TRS-BJP Clashes: టీఆర్ఎస్-బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ.. ఆ వ్యక్తి చేసిన వ్యాఖ్యలే కారణం!
హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ - బీజేపీ శ్రేణులు పరస్పరం ఘర్షణ పడ్డారు. ఒకరినొకరు తోసుకున్నారు. పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద ఈ ఘటన జరిగింది.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. ఏకంగా పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ - బీజేపీ కార్యకర్తలు ఒకరినొకరు తోసుకొని నానా బీభత్సం చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో టీఆర్ఎస్ - బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
అసలేం జరిగిందంటే..
మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ సతీమణి అయిన ఈటల జమున సోదరుడు మధుసూదన్ ఎస్సీలను కించపరిచేలా కొన్ని వ్యాఖ్యలు చేశారంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఇదే విషయంపై రెండు పార్టీల కార్యకర్తలు గొడవకు దిగాయి. అయితే, దాన్ని టీఆర్ఎస్ కార్యకర్తలే సృష్టించారని బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు. ఇలా మొదలైన గొడవ ఒకరినొకరు తోసుకునే వరకూ వెళ్లింది.
తొలుత హుజూరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి ఈటల జమున పాలతో అభిషేకం చేశారు. అదే సమయంలో టీఆర్ఎస్ వర్గీయులు అక్కడకు వచ్చి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అక్కడే ఉన్న బీజేపీ శ్రేణులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. రెండు వర్గాల నినాదాలతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
అనంతరం మరోసారి అంబేద్కర్ చౌరస్తాకు వచ్చిన బీజేపీ శ్రేణులు హుజురాబాద్‌లో పట్టణంలో టీఆర్ఎస్ నాయకులు ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్లెక్సీలను తగలబెట్టేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే నినాదాలు కూడా చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బీజేపీ కార్యకర్తలను అడ్డుకొని నిలువరించారు. టీఆర్ఎస్ వర్గీయులను అక్కడ నుంచి పంపించేశారు. టీఆర్ఎస్ - బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వేళ హుజూరాబాద్‌లో పోలీసులు ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా పకడ్బందీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
కొనసాగుతున్న ఆసక్తి
హుజురాబాద్ ఉప ఎన్నికకు ఇంకా నోటిఫికేషన్ విడుదల కాక ముందే అక్కడి రాజకీయాలు వేడివేడిగా సాగుతున్నాయి. టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన ఈటల రాజేందర్ రాజీనామా చేసి బీజేపీలో చేరాక.. ఈ నియోజకవర్గంలో ప్రధాన పోటీ గులాబీ - కమలం పార్టీల మధ్యనే సాగుతున్న సంగతి తెలిసిందే. జనం మద్దతు కూడగట్టడమే లక్ష్యంగా ఇప్పటికే బీజేపీ తరపున ఈటల రాజేందర్ పాదయాత్ర కూడా చేస్తున్నారు. టీఆర్ఎస్ మాత్రం ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. ఇప్పటికే తెలంగాణ టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి ఎల్.రమణ, పాడి కౌశిక్ రెడ్డి వంటి ముఖ్య నేతలను కేసీఆర్ టీఆర్ఎస్‌లో చేర్చుకున్నారు. ఆ సమయంలో టీఆర్ఎస్ టికెట్ వారికే అనే ప్రచారం సాగింది. కానీ, టీఆర్ఎస్ అభ్యర్థి విషయంలో రోజుకోపేరు తెరపైకి వస్తోంది. ఈటలకు దీటైన టీఆర్ఎస్ అభ్యర్థి ఎంపికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.