TU Students Dharna: తెలంగాణ యూనివర్శిటీ విద్యార్థుల రెండో రోజు నిరసన
TU Students Dharna: తెలంగాణ విశ్వవిద్యాలయం విద్యార్థులు రెండో రోజు ధర్నా చేస్తున్నారు. వర్సిటీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.
TU Students Dharna: నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులు మరోసారి పోరు బాట పట్టారు. వర్సిటీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని నిరసన చేస్తున్నారు. సమస్యలను రిజిస్ట్రార్, వీసీ దృష్టికి తీసుకు వెళ్లినా కనీసం స్పందించడం లేదని విద్యార్థులు ఆరోపించారు. కనీస వసతులపై కూడా పట్టించుకోవటం లేదని విద్యార్థులు నిరసనకు దిగారు.
రెండో రోజు నిరసన
తెలంగాణ యూనివర్సిటీలో చదువుకుంటే కలెక్టర్ కాదు కదా కనీసం అటెండర్ ఉద్యోగం కూడా సాధించలేమని.. తెలంగాణ యూనివర్సిటీ వీసీ రవీందర్ పై విద్యార్థులు మండిపడ్డారు. యూనివర్సిటీలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. మంగళవారం నుంచి నిరసనకు చేస్తున్నారు. బుధవారం కూడా విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. విద్యార్థులు పెద్ద సంఖ్యలో వర్సిటీ వద్ద బైఠాయించిన ధర్నా నిర్వహిస్తున్నారు. వర్సిటీ అధ్యాపకులు, బోధనేతర సిబ్బందిని లోపలికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు.
సమస్యల తాండవం
సౌకర్యాలు కల్పించకుండానే క్యాంపస్ విద్యార్థులు బాగా చదువుకుని కలెక్టర్ ఉద్యోగాలు సాధించాలని పేర్కొన్న తెలంగాణ యూనివర్సిటీ వీసీ రవీందర్‌పై విద్యార్థులు మండిపడ్డారు. దీంతో ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సీహెచ్ ఆరతి, చీఫ్ వార్డెన్ అబ్దుల్.. విద్యార్ధులను సముదాయించాలని ప్రయత్నించినా వినలేదు. విద్యార్థులు మాట్లాడుతూ ముఖ్యంగా నెల రోజుల నుంచి హాస్టల్స్, క్యాంపస్ లో వై-ఫై రావడం లేదని విద్యార్థులు పేర్కొన్నారు. విద్యార్థులకు కరోనా సోకినా పట్టించుకోలేదని అన్నారు.
'కలెక్టర్ కాదు కదా కంపౌoడర్ ఉద్యోగం కూడా రాదు'
కనీస సౌకర్యాలు లేకుండా చదువుకుని ఉన్నత ఉద్యోగాలు సాధించాలని వీసీ చెబుతున్నారని, కానీ కనీసం ఇంటర్నెట్ వసతి లేకపోతే పోటీ పరీక్షలకు ఎలా సిద్ధం కావాలని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టళ్లకు అంబులెన్స్ సౌకర్యం లేదని, ఫుల్ టైం ఎంబీబీఎస్ వైద్యుడు ఉండాలని కోరారు. హాస్టళ్లలో జనరేటర్ కావాలని, క్రీడా మైదానాన్ని బాగు చేయించాలని డిమాండ్ చేశారు. బాలికల హాస్టళ్లలో కోతుల బెడద లేకుండా చూడాలని, రవాణా సౌకర్యం కోసం ఆర్టీసీ బస్సును ఏర్పాటు చేయించాలన్నారు. జిరాక్సుల కోసం డిచ్ పల్లి వెళ్లాల్సి వస్తోందని తెలిపారు. ఆడిటోరియం నిర్మాణం చేపట్టాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల సమస్యలు వీసీకి నవ్వులాటగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ కాన్ఫరెన్స్ పేరుతో లక్షలు వృథా చేశారని విమర్శించారు. నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. వీసీ రాజీనామా చేయాలని నినదిస్తూ నిరసన చేపట్టారు.
మధ్యాహ్న భోజనాన్ని సైతం మెయిన్ గేటు వద్దే చేశారు. యూనివర్సిటీలో ఉన్న కనీస సమస్యల పరిష్కారంపై వీసీ స్పందించక పోవటం సిగ్గుచేటని విద్యార్థులు విమర్శించారు. తమ సమస్యలు పరిష్కరించకుంటే ట్రిపుల్ ఐటీ తరహాలో ఆందోళనలు కొనసాగిస్తామన్నారు విద్యార్థులు.
14 నెలల్లో 5 సార్లు రిజిస్ట్రార్ల మార్పు
యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ శివశంకర్ ను వీసీ రవీందర్ గుప్తా మార్చారు. ప్రొ. శివ శంకర్ స్థానంలో బి. విద్యావర్థినికి రిజిస్ట్రార్ గా బాధ్యతలు అప్పగించారు. పద్నాలుగు నెలల్లో ఇప్పటికే ఐదు సార్లు రిజిస్ట్రార్ లను మార్చారు తెలంగాణ వర్సిటీ వీసీ రవీందర్ గుప్తా.