Rajagopal Reddy To Australia : కౌంటింగ్ మర్నాడే ఆస్ట్రేలియాకు రాజగోపాల్ రెడ్డి ! ఆ టిక్కెట్లు ఆయనవేనా ? నిజం ఏమిటి ?
మునుగోడు ఉపఎన్నికల కౌంటింగ్ ముగిసిన మరునాడే రాజగోపాల్ రెడ్డి ఆస్ట్రేలియా వెళ్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై రాజగోపాల్ రెడ్డి ఇంకా స్పందించలేదు.
Rajagopal Reddy To Australia : మునుగోడు ఉపఎన్నికల్లో కౌంటింగ్ ముగియగానే రాజగోపాల్ రెడ్డి ఆస్ట్రేలియా వెళ్లిపోతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నెల 7న ఆయన ఆస్ట్రేలియాకు వెళ్లనున్నారని దానికి సంబంధించిన విమానం టిక్కెట్లు కూడా వైరల్ అవుతున్నాయి.రాజగోపాల్ రెడ్డి గత కొద్ది రోజులుగా ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన దగ్గర నుంచి ఆయన ప్రచారం నిర్వహించారు. తన ఎమ్మెల్యే స్థానాన్ని తిరిగి దక్కించుకునేందుకు నిర్విరామంగా శ్రమించారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పర్యటించారు.
ఫలితాల ప్రకటన తర్వాత విశ్రాంతి కోసం ఆస్ట్రేలియాకు రాజగోపాల్ రెడ్డి ?
ఈ నెల 6 వ తేదీన ఫలితాలు ప్రకటించగానే 7వ తేదీన ఆస్ట్రేలియా టూర్‌కు వెళుతున్నట్లు తెలుస్తోంది. విశ్రాంతి కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లబోతున్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. తన ప్రయాణానికి సంబంధించి బుక్ చేసుకున్న విమాన టిక్కెట్లు కూడా సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ నెల 7న ఆస్ట్రేలియాకు వెళుతున్నారనే వార్త నిజమేనా? అనే దానిపై కూడా అనుమానం కూడా వ్యక్తమవుతోంది. మరో వైపు గత నెల 15న ఆస్ట్రేలియాకు వెళ్లిన ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. హైదరాబాద్‌కు వచ్చి...అక్కడి నుంచి నల్గొండకు వెళ్లారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత వస్తారన్న ప్రచారం జరిగింది. ముందే రావడంతో.. రహస్యంగా అయినా సోదరుడికి పోల్ మేనేజ్‌మెంట్‌లో సహకరిస్తారన్న అభిప్రాయం వినిపిస్తోంది. అదే సమయంలో ఆయన రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొనేందుకు ఆసక్తి చూపించలేదు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఎయిర్ మలేషియా విమానం టిక్కెట్లు
ఉపఎన్నికల్లో ఫలితంతో సంబంధం లేకుండా రాజగోపాల్ రెడ్డి విశ్రాంతి కోసం ఆస్ట్రేలియా వెళ్తున్నారని.. అంటున్నారు. అయితే ఆయన సోదరుని కుటుంబం ఆస్ట్రేలియా నుంచి తిరిగి వచ్చేసింది. ఇప్పుడు మళ్లీ ఆయన కూడా అక్కడకే ఎందుకు వెళ్తారని అంటున్నారు. ఇటీవలి కాలంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెందిన బ్యాంక్ అకౌంట్ల వివరాలు కూడా బయటకు వచ్చాయి. ఇప్పుడు ఆయన టిక్కెట్ల వివరాలు కూడా రావడంతో బీజేపీ నేతలు తమ ఫోన్లపై నిఘా పెట్టారని ఆరోపణలు గుప్పిస్తున్నారు.
తన విమానం టిక్కెట్లపై జరుగుతున్న ప్రచారాన్ని లైట్ తీసుకున్న రాజగోపాల్ రెడ్డి
ఈ అంశంపై రాజగోపాల్ రెడ్డి ఇంకా ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. ఆయన మునుగోడు ఉపఎన్నికల పనుల్లో బిజీగా ఉన్నారు. బుధవారం పోలింగ్ జరగనుంది. పోలింగ్ లో ప్రభావం చూపించడానికే రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగత విషయాలను బయటకు తీసుకు వచ్చి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారన్న అభిప్రాయాన్ని బీజేపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. కౌంటింగ్ ముగిసిన తర్వాత విదేశీ పర్యటనకు వెళ్తే తప్పేమిటన్న వాదన వారు వినిపిస్తున్నారు.