MLA's Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ ప్రశ్నలకు బోరుమన్న న్యాయవాది ప్రతాప్!
MLA's Poaching Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో 41ఏ సీఆర్పీసీ నోటీసులు అందుకున్న న్యాయవాది ప్రతాప్ గౌడ్, నందకుమార్ భార్య చిత్ర లేఖలు విచారణాధికారి ఎదుట హాజరయ్యారు.
MLA's Poaching Case: మోయినాబాద్ ఫాం హౌస్ వ్యవహారంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో దర్యాప్తు బృందం విచారణను ముమ్మరం చేసింది. శుక్రవారం విచారణకు హాజరు కావాలని 41ఏ సీఆర్పీసీ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే అంబర్ పేటకు చెందిన న్యాయవాది పోగులకొండ ప్రతాప్ గౌడ్, నందకుమార్ భార్య చిత్ర లేఖలు విచారణాధికారి ఎదుట హాజరు అయ్యారు. మూడు బృందాలుగా ఏర్పడిన సిట్ అధికారులు, వేర్వేరు గదుల్లో 8 గంటలకు పైగా వారిని విచారించనున్నారు. నిందితుడు నందు, ఆయన భార్య చిత్రలేఖ, ప్రతాప్ గౌడ్ కు మధ్య పలు ఫోన్ సందేశాలు, వాట్సాప్ చాటింగ్, కాల్ రికార్డులను గుర్తించిన పోలీసులు... వాటిపై ప్రతాప్ ను ప్రశ్నించినట్లు తెలిసింది. తొలుత తాను ఎవరితోనూ సంభాషించ లేదని, మెసేజ్ లు చేయలేదని పోలీసులతో వాదించినట్లు సమాచారం.
ఒకరు ఏడుస్తూ, మరొకరు వింతగా..!
అయితే ఇందుకు సంబంధించిన ఆధారాలను పోలీసులు ఆయన ముందు ఉంచి ప్రశ్నించగా... సమాధానం చెప్పకుండా ప్రతాప్ బోరున విలపించినట్లు తెలిసింది. నందుతో పరిచయం, ఇతరత్రా సంబంధాలపై ఆరా తీయగా... జవాబు చెప్పకుండా దాట వేశారు. సాయంత్రం వరకు ప్రతాప్ ను విచారించినా లాభం లేకపోవడంతో శనివారం కూడా విచారణకు హాజరు కావాలని దర్యాప్తు అధికారి ఆయనను ఆదేశించారు. అలాగే నందు భార్య చిత్ర లేఖను విచారించిన సిట్ అధికారులకు వింత అనుభవం ఎదురైంది. స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్ లో ఆమెకు, ప్రతాప్ గౌడ్, నందుకు మధ్య పలు కాల్స్, వాట్సాప్ సందేశాలు బయట పడ్డాయి. ఆయా మేసేజ్ లలో ఏ సమాచారం ఉందని, ఎందుకు చేశారని చిత్రలేఖను ప్రశ్నించగా.. తెలియదు, గుర్తులేదు, నాకు రాలేదని వింత సమాధానాలు చెప్పినట్లు సమాచారం.
ఆమె కంపెనీ గురించి ధైర్యంగా సమాధానాలు..
నందుకు చెందిన డెక్కన్ కిచెన్, నివాసంలోని సీసీ రికార్డుల్లో నమోదైన పలువురు ఫొటోలను చూపించి వారు ఎవరు, ఎందుకు వచ్చారని ఆమెను ప్రశ్నించగా.. సమాధానం చెప్పకుండా దాటవేసినట్లు తెలిసింది. అయితే ఆమె డైరెక్టర్ గా ఉన్న కంపెనీ కార్యకలాపాలు, లావాదేవీల గురంచి ప్రశ్నించగా ధైర్యంగా సమాధానాలు ఇచ్చిన చిత్రలేఖ... ఈ కేసుకు సంబంధించి అడిగిన ప్రశ్నలకు మాత్రం సమాధానం ఇవ్వకపోవడంతో ఉద్దేశ పూర్వకంగానే ఆమె అలా వ్యవహరించారని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం తిరిగి విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించారు.
హాజరైతే అరెస్ట్ చేస్తారేమోననే భయంతో శ్రీనివాస్ గైర్హాజరు..
శుక్రవారం సిట్ విచారణకు హాజరు కావాలని శ్రీనివాస్ ను హైకోర్టు ఆదేశించినా ఆయన గైర్హాజరు అయ్యారు. కరీంనగర్ న్యాయవాధి శ్రీనివాస్ ను ఈ కేసులో ఏ7గా చేర్చిన సంగతి తెలిసిందే. దీంతో విచారమకు హాజరైతే అరెస్ట్ చేస్తారేమోననే అనుమానంతో ఆయన గైర్హాజరైనట్లు సమాచారం. నందు, సింహయాజీలతో కలిసి శ్రీనివాస్ పలు ప్రాంతాల్లో సంచరించడానికి సంబంధించిన ఆధారాలు, నందుతో రూ.55 లక్షలకు సంబంధించిన లావాదేవీలను పోలీసులు గుర్తించినట్లు తెలిసింది.