Hyderabad Burglary Case: హైదరాబాద్‌లో హడలెత్తించిన దొంగలు... మాస్క్ ఆధారంగా పట్టుకున్న పోలీసులు...
పుణెకు చెందిన దొంగలు హైదరాబాద్‌లో ప్రతాపం చూపుతున్నారు. ఈ కేసును సవాలుగా తీసుకున్న హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఎంతో లోతుగా దర్యాప్తు చేపట్టి చివరికి నిందితులను పట్టుకున్నారు.
హైదరాబాద్‌లో పుణె దొంగలు రెచ్చిపోతున్నారు. లక్షల కొద్దీ కొల్లగొడుతున్నారు. కొత్త ప్రాంతం కాబట్టి ఇక్కడైతే ఎవరికీ దొరకబోమనే ధైర్యంతో హైదరాబాద్‌కు వచ్చి చోరీలకు పాల్పడుతున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఎక్కడా ముఖాలు కనిపించకుండా మాస్కులు వేసుకొని జాగ్రత్త పడి మరీ దొంగతనాలు చేస్తున్నారు. ఈ కేసును సవాలుగా తీసుకున్న హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఎంతో లోతుగా దర్యాప్తు చేపట్టి చివరికి నిందితులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.10 లక్షలు విలువ చేసే సొమ్ములు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను శనివారం బషీర్‌బాగ్‌లోని సిటీ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నగర కమిషనర్ అంజనీ కుమార్ వెల్లడించారు.
సీపీ తెలిపిన వివరాల ప్రకారం.. పుణెకు చెందిన సంగట్ సింగ్ అలియాస్ కల్యాణి.. గొర్రెలు, పందుల పెంచుతుంటాడు. దాని ద్వారా వచ్చే డబ్బులు తన కోరికలు తీర్చుకోవడానికి, జల్సాలకు సరిపోకపోవడంతో దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. దాదాపు 15 ఏళ్ల క్రితం నుంచే అతను దొంగతనాలు చేస్తూ ఉన్నాడు. 2005 నుంచి పుణెలో 17 దొంగతనాలు చేసి.. చాలాసార్లు పోలీసులకు పట్టుబడ్డాడు. ఇక లాభం లేదనుకొని, తన దొంగతనాలకు పక్క రాష్ట్రం తెలంగాణను ఎంచుకున్నాడు.
తన అనుచరుడిగా ఉన్న అక్షయ్ పొపాట్ అనే వ్యక్తిని గత నెల 6న హైదరాబాద్‌కు పిలిచాడు. సంగట్ బస్సులో మియాపూర్ చేరుకున్నాడు. మరుసటి రోజు ఇద్దరూ కలిసి మారేడ్‌పల్లిలో రెండు, కాచిగూడ, అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్ల పరిధిలో రెండు ఇళ్లలో దోచుకున్నారు. వచ్చిన పని అయిపోయాక సంగట్ బస్సులో తిరిగి బయలుదేరాడు. అతని అనుచరుడు అక్షయ్ మాత్రం సంగారెడ్డిలో ఓ లాడ్జిలో ఉండి తిరిగి పుణె వెళ్లిపోయాడు.
ఈ చోరీ కేసులను దర్యాప్తు చేపట్టిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు సుమారు 500 కెమెరాలను చాలా క్షుణ్ణంగా పరిశీలించాల్సి వచ్చింది. నిందితులు తమ గుర్తింపును దాచిపెట్టుకునేందుకు మాస్కులు ధరించడంతో పోలీసులకు ఆచూకీ అసలు తెలియలేదు.
అయితే, సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్న క్రమంలో లాడ్జి వద్ద ప్రధాన నిందితుడి అనుచరుడు ఓ నిమిషం పాటు మాస్కును తొలగించడాన్ని ఓ కెమెరాలో పోలీసులు గుర్తించారు. ఆధారాలు సేకరించి శనివారం ఇద్దరు నిందితులతో పాటు వీరి వద్ద నుంచి బంగారాన్ని కొనుగోలు చేసిన విక్రమ్‌సింగ్ రాజ్‌ఫుత్‌ను కూడా అరెస్టు చేశారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. నిందితులను ఎంతో నేర్పుతో పట్టుకున్న టాస్క్‌ఫోర్స్, మారేడ్‌పల్లి పోలీసులను సీపీ అభినందించారు.
https://twitter.com/hydcitypolice/status/1421482277976961033
Also Read: Nalgonda: పూడ్చిన శవాన్ని తవ్వి తీసి పడేశారు.. రోడ్డుపై శవపేటిక, నల్గొండలో అమానవీయ ఘటన