KTR: ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - కేటీఆర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు
Supreme Court: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయన క్వాష్ పిటిషన్‌ను వెంటనే విచారించాల్సిన అవసరం లేదని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది.
Supreme Court Refused To Hear The KTR Quash Petition: ఫార్ములా ఈ కార్ రేస్ (Formula E Car Race) వ్యవహారానికి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు (KTR) సుప్రీంకోర్టులో (Supreme Court) చుక్కెదురైంది. ఈ కేసులో ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను వెంటనే విచారించాల్సిన అవసరం లేదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ నెల 15న క్వాష్ పిటిషన్‌పై విచారణ చేస్తామని స్పష్టం చేసింది. అటు, ఈ కేసుకు సంబంధించి విచారణకు గురువారం ఉదయం కేటీఆర్ బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయంలో హాజరయ్యారు. హైకోర్టు ఆదేశాలతో ఆయన వెంట న్యాయవాదిని అనుమతించారు. అయితే, విచారణను దూరం నుంచి చూడటానికి మాత్రమే ఆయనకు అవకాశం ఉంటుంది ... విచారణ ప్రక్రియలో జోక్యం చేసుకోకూడదని న్యాయవాదికి స్పష్టం చేసింది. రేస్ నిర్వహణకు ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ ఇచ్చిన ఆదేశాలపై ఆయన్ను ప్రశ్నిస్తున్నారు. ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్, రికార్డ్ చేసిన అంశాల ఆధారంగా విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది.
ఏసీబీ విచారణలో ప్రశ్నలివేనా..?
ఫార్ములా ఈ రేస్ వ్యవహారానికి సంబంధించి ఏసీబీ అధికారులు కేటీఆర్‌కు పలు ప్రశ్నలను సంధించినట్లు తెలుస్తోంది. 'అసలు ఫార్ములా ఈ రేస్ ఎందుకు తీసుకురావాలనుకున్నారు.?, ఎవరి నిర్ణయం వల్ల నగదు బదిలీ చేశారు.?, HMDA నిధులు ఎలా బదిలీ చేశారు.?, అగ్రిమెంట్లు, ఆర్బీఐ అనుమతి లేకుండా ఎలా చెల్లింపులు చేశారు.?, HMDA నుంచి ఈ కార్ రేసింగ్‌కు రూ.55 కోట్లు ట్రాన్స్‌ఫర్ ఎలా జరిగింది.?, ఐటీకి HMDA రూ.8.6 కోట్లు ఎందుకు పే చేయాల్సి వచ్చింది.?, 10 సీజన్స్ నిర్వహించాలని వారు షరతులు విధించారా.?, అర్వింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిల పాత్ర ఏంటి.?' వంటి ప్రశ్నలు కేటీఆర్‌ను అడిగినట్లు సమాచారం.
'ఎన్ని కేసులైనా ఎదుర్కొంటాం'
అటు, ఏసీబీ విచారణకు ముందు కేటీఆర్ (KTR) మీడియాతో మాట్లాడారు. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో పైసా కూడా అవినీతి జరగలేదని స్పష్టం చేశారు. 'భాగ్యనగర ప్రతిష్టను పెంచడానికి, బ్రాండ్ ఇమేజ్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు రాష్ట్ర మంత్రిగా ఎన్నో ప్రయత్నాలు చేశాను. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా మా బావమరుదులకు రూ.1,137 కోట్ల కాంట్రాక్టులు ఇచ్చే దౌర్భాగ్యపు పని చేయలేదు. మంత్రిగా ఉంటూ కుమారుడి కంపెనీకి కాంట్రాక్టులు ఇవ్వలేదు. ఆ తెలివితేటలు సీఎం రేవంత్ రెడ్డి, ఆయన మంత్రివర్గ సహచరులకే ఉన్నాయి. నేనే ఏ పని చేసినా హైదరాబాద్ ప్రతిష్ట పెంచేందుకే చేశాను. అరపైసా అవినీతి చేయలేదు. చేయబోను. కొంతమంది కాంగ్రెస్ నేతలు మాపై బురద జల్లుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై మేం ప్రశ్నిస్తూనే ఉంటాం. మాకు న్యాయస్థానాలు, చట్టాలు, రాజ్యాంగంపై పూర్తి విశ్వాసం ఉంది.' అని కేటీఆర్ పేర్కొన్నారు.
కేటీఆర్ ఏసీబీ విచారణ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆమె భర్త తో కలిసి వెళ్లి కేటీఆర్‌ను పరామర్శించారు.