలీవి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రధాన నిందితుడైన హాసన్ తోపాటు అతనికి సహకరిస్తున్న మరో ఐదుగురు అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. 36 మంది బాధితుల నుంచి 67 లక్షల 37 వేలు వసూలు చేశారని చెప్పారు.
తాజా పరిణామాలతో అర్హుల ఇబ్బందులు..
ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకొని అధికారుల చుట్టూ తిరుగుతున్న అర్హులైన లబ్ధిదారుల తాజా పరిణామాలతో ఆందోళన చెందుతున్నారు. దివిటిపల్లిలో 1024, వీరన్నపేటలో 660 ఇళ్లు ప్రారంభించి వాటిని ఎవరికి ఇచ్చారు. ఎంత మందికి కేటాయించారన్నవిషయాలు తేలట్లేదు. సర్వే నెబర్ 523లో గతంలో ఇంటి స్థలం పొందిన వాళ్లు.. డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం రెవెన్యూ అధికారులకు తిరిగి ఇచ్చారు. ఇంటిస్థలం పట్టా తిరిగొచ్చిన అసలైన లబ్ధిదారులను వదిలి.. దొంగపట్టాలు సమర్పించిన వారికి ఇళ్లు కేటాయించినట్లుగా ప్రచారం సాగుతోంది. ఏళ్లుగా అద్దె ఇళ్లలో నెట్టుకొస్తున్న లబ్ధిదారులు తమ పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేశారు.
రెండు పడక గదుల ఇళ్లకు సంబంధించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు. అందులో ఎంతటి వారున్నా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.