Top 5 Headlines Today: వారినుంచి ప్రాణహాని ఉందన్న పవన్ కల్యాణ్! కాంగ్రెస్ అభ్యర్థుల్ని కేసీఆర్ సెలెక్ట్ చేశారా! నేటి టాప్ 5 హెడ్ లైన్స్
Top 5 Telugu Headlines Today 18 June 2023: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..
కాంగ్రెస్ అభ్యర్థుల్ని కేసీఆర్ సెలెక్ట్ చేశారు, 30 మంది లిస్టు రెడీ - బండి సంజయ్ వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కేసీఆర్ లక్ష్యంగా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మొదటి నుంచి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ రెండూ ఒకటేనని చెబుతూ వస్తున్న బండి సంజయ్ తాజాగా మరో అడుగు ముందుకేసి కాంగ్రెస్ అభ్యర్థులను కేసీఆరే డిసైడ్ చేస్తారంటూ మాట్లాడారు. ఆదివారం (జూన్ 18) ఆయన కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బద్దిపల్లిలో బీజేపీ మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో చిట్ చాట్ చేశారు. దాదాపు 30 మంది కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా కేసీఆర్ సిద్ధం చేశారని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారాన్ని ఖండించారు. పూర్తి వివరాలు
సుపారీ గ్యాంగుల్ని దింపారు, వారినుంచి ప్రాణహాని! పవన్ కల్యాణ్
జనసేన పార్టీ నాయకులతో సమావేశం సందర్భంగా పవన్ కల్యాణ్ తీవ్ర ఆరోపణలు చేశారు. తనకు ప్రాణహాని ఉందని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తనకు తెలిసిందని అన్నారు. అందుకోసం కొందరు ప్రత్యేకంగా సుపారీ గ్యాంగులను దింపారని సమాచారం ఉందని కాకినాడలో జనసేన నేతలతో అన్నారు. కాబట్టి, జనసేన నాయకులతో పాటు జనసైనికులు, వీర మహిళలు జాగ్రత్తగా ఉండాలని, భద్రతా నియమాలను పాటించాలని పవన్ కల్యాణ్ కోరారు. శనివారం రాత్రి (జూన్ 17) కాకినాడలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ నేతల సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలు
హైదరాబాద్ రెండో రాజధానిగా చేయడం అంత ఆషామాషీ కాదు: రేవంత్ రెడ్డి
దేశానికి హైదరాబాద్ రెండో రాజధానిగా ప్రతిపాదన వస్తే పార్టీలో విస్తృతంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇది అంత ఆషామాషీ అంశం కాదన్న రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయ వనరులు రాష్ట్రానికి చెందేలా కేంద్రానికి చెందేలా అన్న అంశంపై చర్చించాల్సి ఉందని అన్నారు. అదే కాకుండా అధికారుల విషయంలోనూ విస్తృతంగా చర్చ జరగాల్సి ఉందని చెప్పారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపై స్పష్టత కోసం సంబంధిత మేధావులతో ఆధ్యాయనం జరగాల్సి ఉందని అభిప్రాయ పడ్డారు. పూర్తి వివరాలు
మోహన్ బాబు అనుచరులు మా హత్యకు కుట్ర చేశారు - ఎంపీటీసీ, ఉపసర్పంచ్ ఆరోపణలు
నటుడు మోహన్ బాబు అనుచరులు తమ హత్యకు కుట్ర చేశారని చంద్రగిరి మండలం, రంగంపేట ఎంపీటీసీ సభ్యులు బోస్ చంద్రారెడ్డి, ఉప సర్పంచ్ మౌనిష్ రెడ్డి ఆరోపించారు. తిరుపతి మారుతి నగర్ లో నివాసం ఉంటున్న ఎంపీటీసీ సభ్యుడు బోస్ చంద్రారెడ్డిని హత మార్చేందుకు ఆరుగురు దుండగులు విఫలయత్నం చేశారని బాధితులు ఆరోపణ చేశారు. వారిలో హేమంత్ అనే యువకుడిని పట్టుకొని బోస్ చంద్రారెడ్డి అనుచరులు చంద్రగిరి పోలీసులకు అప్పగించారు. చంద్రగిరిలోని మోహన్ బాబు యూనివర్సిటీ పీఆర్ఓ సతీష్, మంచు అసోసియేషన్ అధ్యక్షుడు సునీల్ చక్రవర్తి.. నిందితులకు ఫోటోలు పంపించి రూ.3 వేల రూపాయలు ఫోన్ పే ద్వారా పంపారని ఆరోపించారు. పూర్తి వివరాలు
తెలంగాణ వర్సిటీ వీసీని తొలగించే అధికారం గవర్నర్‌దా? గవర్నమెంట్‌దా?
నిత్యం వివాదాలతో వార్తల్లో నిలుస్తుంది నిజామాబాద్ లోని తెలంగాణ విశ్వవిద్యాలయం. గత కొన్ని రోజులుగా ఉపకులపతికి వ్యతిరేకంగా బోధనా సిబ్బంది, బోధనేతర ఉద్యోగులు, విద్యార్థులు ఆందోళన చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి వీసీ రవీందర్ గుప్తా లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడంతో వ్యవహారం కీలక మలుపు తిరిగింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడంతో పాటు ఏకంగా లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు చిక్కడంతో ఆయనను వీసీ పదవి నుంచి తొలగించే వ్యవహారంపై చర్చ జరుగుతోంది. వీసీని తొలగించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందా.. లేదా గవర్నర్ కు ఉంటుందా అనేది విద్యాశాఖ వర్గాలు చర్చిస్తున్నాయి. పూర్తి వివరాలు