TS Highcout : కమలాపూర్ టెన్త్ విద్యార్థికి హైకోర్టులో ఊరట - పరీక్షలు రాసేందుకు గ్రీన్ సిగ్నల్ !
పేపర్ లీక్ కేసులో డీబార్ అయిన విద్యార్థి పరీక్షలు రాసేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది.
TS Highcout : తెలంగాణలో రాజకీయ సంచలనం సృష్టించిన టెన్త్ పేపర్ లీక్ కేసులో అసలు బాధితుడిగా మారింది ఓ టెన్త్ విద్యార్థి. ఆ విద్యార్థి పేపర్‌నే ఫోటో తీసుకుని బయటకు పంపారు. అది వైరల్ అయింది. బండి సంజయ్‌ను ఈ కేసు లో ప్రధాన నిందితుడిగా పెట్టారు.ఏ -4గా విద్యార్థిని పెట్టారు. మైనర్ కావడంతో వివరాలు పోలీసులు బయట పెట్టలేదు. కానీ ఆ విద్యార్థిని పరీక్షలు రాయకుండా డిబార్ చేశారు. దీంతో ఆ విద్యార్థి తండ్రి హైకోర్టును ఆశ్రయించారు. పదో తరగతి హిందీ పరీక్షా పత్రం లీకేజీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థికి ఊరట లభించింది. ఏప్రిల్ 10 నుంచి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసేందుకు తెలంగాణ హైకోర్టు అనుమతిచ్చింది.
ఈ కేసులో పేపర్ లీకేజీ ఆరోపణ కింద ఏప్రిల్ 6న అధికారులు విద్యార్థిని డిబార్ చేశారు. దీంతో ఆవేదన వ్యక్తం చేస్తూ.. తనకేం తెలియదని, తాను ఎగ్జామ్ రాస్తుండగా కిటీకీలో నుంచి ఓ వ్యక్తి చేయి పెట్టి తన పేపర్ గుంజుకున్నాడని మీడియం ఎదుట వాపోయాడు. ఏప్రిల్ 4 న వరంగల్ జిల్లా కమలాపుర్ లో పదో తరగతి హిందీ పేపర్ లీకేజీ కేసుపై విద్యార్థి తండ్రి హైకోర్టులో హౌస్ మోషన్ దాఖలు చేశారు. తన కొడుకును టెన్త్ పరీక్షలు రాసేలా అనుమతి ఇవ్వాలని పిటిషన్ లో పేర్కొన్నారు. హిందీ పరీక్ష రాస్తుండగా ఎవరో బలవంతంగా తన కొడుకు పేపర్ లాకున్నారని తెలిపారు. కమలాపుర్ లో ఫైల్ అయిన ఎఫ్ఐఆర్ లోనూ తమ కొడుకు పేరు లేదని ఆ తండ్రి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
అయినా అధికారులు హిందీ తర్వాత మళ్లీ ఏ పరీక్షనూ రాయనివ్వలేదన్నారు. తన కొడుకును రాజకీయాలకు బలి చేశారని, మిగతా పరీక్షలకు అనుమతి ఇవ్వాలని పిటిషన్ లో తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు.. విద్యార్థి మిగతా పరీక్షలు రాసేందుకు అనుమతిచ్చింది. విద్యార్థి చెబుతున్న దాని ప్రకారం.. కిటికీ నుంచిలాక్కుని ఫోటోలు తీసుకుని వాటిని సర్క్యులేట్ చేశారు. ఎవరు ఫోటో తీశారో తెలియదు కానీ.. ప్రశాంత్ అనే మాజీ జర్నలిస్టుకు పేపర్ చేరింది. అక్కడ్నుంచి కొన్ని గ్రూపులతో పాటు బండి సంజయ్‌కు చేరింది. బండి సంజయ్‌కు వాట్సాప్‌లో పేపర్ పంపిన తర్వాత ప్రశాంత్ ఆయనకు ఫోన్ చేసి మాట్లాడారు. దీంతో ఆయనే కుట్రదారుడని పోలీసులు కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. అయితే ఒక్క రోజులో ఆయనకు బెయిల్ వచ్చింది.
ఈ మొత్తం వ్యవహారంలో ఈ విద్యార్థి బలైపోయాడు. పరీక్షలు రాయనివ్వకపోవడంతో అత్యవసరంగా హైకోర్టు నుంచి అనుమతి తెచ్చుకున్నప్పటికీ ఓ పరీక్షను మిస్ అయ్యాడు. అతని కోసం ప్రత్యేకంగా ఎగ్జామ్ పెట్టే అవకాశం ఉండదు. ఈ విషయంలో కోర్టు ఎలాంటి డైరక్షన్ ఇవ్వలేదు కాబట్టి... అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పెట్టినప్పుడు రాసుకోవాల్సి ఉంటుందని భావిస్తున్నారు. హైకోర్టు తీర్పుపై విద్యార్తి తండ్రి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.