Buses For Group-1 Exam: తెలంగాణ గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్, ఎగ్జామ్ రోజు టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
RTC To Run Special Buses for Group1 Prelims Exam: తెలంగాణ వ్యాప్తంగా జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ జరుగుతోంది. అభ్యర్థుల సౌకర్యార్థం టీజీఆర్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది.
TGPSC Group-1 Exam | హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమనరీ ఎగ్జామ్ రాసే అభ్యర్థులకు రాష్ట్ర ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. అభ్యర్థుల సౌకర్యార్థం టీజీఎస్ ఆర్టీసీ (#TGSRTC) ప్రత్యేక బస్సులను నడుపుతోంది. రాష్ట్రంలోని 897 పరీక్షా కేంద్రాలకు బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులకు ఇప్పటికే సంస్థ యాజమాన్యం ఆదేశాలు ఇచ్చింది. జూన్ 9న ఆదివారం గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ కావడంతో రవాణాపరంగా అసౌకర్యం కలగకుండా ఆర్టీసీ చర్యలు తీసుకుంది.
ఆయా పాయింట్ల నుంచి ప్రత్యేక బస్సులు
హైదరాబాద్ నుంచి జిల్లాలకు రద్దీ ఎక్కువగా ఉందని గమనించిన ఆర్టీసీ.. శనివారం సాయంత్రం నుంచే ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్, ఎల్బీనగర్, ఆరాంఘర్ పాయింట్లలో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఆయా ట్రాఫిక్ జనరేటింగ్ పాయింట్లలో ప్రత్యేక అధికారులను నియమించారు. రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను వారు అందుబాటులో ఉంచుతారని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. రాష్ట్రంలోని ప్రధాన బస్ స్టేషన్లలో 'May I Help You' కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అక్కడ పరీక్షా కేంద్రాల సమాచారాన్ని అభ్యర్థులకు ఇవ్వడంతో పాటు ఏ బస్సులో వెళ్లాలో అధికారులు చెబుతారు.
తెలంగాణలో ఇప్పటివరకూ ఒక్కసారి కూడా గ్రూప్ 1 ఉద్యోగాలు భర్తీ చేయలేదు. రెండుసార్లు ఎగ్జామ్ నిర్వహించినా, పలు కారణాలతో రద్దు చేయాల్సి వచ్చింది. తాజాగా మూడోసారి గ్రూప్-1 ప్రిలిమినరీకి 4.03 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. అందులో గ్రేటర్ హైదరాబాద్ (GHMC)లోనే దాదాపు 1.70 లక్షల మంది రాస్తున్నారు. అభ్యర్థులకు రవాణా పరంగా అసౌకర్యం కలగకుండా సిటీ బస్సులను అందుబాటులో ఉంచారు. ఆర్టీసీ బస్సుల్లో క్షేమంగా పరీక్షా కేంద్రాలకు వెళ్లి, ఏ ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా గ్రూప్-1 ప్రిలిమనరీ పరీక్ష రాయాలని టీజీఎస్ ఆర్టీసీ సూచించింది. అదే విధంగా అభ్యర్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పింది.
రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష కోసం 895 కేంద్రాలను ఏర్పాటు చేశారు. జూన్ 9న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నారు. అత్యధికంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోనే 105 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఉదయం 9 గంటల నుంచి అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. పరీక్ష ప్రారంభానికి అరగంట (ఉదయం 10 గంటల) ముందే గేట్లు మూసివేయడంతో అభ్యర్థులకు ఎంట్రీ క్లోజ్ అవుతుంది. అభ్యర్థులు హాల్ టికెట్లపై ఉన్న సూచనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. నాలుగైదు రోజుల కిందట హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకున్న వారు కొత్త హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోవడం బెటర్. క్రిమి లేయర్, క్యాస్ట్ సంబంధిత విషయాలు కొత్త హాల్ టికెట్లో అప్‌డేట్ చేశారు. హాల్ టికెట్లో ఫొటోలు, సిగ్నేచర్ సరిగ్గా లేని వారు టీజీఎస్ పీఎస్సీ సూచించిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
గ్రూప్ 1 అభ్యర్థులకు ఆల్ ది బెస్ట్ - సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) నిర్వహిస్తున్న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఎంతో కాలం నుంచి కష్టపడి పరీక్షకు సిద్ధమైన అభ్యర్థులు సమయానికి కేంద్రాలకు చేరుకుని ఎలాంటి ఒత్తిళ్ళకు గురికాకుండా పరీక్ష రాయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.