Telangan Seed Hub: తెలంగాణకు మరో అంతర్జాతీయ ఘనత... ప్రపంచ విత్తన భాండాగారంగా గుర్తించిన ఎఫ్ఏవో..!
తెలంగాణకు మరో అంతర్జాతీయ గుర్తింపు లభించింది. అంతర్జాతీయ ఆహార సంస్థ తెలంగాణను ప్రపంచ విత్తన భాండాగారంగా గుర్తించింది. ఈ నెల 4,5 తేదీల్లో విత్తన పరిశ్రమల అభివృద్ధి సదస్సుకు తెలంగాణను ఆహ్వానం వచ్చింది.
తెలంగాణకు ప్రపంచ విత్తన భాండాగారంగా ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ ఆహార సంస్థ (FAO) గుర్తింపు లభించింది. ఈ విషయాన్ని విత్తనాభివృద్ధి సంస్థ అధికారులు వెల్లడించారు. వ్యవసాయ, విత్తన రంగ అభివృద్ధ్యే లక్ష్యంగా అంతర్జాతీయ ఆహార సంస్థ నవంబర్ 4, 5 తేదీలలో విత్తన పరిశ్రమల సమగ్ర అభివృద్ధిపై అంతర్జాతీయ విత్తన సదస్సు నిర్వహించనుంది. “A Success Story of India : Telangana State as a Global Seed Hub” అనే అంశంపై ప్రసంగించేందుకు తెలంగాణ ప్రభుత్వానికి ఎఫ్ఏవో ఆహ్వానం పంపింది. ప్రభుత్వం తరపున విత్తన సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ డా. కేశవులు హాజరు కానున్నారు. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి అరుదైన గౌరవం దక్కిందని అధికారులు తెలిపారు. దాదాపు 195 ప్రపంచ దేశాలకు చెందిన మంత్రులు, FAO ప్రతినిధులు, విత్తన ప్రముఖులు, శాస్త్రవేత్తలు, విత్తన పరిశ్రమల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొననున్నారు. తెలంగాణ విత్తన ఖ్యాతిని అంతర్జాతీయ భాషలైన ఇంగ్లీష్, స్పానిష్, ఫ్రెంచ్ భాషలలో ప్రసారం చేయనున్నారు.
మంత్రి నిరంజన్ రెడ్డి అభినందనలు
తెలంగాణలో విత్తనోత్పత్తికి ఉన్న మౌలిక వసతులు, అవకాశాలు, విత్తన పరిశ్రమ సామర్థ్యం, విత్తన రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సీడ్ బౌల్ కార్యాక్రమాలపై విత్తన కేశవులు ప్రసంగించున్నారు. తెలంగాణ నుంచి మరిన్ని విత్తన ఎగుమతులు ప్రోత్సహించి, విత్తన రంగ అభివృద్ధి, విత్తన వాణిజ్యాన్ని మరింత పెంపొందించేందుకు ఎంతగానో దోహదపడనుంది. ప్రపంచ విత్తన భాండాగారంగా గుర్తింపు పొందడంపై తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థను, ఎండీ కేశవులును మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అభినందించారు.
Also Read: కాంగ్రెస్ సభ్యత్వం తీసుకుంటే రూ. 2 లక్షల బీమా.. డిసెంబర్ 9న హైదరాబాద్‌లో రాహుల్ సభ !
తెలంగాణలో రైతు రాజ్యం : మంత్రి నిరంజన్ రెడ్డి
రాష్ట్రంలో రైతుల పరిస్థితి 2014 తెలంగాణకు ముందు, తర్వాత బేరీజు వేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి నియోజకవర్గం గోపాల్ పేట్ లో రైతుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ రైతు రాజ్యంంగా నిలవాలన్న సంకల్పంతోనే సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని పేర్కొన్నారు. వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత దేశంలో ఎవరూ ఇవ్వడంలేదన్నారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్, సాగునీరు, రైతుబంధు కింద పంట పెట్టుబడి, రైతు బీమా పథకాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నారన్నారు. సంప్రదాయ పంటల సాగు నుంచి రైతులు బయటకు రావాలని, ఏ రకమైన పంటలు పండిస్తే మార్కెట్‌లో డిమాండ్ ఉంటుందో వాటినే పండించాలని సూచించారు. ఆహార ధాన్యాల పంటలతో పాటు ఉద్యాన పంటల మీద ఇకపై ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. పండ్ల తోటలు, ఆయిల్ పామ్, నూనె గింజల సాగు మీద దృష్టిపెట్టాలన్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి, ఆదాయం వచ్చే పంటలను సాగుచేయాలన్నారు.
Also Read: ఆర్టీసీ ఆదాయం పెంచేందుకు సజ్జనార్ మరో ఐడియా... ఈసారి ప్రిన్స్ మహేశ్ బాబు రంగంలోకి...!
25 వేల మందితో అన్నదాత ఆత్మీయ సమ్మేళనం
డిజిటల్ స్క్రీన్లతో రైతులకు రైతు వేదికల ద్వారా వ్యవసాయ సమాచారం అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. అధునాతన సాంకేతికతో రైతులకు శిక్షణ అందించేందుకు కృషి చేస్తామన్నారు. మార్కెటింగ్ నెట్ వర్క్ ను వ్యవసాయరంగానికి అనుసంధానం చేసేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. 41 రైతు వేదికలలో రైతు ఆత్మీయ సమ్మేళనాల ద్వారా వచ్చిన సూచనలు, సలహాలను పరిశీలిస్తామన్నారు. త్వరలో 25 వేల మందితో వనపర్తిలో అన్నదాతల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమ్మేళనానికి వ్యవసాయ విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ నిపుణులు, వ్యవసాయ అనుబంధ రంగాల నిపుణులను ఆహ్వానిస్తామన్నారు.
Also Read: హుజూరాబాద్, బద్వేల్ కౌంటింగ్ కౌంట్ డౌన్ ... మరికొన్ని గంటల్లో ఉత్కంఠకు తెర...