New Ministers: తెలంగాణ కేబినెట్‌లో చేరబోయే ముగ్గురు మంత్రులు వీళ్లే - బడుగు,బలహీనవర్గాలకే చాన్స్
Telangana: తెలంగాణ కేబినెట్ లో కొత్తగా తీసుకునే ముగ్గురు బలహీనవర్గాలకు చెందిన వారే. రెడ్డి వర్గం నుంచి తీవ్ర పోటీ ఉండటంతో ఎవరికీ అవకాశం కల్పించడం లేదు.

Three new members in Telangana cabinet : తెలంగాణ మంత్రివర్గంలో కొత్తగా ముగ్గురికి అవకాశం కల్పిస్తున్నారు. వారి పేర్లు వివేక్, కవ్వంపల్లి సత్యనారాయణ, వాకిటి శ్రీహరిగా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వీరు ముగ్గురూ బలహీనవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరికి అధికారికంగా ఇంకా రాజ్ భవన్ నుంచి సమాచారం రాలేదని తెలుస్తోంది. ఆదివారం మధ్యాహ్నం రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం ఉంటుంది.
వివేక్ వెంకటస్వామి
కాంగ్రెస్ పార్టీ దిగ్గజ నేతల్లో ఒకరు అయిన కాకా వెంకటస్వామి కుమారుడు గడ్డం వివేక్ . చెన్నూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఉన్నారు. MBBS చదివిన వివేక్, విశాఖ ఇండస్ట్రీస్ ను స్థాపించారు. అలాగే మీడియా సంస్థనూ నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, పలుమార్లు అరెస్టయ్యారు. 2009లో పెద్దపల్లి నుండి ఎంపీగా గెలిచారు. కాంగ్రెస్, BRS, BJPలలో పనిచేసి, 2023లో కాంగ్రెస్‌లోకి తిరిగి చేరారు. విద్య, సామాజిక సేవ, సమాజ సాధికారత కోసం విశాఖ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా రూ.100 కోట్లకు పైగా వెచ్చించారు. మాల వర్గానికి చెందిన ఆయనకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆశీస్సులు ఉండటంతో పదవి లభించింది. వివేక్ సోదరుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. కుమారుడు ఎంపీగా ఉన్నారు.
కవ్వంపల్లి సత్యనారాయణ
కవ్వంపల్లి సత్యనారాయణ మానకొండూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. 1965లో కరీంనగర్ జిల్లాలో జన్మించిన ఆయన, కాకతీయ మెడికల్ కాలేజీ నుండి MBBS, MS పూర్తి చేశారు. వైద్యుడిగా సుదీర్ఘ కెరీర్‌లో, ఆయన అనేక గ్రామాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించి, సామాజిక సేవలో తనదైన ముద్ర వేశారు. 2023 ఎన్నికల్లో రసమయి బాలకిషన్‌ను 32,365 ఓట్ల తేడాతో ఓడించారు. ఎమ్మెల్యేగా, ఆయన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, రెవెన్యూ సదస్సులు, క్రీడా టోర్నమెంట్‌లు వంటి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. మాదిగ వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆ వర్గ ఎమ్మెల్యేలంతా పోరాడారు. ఆ వర్గం నుంచి కవ్వంపల్లికి అవకాశాన్ని హైకమాండ్ ఇస్తోంది.
వాకిటి వాకిటి శ్రీహరి
ముదిరాజ్ వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించడంతో వాకిటి శ్రీహరికి అవకాశం లభిస్తోంది. ఆయన నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం నుండి 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. భారత రాష్ట్ర సమితి (BRS) అభ్యర్థి చిట్టెం రామ్మోహన్ రెడ్డిని 17,525 ఓట్ల తేడాతో ఓడించారు. ఆయన తండ్రి వాకిటి నరసింహులు రైతు. 2001-2006 మధ్య మక్తల్ గ్రామ సర్పంచ్‌గా, 2014-2018 మధ్య జెడ్పిటిసి సభ్యుడిగా పనిచేశారు. 2024లో సమగ్ర కుటుంబ సర్వే, బీసీ కుల గణన వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రోత్సహించారు.
తెలంగాణ మంత్రివర్గంలో మరో మూడు మంత్రి పదవులు ఖాళీగా ఉంటాయి. రెడ్డి సామాజికవర్గం నుంచి చాలా మంది సీనియర్ నేతలు పోటీ పడుతున్నారు. వారిలో ఒకరికి ఇచ్చి మరొకరికి ఇవ్వకపోతే సమస్యలు వస్తాయని పూర్తిగా ఖాళీగా ఉంచుతున్నారు. ఆ ఖాళీలను ఎప్పుడు భర్తీ చేస్తారో .. కానీ వాటికి రేస్ కొనసాగే అవకాశాలు ఉన్నాయి.





















