Telangana Congress Tickets : గాంధీ భవన్‌కు కాంగ్రెస్ సీనియర్ల క్యూ - టిక్కెట్ల కోసం దరఖాస్తులు !
తెలంగాణ కాంగ్రెస్ టిక్కెట్ల కోసం భారీ డిమాండ్ ఏర్పడింది. వెయ్యి మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు.
Telangana Congress Tickets : తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలందరూ టిక్కెట్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. తాము సీనియర్లమని.. తమకు పిలిచి టిక్కెట్ ఇస్తారన్న అభిప్రాయం ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోక తప్పలేదు. రూ. 50వేలు ఫీజు కట్టి మరీ తమకు కావాల్సిన చోట దరఖాస్తు చేసుకున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మధుయాష్కీ, సీనియర్ నేత జానారెడ్డి కుమారులు, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి వారు అందరూ అప్లికేషన్లు ఇచ్చారు. ఒక రోజు ముందే రేవంత్ రెడ్డి తరపున ఆయన అనుచరులు కొడంగల్ టిక్కెట్ కోసం దరఖాస్తు చేశారు. ఖచ్చితంగా దరఖాస్తు చేసుకున్న వారి పేర్లనే పరిశీలిస్తామని హైకమాండ్ చెప్పడంతో.. సీనియర్లు కూడా దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
ఉత్తమ్ కుమార్ రెడ్డి తనకు హుజూర్ నగర్ టిక్కెట్ కోసం.. తన భార్య పద్మావతికి కోదాడ టిక్కెట్ కోసం దరఖాస్తు చేశారు. కాంగ్రెస్ లో ఒక్క కుటుంబానికి ఒక్క టిక్కెట్ అనే రూల్ ఉంది. అయితే ఉత్తమ్ మాత్రం రెండు టిక్కెట్లకు దరఖాస్తు చేసుకున్నారు. ఉత్తమ్ భార్య పద్మావతి గతంలో కోదాడ ఎమ్మెల్యేగా పని చేశారు. ఇద్దరికీ టిక్కెట్ లభిస్తుందో లేదో కానీ.. ఆయన దరఖాస్తు మాత్రం చేశారు. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ అసెంబ్లీ సీటు కోసం దరఖాస్తు చేశారు. సీనియర్ నేత.. నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ అనూహ్యంగా హైదరాబాద్ లోని ఎల్ బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశమయింది.
ఎల్పీనగర్ లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచిన సుధీర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకే టిక్కెట్ ఖరారు చేశారు. దీంతో అక్కడి నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ముందుగా ఆయన కూడా దరఖాస్తు చేసుకున్నారు. అనూహ్యంగా మధుయాష్కీ ఈ సీటు పోటీలోకి రావడం ఆ పార్టీలో చర్చనీయాంశమవుతోంది. మధుయాష్కీకి.. ఎల్బీనగర్ కు సంబంధమే లేదని.. నిజామాబాద్‌లో గెలుపు కష్టమని భావించి గ్రేటర్ పరిధిలోప్రయత్నిస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ రోజులో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తవుతుంది. 119 స్థానాల కోసం దాదాపుగా వెయ్యి దరఖాస్తులు వచ్చినట్లుగా గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ ఈ దరఖాస్తులను వడబోసి.. షార్ట్ లిస్ట్ చేసి అభ్యర్థుల పేర్లను కేంద్ర ెన్నికల కమిటీకి పంపిస్తుంది. మొత్తంగా 119 మంది అభ్యర్థుల జాబితాను ఒకే సారి ప్రకటించాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. కొన్ని చేరికలు ఉండే అవకాశం ఉండటంతో... అవి కూడా ఖరారైన తర్వాత జాబితా ప్రకటిస్తారని అంటున్నారు.