![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Telangana: తెలంగాణలో ఆస్తుల విలువ ఖరారు, ఫిబ్రవరి 1 నుంచే అమలు.. ఎంత పెంచారంటే..
వ్యవసాయ భూముల మార్కెట్ విలువలు 50 శాతం, ఖాళీ ప్లాటవి 35 శాతం, అపార్ట్‌మెంట్లలోని ఫ్లాట్ల విలువను 25 నుంచి 30 శాతం పెంచుతూ రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయం తీసుకుంది.
![Telangana: తెలంగాణలో ఆస్తుల విలువ ఖరారు, ఫిబ్రవరి 1 నుంచే అమలు.. ఎంత పెంచారంటే.. telangana stamps and registration department increases market value of assets Telangana: తెలంగాణలో ఆస్తుల విలువ ఖరారు, ఫిబ్రవరి 1 నుంచే అమలు.. ఎంత పెంచారంటే..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/28/b124455e34718c7efa44d7553567cfa4_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
తెలంగాణలో వ్యవసాయ భూములు, వ్యవసాయేతర ఆస్తుల విలువ పెంపకానికి సంబంధించి కీలక ఉత్తర్వులు వెలువడ్డాయి. ఫిబ్రవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతున్న నేపథ్యంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల విలువలను పెంచుతూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయ భూముల మార్కెట్ విలువలు 50 శాతం, ఖాళీ ప్లాటవి 35 శాతం, అపార్ట్‌మెంట్లలోని ఫ్లాట్ల విలువను 25 నుంచి 30 శాతం పెంచుతూ రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సంబంధిత ఉన్నతాధికారులు గురువారం సుదీర్ఘ సమీక్ష జరిపిన అనంతరం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఈ ప్రతిపాదనలను జిల్లా రిజిస్ట్రార్లకు కూడా పంపింది.
అనంతరం రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శుక్ర, శనివారాల్లో ప్రతిపాదనలను ఆమోదించి పంపించేలా చర్యలు తీసుకోవాలని అందరు రిజిస్ట్రార్లను ఆదేశించారు. పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల్లో మార్కెట్ విలువల కమిటీకి అదనపు కలెక్టర్లు, గ్రామీణ ప్రాంతాల్లో ఆర్డీవోలు ఛైర్మన్లుగా వ్యవహరిస్తున్నారు. కమిటీలో సభ్యులుగా ఉండే అధికారులందరూ ఒకే చోట సమావేశమై ప్రక్రియ ముగించాలని కమిషనర్ సూచించారు. సవరించిన మార్కెట్ విలువలు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రభుత్వం కలెక్టర్లకు ఇప్పటికే సమాచారం ఇచ్చింది. ఇప్పటికే అమలులో ఉన్న ఆస్తుల మార్కెట్ విలువలకు, కొత్త ప్రతిపాదించిన ఆస్తుల విలువల మధ్య సరాసరిగా 35-40 శాతం తేడా ఉండనున్నట్లుగా అధికారులు వెల్లడించారు.
మరోవైపు, కమర్షియల్ కాంప్లెక్సుల్లో అన్ని ఫ్లోర్‌లకు ఒకేరకమైన మార్కెట్ విలువను నిర్ణయించారు. స్థలాల విలువల సగటు 35 శాతం పెరిగినట్లు పేర్కొన్నారు. తక్కువ విలువ ఉన్న ప్రాంతాల్లో 50 శాతం, అపార్ట్‌మెంట్లలో చదరపు అడుగుకు 25-30 శాతం దాకా పెంచారు. వ్యవసాయ భూముల మార్కెట్ విలువ 50 శాతం వరకూ పెరిగింది. వచ్చే నెల మొదటి నుంచి రిజిస్ట్రేషన్ ధరల పెరుగుదలతో అందరూ ఈలోపే రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ కార్యాలయాలపై ఒత్తిడి పెరిగింది.
రాత్రి 10 గంటల వరకు రిజిస్ట్రేషన్
ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఆస్తుల మార్కెట్ విలువలు పెరగనున్నందున హైదరాబాద్ చుట్టుపక్కల సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కార్యాలయాలకు తాకిడి పెరిగింది. సాధారణంగా రోజుకు 40-50 రిజిస్ట్రేషన్లు జరిగే చోట 120 నుంచి 150 వరకూ జరిగాయి. దీంతో కొన్నిచోట్ల అర్ధరాత్రి వరకు కార్యాలయాలను నడిపించినట్లు తెలుస్తోంది. మరికొన్ని చోట్ల రాత్రి 10 గంటల వరకూ రిజిస్ట్రేషన్లు కొనసాగాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)