Delhi BJP Meeting : ఢిల్లీలో ఈటల, రాజగోపాల్ రెడ్డితో బీజేపీ అగ్రనేతల భేటీ - చివరికి ఏం తేల్చబోతున్నారు ?
పార్టీ మారుతారని ప్రచారం జరుగుతున్న రాజగోపాల్ రెడ్డి, ఈటల రాజేందర్ తో బీజేపీ అగ్రనేతలు సమావేశం అయ్యారు. తెలంగాణలో పార్టీ పరిస్థితిపై వారితో చర్చించినట్లుగా తెలుస్తోంది.
Delhi BJP Meeting : తెలంగాణ బీజేపీలో ఏర్పడిన అసంతృప్త పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు బీజేపీ హైకమాండ్ రంగంలోకి దిగింది. ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలను ఢిల్లీకి పిలిపించింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో వారిద్దరితో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశం అయ్యారు. వారి అసంతృప్తికి కారణాలను అడిగి తెలుసుకున్నట్లుగా భావిస్తున్నారు. భారత రాష్ట్ర సమితిని ఓడించడమే ఏకైక టార్గెట్ గా తాము బీజేపీలో చేరామని కానీ ఇప్పుడు పరిస్థితులు బీఆర్ఎస్‌తో రాజీ పడినట్లుగా ఉన్నాయన్న అభిప్రాయాన్ని వారు హైకమాండ్ ముందు వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.
బీఆర్ఎస్ విషయంలో బీజేపీ మెతకగా వ్యవహరిస్తోందన్న అనుమానాలు
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అందర్నీ అరెస్ట్ చేసి కవితను అరెస్ట్ చేయకపోవడంతో రెండు పార్టీల మధ్య ఢిల్లీలో దోస్తి..గల్లీలో కుస్తీ అని ప్రజలు నమ్ముతున్నారని గతంలోనే కొంత మంది నేతలు వ్యాఖ్యానించారు. ఆ తర్వాత కర్ణాటకలో పలితాలు బీజేపీకి తేడాగా రావడంతో పాటు కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడంతో పరిస్థితి మారిపోయిందని చెబుతున్నారు. బీజేపీకి వచ్చిన హైప్‌ను.. బెంగాల్ తరహా రాజకీయంతో మరింత పెంచుకోవాల్సింది పోయి.. బీఆర్ఎస్ విషయంలో మెతకగా వ్యవహరించి మొత్తం పార్టీ ఎదగకుండా చిక్కుల్లో పడేసుకున్నామని నేతలు అధ్యక్షుడు నడ్డాకు వివరించినట్లుగా తెలుస్తోంది.
వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పని చేస్తున్నామంటున్న బీజేపీ హైకమాండ్
అయితే బీఆర్ఎస్‌తో రాజీ పడే ప్రసక్తే లేదని.. వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టాలనే బీజేపీ టార్గెట్ అని నడ్డా ఈటల రాజేందర్ , కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలకు స్పష్టం చేసినట్లుగా చెబుతున్నారు. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని.. ముందు ముందు బీఆర్ఎస్ పై పోరాటం తీవ్ర స్థాయిలో ఉంటుందని హామీ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. మరో వైపు వీరితో సమావేశంలో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా హుటాహుటిన ఢిల్లీ చేరుకున్నారు. ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్నప్పటికీ వాటిని రద్దు చేసుకుని కిషన్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. ఆయన సమక్షంలోనే వచ్చే ఎన్నికల్లో తెలంగాణ విజయానికి బీజేపీ రెడీ చేసిన ప్రణాళికల గురించి ఈటల , రాజగోపాల్ రెడ్డిలకు వివరించినట్లుగా చెబుతున్నారు.
ఈటల , కోమటిరెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారు ?
కొద్ది రోజులుగా బీజేపీలో యాక్టివ్ గా లేరు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. పార్టీలో ఉన్న అంతర్గత విబేధాలకు తోడు.. బీఆర్ఎస్ పై పోరాటంలో వెనుకడుగు పడటం కూడా దీనికి కారణం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ లోకి వస్తారని.. హైకమాండ్ కు భరోసా ఇస్తున్నారు. ఈటల రాజేందర్ కూడా కాంగ్రెస్ లోకి వెళ్తారన్న ప్రచారం ఊపందుకుంది. హైకమాండ్ చెప్పిన మాటలపై విశ్వాసం ఉంటే.. వీరిద్దరూ బీజేపీలోనే ఉండే అవకాశం ఉంది.. లేకపోతే.. తమ దారి తాము చూసుకునే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial