RTC Buses: ప్రయాణికులకు గుడ్ న్యూస్ - దసరా సందర్భంగా 6 వేల ప్రత్యేక బస్సులు, ప్రత్యేక రైళ్లు సైతం..
Telangana News: దసరా, దీపావళి పండుగల సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. రద్దీ దృష్ట్యా 6 వేల ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది.
TGSRTC Special Buses: ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) గుడ్ న్యూస్ చెప్పింది. దసరా పండుగను పురస్కరించుకుని 6 వేల ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచనుంది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ (VC Sajjanar) కీలక ప్రకటన చేశారు. ప్రయాణికులు ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ లేదా బస్ స్టేషన్లలో టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపారు. హైదరాబాద్ శివారు నుంచి ఓఆర్ఆర్ మీదుగా విజయవాడ, బెంగుళూరుకు సర్వీసులు అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు. కరీంనగర్, నిమాజాబాద్ మార్గాల్లో ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులు అందుబాటులో ఉండనున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. అటు, ఏపీఎస్ఆర్టీసీ సైతం 6,100 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్ నుంచి 900 బస్సులు, బెంగుళూరు నుంచి 275 బస్సులు, చెన్నై నుంచి 65 బస్సులు వివిధ పట్టణాలకు నడపనున్నట్లు వెల్లడించింది. విశాఖ నుంచి 320, రాజమండ్రి నుంచి 260, విజయవాడ నుంచి 400 బస్సులు.. అలాగే రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి వివిధ ప్రాంతాలు/పల్లెలు/నగరాలకు 730 ప్రత్యేక బస్సులు కేటాయించినట్లు తెలిపింది.
అటు, బీహెచ్ఎల్ డిపో నుంచి ఓఆర్ఆర్ మీదుగా విజయవాడకు కొత్తగా 2 ఈ - గరుడ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు రంగారెడ్డి రీజనల్ మేనేజర్ శ్రీలత తెలిపారు. సోమవారం నుంచి ఈ సర్వీసులు ప్రారంభమవుతాయని.. రామచంద్రపురం, బీరంగూడ, చందానగర్, మియాపూర్, నిజాంపేట్ క్రాస్ రోడ్స్, హౌసింగ్ బోర్డ్ మీదుగా జేఎన్టీయూ రైతు బజార్, మలేషియా టౌన్ షిప్, శిల్పారామం, సైబర్ టవర్స్, మై హోమ్ భుజా, సైబరాబాద్ కమిషనరేట్, టెలికాంనగర్ మీదుగా ఓఆర్ఆర్ నుంచి విజయవాడకు ప్రయాణిస్తాయని వెల్లడించారు. ప్రతి రోజూ రాత్రి 9:30, 10:30 గంటలకు రామచంద్రాపురం నుంచి ఈ బస్సులు బయలుదేరుతాయని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
ప్రత్యేక రైళ్లు
మరోవైపు, దక్షిణ మధ్య రైల్వే సైతం దసరా, దీపావళి పండుగల రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను నడపనుంది. అక్టోబర్ నెలలో సుమారు 650 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు తెలిపారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి నవంబర్ 30 వరకూ మొత్తం 6 వేల ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్లు చెప్పారు. అక్టోబర్ 1, 8, 15, 22, 29.. నవంబర్ 5, 12 తేదీల్లో కాచిగూడ - తిరుపతి మధ్య రైళ్లు నడవనున్నాయి. అలాగే, సికింద్రాబాద్ - తిరుపతి మధ్య కూడా సర్వీసులు నడపనున్నారు. అలాగే, అక్టోబర్ 21 నుంచి నవంబర్ 27వ తేదీ వరకూ సోమ, బుధవారాల్లో నాందేడ్ నుంచి పన్వేల్‌కు 12 ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. వీటితో పాటు అక్టోబర్ 11వ తేదీ నుంచి నవంబర్ 29 వరకూ ప్రతీ శుక్రవారం కొచువెలి నుంచి నిజాముద్దీన్ వరకూ 8, అక్టోబర్ 14 నుంచి డిసెంబర్ 2 వరకూ నిజాముద్దీన్ - కొచువెలి మధ్య 8, అక్టోబర్ 21వ తేదీ నుంచి నవంబర్ 11 వరకూ ప్రతీ సోమవారం పుణే నుంచి కరీంనగర్ వరకూ 4 ప్రత్యేక రైళ్లు, అక్టోబర్ 23 నుంచి నవంబర్ 13 వరకూ ప్రతీ బుధవారం కరీంనగర్ నుంచి పుణే వరకూ 4 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.