Telangana University VC: తెలంగాణ వర్సిటీ వీసీని తొలగించే అధికారం గవర్నర్‌దా? గవర్నమెంట్‌దా?
Telangana University VC: తెలంగాణ వర్సిటీ వీసీ లంచం తీసుకుంటూ ఏసీబీ పట్టుబడ్డారు. ఇప్పుడు ఆయనను తొలగించే అధికారం ఎవరికి ఉందనే విషయంపై చర్చ జరుగుతోంది.
Telangana University VC: నిత్యం వివాదాలతో వార్తల్లో నిలుస్తుంది నిజామాబాద్ లోని తెలంగాణ విశ్వవిద్యాలయం. గత కొన్ని రోజులుగా ఉపకులపతికి వ్యతిరేకంగా బోధనా సిబ్బంది, బోధనేతర ఉద్యోగులు, విద్యార్థులు ఆందోళన చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి వీసీ రవీందర్ గుప్తా లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడంతో వ్యవహారం కీలక మలుపు తిరిగింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడంతో పాటు ఏకంగా లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు చిక్కడంతో ఆయనను వీసీ పదవి నుంచి తొలగించే వ్యవహారంపై చర్చ జరుగుతోంది. వీసీని తొలగించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందా.. లేదా గవర్నర్ కు ఉంటుందా అనేది విద్యాశాఖ వర్గాలు చర్చిస్తున్నాయి.
విశ్వవిద్యాలయాలకు ఉపకులపతులను నియమించే అధికారం, తొలగించే అధికారం పూర్తిగా గవర్నర్ కు మాత్రమే ఉంటుంది. నియామకానికి సిఫార్సు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నా.. తొలగించే అధికారం మాత్రం గవర్నర్ కే ఉంటుందని నిబంధనలు పేర్కొంటున్నాయి. ఇదే విషయాన్ని స్వయంగా వీసీ రవీందర్ గుప్తా కూడా పలు సందర్భాల్లో తెలంగాణ వర్సిటీ పాలక మండలి సమావేశాల్లో ప్రస్తావించినట్లు సమాచారం. కాలేజీ విద్యా కమిషనర్ కు తనను ప్రశ్నించే అధికారమే లేదని ఆయన అన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. తనను వీసీగా తొలగించే అధికారం ప్రభుత్వానికి లేదంటూ ఆయన గట్టిగా మాట్లాడిన తీరు అప్పట్లో వార్తల్లో నిలిచింది. ఇదే క్రమంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడం, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ తనిఖీలు చేయడం, తాజాగా లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడటంతో వీసీ తొలగింపు హాట్ టాపిక్ గా మారింది.
వర్సిటీలకు వీసీలను ఎలా నియమిస్తారు?
ఏదైనా విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్స్‌లర్ ను నియమించడానికి ముందు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తుంది. ఈ ప్రక్రియ కోసం ముగ్గురు సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఇందులో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నుంచి ఒకరు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి విద్యాశాఖ కార్యదర్శి, వీసీ నియామకం జరిగే వర్సిటీ నుంచి పదవీ విరమణ చేసిన నిపుణుడైన మాజీ వీసీ(సాధారణంగా) మొత్తం ముగ్గురు కమిటీలో ఉంటారు. నోటిఫికేషన్ తర్వాత వచ్చే దరఖాస్తులను కమిటీ పరిశీలించి.. అందులో అర్హతలు ఉన్న ముగ్గురి పేర్లను గవర్నర్ కు పంపుతుంది. ఇందులో నుంచి గవర్నర్ ఒకరిని ఎంపిక చేస్తారు. ఆ తర్వాత గవర్నర్ నియామకానికి సంబంధించిన నియామకపు ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ కార్యదర్శి ఇస్తారు.
వీసీలను ఎలా తొలగిస్తారు?
గవర్నర్ నియమించిన వీసీ సరైన వ్యక్తి కాదనుకున్నా, అవినీతి ఆరోపణలు ఎదురైనా లేదా రాష్ట్ర ప్రభుత్వానికి ఇష్టం లేకున్నా.. రెండింట మూడొంతుల అసెంబ్లీ మెజారిటీ తీసుకుని వీసీ తొలగింపు ఉత్తర్వులు ఇస్తారు. ఆ తర్వాత అసెంబ్లీ నిర్ణయాన్ని గవర్నర్ కు పంపుతారు. అలాగే గవర్నర్ కు కూడా వీసీ ని కారణాలు లేకుండా తొలగించే అధికారం ఉండదు. అయితే తెలంగాణ వర్సిటీ వీసీ లాంటి సంక్లిష్టమైన వివాదం గతంలో ఎప్పుడూ ఎదురవ్వలేదు. ఏసీబీ దాడి చేసి వీసీని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం పైనా పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇలా ఏసీబీ దాడి చేయడానికి ముందుగా గవర్నర్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉందా అనే విషయంపై ఉన్నతాధికారులు న్యాయ నిపుణుల సలహా తీసుకున్నారు. అయితే వీసీ వేతనం తీసుకుంటున్నారు కాబట్టి, ప్రజా సేవకుడిగానే చూడాలని నిపుణులు తెలిపారు. కాబట్టి ఏసీబీ చట్టం పరిధిలోకి వస్తారని అంటున్నారు.
వీసీని సస్పెండ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. విచారణలో వీసీ నేరం రుజువైతే ఆయనను శాశ్వతంగా తొలగించే అధికారం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని చెబుతున్నారు. అయితే ప్రతీ విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం మాత్రం ఉంటుందని అంటున్నారు.