Traffic Restrictions: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్ - 3 రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఈ రూట్లలో వెళ్లొద్దు
Telangana News: ఈ నెల 9న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం సందర్భంగా నగరంలో 3 రోజులు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. ఈ మేరకు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని పోలీసులు సూచించారు.
Three Days Traffic Restrictions In Hyderabad: హైదరాబాద్ (Hyderabad) వాసులకు బిగ్ అలర్ట్. బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం (Balkampeta Yellamma Kalyanam) సందర్భంగా నగరంలో సోమవారం నుంచి బుధవారం వరకూ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నట్లు పోలీసులు తెలిపారు. వాహనదారులు ఈ విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ పి.విశ్వప్రసాద్ తెలిపారు. ఈ నెల 10వ తేదీ రాత్రి 8 గంటల వరకూ ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పారు.
ఈ రూట్లలో..
- గ్రీన్ ల్యాండ్స్, అమీర్ పేట్ కనకదుర్గా ఆలయం వైపు నుంచి సత్యం థియేటర్ మీదుగా ఫతేనగర్ వెళ్లే వాహనాలను బల్కంపేట మీదుగా అనుమతించరు. ఇటు వైపుగా వెళ్లాలనుకునే వారు ఎస్సార్ నగర్ టి - జంక్షన్ నుంచి ఎడమవైపు మలుపు తీసుకుని ఎస్సార్ నగర్ కమ్యూనిటీ కూడలి నుంచి కుడివైపు మలుపు తీసుకుని బీకేగూడ, శ్రీరామ్ నగర్ ఎక్స్ రోడ్డు మీదుగా ఫతేనగర్ వైపు వెళ్లాలి.
- అలాగే, ఫతేనగర్ బ్రిడ్జి మీదుగా అమీర్‌పేట్ వైపు వెళ్లాల్సిన వాహనాలు బల్కంపేట - బేగంపేట లింకు రోడ్డు మీదుగా తాజ్ వివంతా హోటల్ నుంచి యూటర్న్ తీసుకుని, గ్రీన్ ల్యాండ్స్ మీదుగా వెళ్లాలని పోలీసులు సూచించారు.
- గ్రీన్ ల్యాండ్స్, బకుల్ అపార్ట్‌మెంట్స్, ఫుడ్ వరల్డ్ వైపు నుంచి ధరంకరం రోడ్డు మీదుగా వెళ్లే వాహనాలను ట్రాఫిక్ పోలీసులు అనుమతించరు. సోనాబాయి ఆలయం, సత్యం థియేటర్ నుంచి యూటర్న్ తీసుకుని ఎస్సార్ నగర్ టి - జంక్షన్, ఎస్సార్ నగర్ కమ్యూనిటీ హాల్, బీకేగూడ, శ్రీరామ్ నగర్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.
- అటు, బేగంపేట కట్టమైసమ్మ దేవాలయం నుంచి లింకు రోడ్డు మీదుగా బల్కంపేటకు వాహనాలను అనుమతించరు.
- అమీర్ పేట్, బేగంపేట నుంచి వచ్చే వాహనాలను ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మీదుగా సోనీ వైన్స్, ఉమేశ్ చంద్ర విగ్రహం మీదుగా పంపుతున్నారు.
- సనత్ నగర్, ఫతేనగర్, బేగంపేట బైపాస్ రోడ్డు నుంచి వచ్చే వాహనాలను ఆరు అడుగుల రోడ్డు, బల్కంపేట బతుకమ్మ చౌరస్తా నుంచి ఎస్ఆర్ నగర్, అమీర్‌పేట్ మీదుగా మళ్లిస్తున్నారు.
ఈ నెల 9న ఎల్లమ్మ కల్యాణం జరగనుంది. ఇందుకోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 8న కళాకారులతో పుట్టమన్ను తీసుకొచ్చి ఎస్ఆర్ నగర్ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ఎల్లమ్మ దేవస్థానానికి ఊరేగింపుతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 9న ఆలయానికి తూర్పు వైపున ఏర్పాటు చేసిన రేకుల షెడ్డులో అమ్మవారి కల్యాణం నిర్వహిస్తారు. ఈ నెల 10న సాయంత్రం భక్తలతో రథోత్సవం కార్యక్రమం ఉంటుందని అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
అటు, ఆలయం సమీపంలో నాలుగు చోట్ల వాహనాలు పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు తెలిపారు. భక్తులు తమ వాహనాలను ఫతేనగర్ రైల్వే సమీపంలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద ఇరువైపులా పార్క్ చేయాలని, బల్కంపేట ప్రకృతి క్లినిక్, ఎస్ఆర్ నగర్‌లోని రోడ్లు, భవనాల శాఖ, అమీర్ పేటలోని శ్రీ గురుగోవింద సింగ్ ప్లే గ్రౌండ్స్‌లో ఉంచాలని సూచించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలిగినా సహాయం కోసం 9010203626 కు ఫోన్ చెయ్యొచ్చని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.